రాష్ట్రీయం

గోదావరికి వరద తాకిడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 3: గోదావరి నదిలో నీటి మట్టం క్రమేణా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజి నుంచి ఆదివారం రాత్రి 2,02,207 క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజి 175 గేట్లను 0.20 మీటర్ల మేర ఎత్తివేసి జలాలను దిగువకు పంపిస్తున్నారు. ఆదివారం ఉదయం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 7.70 అడుగుల నీటి మట్టం నమోదు కాగా రాత్రికి 7.80 అడుగులకు చేరుకుంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతాల్లో వర్షం నీరు భారీగా నదిలోకి చేరడంతో గోదావరి ప్రవాహ వేగం క్రమేణా పెరుగుతోంది. దీంతో బ్యారేజి వద్ద నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద 28.50 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఈ సీజన్‌లో గోదావరి నీటి మట్టం పెరిగి, రెండు లక్షల క్యూసెక్కులకు పైబడి వరద జలాలు సముద్రంలోకి విడిచిపెట్టడం ఇదే ప్రధమం.
భద్రాచలం వద్ద నిలకడగా నీటిమట్టం
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరికి జలకళ వచ్చింది. గంటకో అడుగు మేర పెరుగుతూ గోదావరి ఉరకలేస్తోంది. ఆదివారం రాత్రికి గోదావరి నీటిమట్టం 28.4 అడుగులకు చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద తాకిడి ఎక్కువయింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. అల్పపీడనం, వాయుగుండం, నైరుతి రుతుపవనాలతో వర్షాలు విస్తారంగా కురవడంతో గోదావరి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన ప్రాణహిత, ఇంద్రావతి, తాలిపేరు ఉప నదుల నుంచి వరద రావడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరిగినట్లు సిడబ్ల్యూసి అధికారులు చెప్పారు. శనివారం రాత్రి 19 అడుగులు ఉన్న గోదావరి ఆదివారం 28.4 అడుగులకు చేరుకుంది. గంటకు అడుగు చొప్పున గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం రాత్రికి 28.4 అడుగుల వద్ద నిలకడగా మారి తగ్గుముఖం పట్టింది. అయితే అధికారులు అప్రమత్తంగానే ఉన్నారు. తహసీల్దార్ రామకృష్ణ గోదావరి ఉధృతిని పరిశీలించారు. కరకట్ట వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు.

చిత్రం.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుండి దిగువకు విడుదల చేస్తున్న వరద జలాలు