రాష్ట్రీయం

ఖరీఫ్‌కు గోదారి నీళ్లిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 2: కృష్ణాడెల్టా రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించుకునేందుకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి నీటిమట్టం 14 అడుగులకు మించి ప్రవహిస్తున్న దృష్ట్యా ఈ నెల 6న పట్టిసీమ పథకం 24 పంపుల ద్వారా నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువకు మళ్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి ఈ నీరు చేరేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందని, అక్కడనుంచి నేరుగా కృష్ణాడెల్టాకు తరలి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణాడెల్టా రైతాంగం జూలైలోనే వ్యవసాయ పనులు ప్రారంభించుకునే అవకాశం పట్టిసీమ పథకం వల్ల తమ ప్రభుత్వం కల్పించిందని ముఖ్యమంత్రి గుర్తుచేసారు. ఇందువల్ల పంట పక్వానికి వచ్చే సమయానికి తుఫాన్‌ల బెడద ఉండదన్నారు. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను కోల్పోయే పరిస్థితి గతంలో మాదిరిగా తలెత్తదన్నారు. రాబోయే రోజుల్లో నీటికి సంబంధించిన వివాదాలు అధికమయ్యే అవకాశం ఉందన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని ‘పాలార్’ చెక్‌డ్యాం ఎత్తు పెంపు విషయమై తమిళనాడు రాష్ట్రం నుంచి అభ్యంతరం వ్యక్తమవడాన్ని ముఖ్యమంత్రి ఉదహరించారు. గత సంవత్సరం జూలై నెలతో పోలిస్తే ఈ సంవత్సరం జూలై నెల భూగర్భజలాలు 2.36 మీటర్ల మేర పెరిగాయన్నారు. ఇందువల్ల సుమారు 216 టిఎంసిల నీరు భూగర్భంలో నిల్వ వున్నట్లు ఆయన తెలిపారు. దీంతో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలమన్నారు. అదే విధంగా గత సంవత్సరం జూన్ నెలతో పోలిస్తే రాష్ట్రంలో సగటున భూగర్భ జలమట్టం 11.09 మీటర్లకు పెరిగిందన్నారు. కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై సర్వే చేపట్టడం జరిగిందన్నారు. ఈ రెండు నదుల అనుసంధానం వల్ల లభ్యమయ్యే నీటిని సుంకేశుల, నెల్లూరు బ్యారేజీలో నిలువ ఉంచవచ్చన్నారు. అదే విధంగా సోమశిల-కండలేరులో 160 టిఎంసిలు నిల్వ ఉంచొచ్చని, అయితే ఇందుకు ఎత్తిపోతల పథకం అవసరమవుతుందన్నారు. వంశధార-నాగావళి నదుల అనుసంధానంపై సర్వే పూర్తయిందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు అక్టోబర్ 30, 2017 నాటికి, గాలేరు-నగరి మొదటి పనులు 2017 జూన్ 30 నాటికి పూర్తిచేస్తామన్నారు. హంద్రీ-నీవా తొలి దశ పనులు పూర్తిచేసి లక్షా 40వేల ఎకరాలకు నీరందిస్తామన్నారు.
ఎకరం భూమిలో రెండు సెంట్లు పంట కుంటల తవ్వకానికి కేటాయించుకోవాలని రైతులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకే విధంగా నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒక సెంటీమీటరు వర్షం పడితే అది 57 టిఎంసిల నీటితో సమానమని, ఒక మీటరు భూగర్భ జలమట్టం పెరిగితే 90 టిఎంసిల నీరు నిల్వ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.