రాష్ట్రీయం

పరిష్కారం దిశగా ‘న్యాయ’ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: దేశ చరిత్రలో తొలిసారిగా న్యాయాధికారులు న్యాయం కోసం రోడ్కెక్కడంతో సమస్య పరిష్కారంపై కేంద్రంతోపాటు సుప్రీంకోర్టు దృష్టి సారించింది. కేంద్రం ఈ వివాదానికి సంబంధించి గవర్నర్‌ను సమాచారం కోరినట్టు తెలిసింది. గవర్నర్ నరసింహన్‌ను సిఎం కెసిఆర్ శనివారం కలిశారు. దాదాపు గంటపాటు గవర్నర్‌తో చర్చించి, సమస్య తీవ్రతను వివరించారు. సమస్య పరిష్కారానికి తెలంగాణ న్యాయవాదులు, న్యాయాధికారులు ఏంకోరుతున్నారో, తమకు అన్యాయం జరిగిందని ఎందుకు భావిస్తున్నారో సిఎం వివరించారు. హైకోర్టు విభజనతోపాటు న్యాయాధికారుల ఆప్షన్ అంశంపై సిఎం కెసిఆర్ అభిప్రాయం వెల్లడించారు. న్యాయాధికారులు తొలిసారిగా గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్‌కు ఊరేగింపుగా బయలుదేరిన తరువాత కెసిఆర్ గవర్నర్‌ను కలిసి సమస్యను వివరించారు. అనంతరం కేంద్రం సైతం స్పందించింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి పరిస్థితి వివరించారు. కేంద్రం గవర్నర్ నుంచి సమాచారం కోరింది. దాంతో సిఎం కెసిఆర్ శనివారం గవర్నర్‌ను కలిసి సమస్యకు సంబంధించి చర్చించారు. తెలంగాణ న్యాయవాదుల సంఘం నాయకులు గండ్ర మోహన్‌రావు నేతృత్వంలో న్యాయవాదుల బృందం ఒకటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవనుంది. న్యాయాధికారుల ఆందోళన, న్యాయ శాఖ సిబ్బంది పలువురిని హైకోర్టు సస్పెండ్ చేసిన నేపథ్యంలో సమస్యను వివరించేందుకు అవకాశం కల్పించాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది. సమస్య గురించి తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక బృందాన్ని ఆదివారం కలుస్తుంది. ఒకవైపు న్యాయాధికారులు ఆందోళన చేస్తుంటే వారిని రెచ్చగొట్టే విధంగా సస్పెన్షన్లు చేస్తూ పోవడం వల్ల సమస్య మరింత జఠిలంగా మారుస్తున్నారని న్యాయవాదులు వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. దేశంలో గతంలో ఎప్పుడూ ఇలా న్యాయాధికారులు రోడ్డుమీదకు వచ్చిన సంఘటనలు లేవు. గతంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు న్యాయాధికారులను కేటాయించేందుకు అనుసరించిన విధానాన్ని తెలంగాణలో అనుసరించకుండా ఏకపక్షంగా ప్రాథమిక కేటాయింపులు చేశారని న్యాయవాదులు ఆరోపించారు. ఆందోళన చేసిన వారిని రెచ్చగొట్టేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్రం నివారణ చర్యలకు ఉపక్రమించింది. కేంద్రం, సుప్రీంకోర్టు జోక్యంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు.
తెలంగాణలో న్యాయాధికారుల సంఖ్య, అందులో తెలంగాణవారి సంఖ్య, తెలంగాణ వారికి ఏవిధంగా అన్యాయం జరుగుతోంది అనే అంశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్‌కు వివరించారు. తెలంగాణలో న్యాయాధికారుల పోస్టులు 130 ఖాళీవుంటే వాటిని ఆంధ్ర న్యాయాధికారులతో నింపి వేశారని తెలంగాణ న్యాయవాదులు తెలిపారు. గవర్నర్ మధ్యవర్తితత్వంతో సమస్య పరిష్కారం అవుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో తెలంగాణ న్యాయవాదుల ప్రతినిధి బృందం చర్చల తరువాత సమస్య పరిష్కారం అవుతుందని న్యాయవాదులు ఆశిస్తున్నారు.

చిత్రం.. హైకోర్టు అంశంపై గవర్నర్‌తో సమావేశమైన కెసిఆర్