రాష్ట్రీయం

బ్యారేజీ మరమ్మతుల్లో నాణ్యతాలోపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 2: సాగునీటి వ్యవస్థలో ఎంతో కీలకమైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ అధికారుల అలక్ష్యానికి గురైంది. కీలకమైన బ్యారేజ్ గేట్ల బ్రేక్ కాయిల్స్ మాయం కావడం, ముగ్గురు ఎఇలు సస్పెండ్ కావడం ఇందుకు అద్దంపడుతోంది. బ్యారేజ్‌కు ప్రస్తుతం నిర్వహణ పనుల్లో భాగంగా మరమ్మతులను రూ.29 కోట్లతో చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యతాలోపం చోటుచేసుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పది లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు లక్షలాది ప్రజల దాహార్తిని తీర్చే ఆనకట్టలో అవినీతికి ఆనకట్ట లేకుండా పోయిందని అధికారులు ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఇక్కడ నుండే మూడు డెల్టాలకు సాగునీరు అందిస్తారు. ఇంతటి ప్రాధాన్యత కల్గిన బ్యారేజీ నిర్వహణ గాలికొదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిరంతరం ఎలక్ట్రికల్, మెకానికల్ నిర్వహణ చేయవలసి ఉంది.
బ్యారేజీకి నట్లు ఊడిపోతున్నాయని, ఆయిలింగ్ పనులు చేయకుండా మరమ్మతుల పనుల కాంట్రాక్టు కంపెనీ మరమ్మతు చేసినట్లు బిల్లులు పెడుతోందని, ఈ సంస్థకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గేట్లకు కింద భాగంలో ప్లేట్లు, రబ్బరు బిన్నులు కూడా పోయాయని తెలుస్తోంది. ఇవేవీ మరమ్మతులకు నోచుకోలేదని అంటున్నారు. బ్యారేజీ పై భాగంలో ఆయిల్ గేట్లు మరమ్మతులు చేసి ఎలక్ట్రికల్ పేనల్స్ ఏర్పాటుచేయవలసి ఉంది. అదే విధంగా రబ్బరు బిన్లు కూడా వేయాలి. కానీ ఎక్కడా పనులు జరిగిన అనమాళ్లు కనిపించడం లేదంటున్నారు. రెడాక్సైడ్‌తో రంగులువేసి, గరుకు పేపరుతో నగిషీలు చెక్కి రిపేరు చేసినట్లు చూపిస్తున్నారని, గేట్లు తుప్పుపట్టి ఉన్నా బిల్లులు రూపొందించారని తెలిసింది. కొంతమంది అధికారులు బినామీ కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తూ ఏటికేడాది మరమ్మతు పనులను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. టెండరు నిబంధనలకు విరుద్ధంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయంటున్నారు. బ్యారేజ్‌కు ప్రత్యేకించి హెడ్ వర్క్స్ ఇఇతోపాటు నలుగురు ఎఇలు, ఒక డిఇ, లైన్ ఇన్స్‌పెక్టర్, ఆపరేటర్లు, ఎలక్ట్రిషియన్లు తదితర 240మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా కేవలం 60మంది సిబ్బందితోటే నెట్టుకొస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం మధ్య రక్షిత ప్రాంతమైన ఈ బ్యారేజ్‌లో మరమ్మతు పనులు నాసిరకంగా జరుగుతుండడంపై విచారణ జరిపించాలని కోరుతున్నారు.