రాష్ట్రీయం

పెను విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 7: ఒక కుటుంబాన్ని కిడ్నీ వ్యాధి కబళించింది. ఒకే కుటుంబంలోని యుక్తవయస్కులైన ముగ్గురు కుమారులకు కిడ్నీలు పాడయ్యాయి. వైద్యం చేయించినా బతకడం కష్టమని భావించిన తల్లి వారితో కలిసి ఆత్మహత్యకు ఒడిగట్టింది. హృదయ విదారకరమైన ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం అమరవిల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగింది.తల్లి, వ్యాధిగ్రస్థులైన ముగ్గురు కుమారులు పురుగుల మందు తాగిన అనంతరం ఉప్పుటేరులో దూకి ఆత్మహత్యకు చేసుకున్నారు. అమరవిల్లి గ్రామానికి చెందిన రాగల రామిరెడ్డి, భూలక్ష్మి దంపతులకు ప్రభుప్రకాష్(22), అనిల్ (20), ప్రేమ్‌సాగర్ (18) అనే కుమారులున్నారు. వాకా అరుణ అనే కుమార్తె వివాహమై హైదరాబాద్‌లో నివసిస్తోంది. వీరి చిన్న కుమారుడు ప్రేమసాగర్ నాలుగు సంవత్సరాలుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. వారానికి మూడు పర్యాయాలు అతడికి ఆసుపత్రిలో డయాలసిస్ చేయిస్తున్నారు. ఇటీవల పెద్ద కుమారుడు ప్రభుప్రకాష్ విపరీతమైన జ్వరం, వాంతులతో బాధ పడుతుండటంతో పరీక్షలు చేయించగా, అతను కూడా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నట్టు తేలింది. ఒక కుమారుడికి తాను కిడ్నీ దానం చేయాలని రామిరెడ్డి భావించి, మరో కుమారుడికి కిడ్నీ ఇచ్చే దాత కోసం ప్రయత్నిద్దామని భావించారు. అయితే ఐదు రోజుల క్రితం రెండవ కుమారుడు అనిల్ కూడా తీవ్ర జ్వరంతో బాధ పడుతుండటంతో వైద్య పరీక్షల అనంతరం అతడి రెండు కిడ్నీలూ చెడిపోయినట్టు నిర్ధారణయ్యింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా తల్లడిల్లిపోయింది. పెద్ద కుమారుడు ప్రభుప్రకాష్‌కు, మూడవ కుమారుడు ప్రేమసాగర్‌కు ఒక్కో కిడ్నీ చెడిపోగా, రెండవ కుమారుడు అనిల్‌కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్రంగా మధనపడిన తల్లిదండ్రులు తమకున్న మూడెకరాల భూమిని అమ్మేసి వైద్యం చేయించాలని భావించారు. అయితే వైద్యం చేయించినా కుమారుల ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే అవకాశం లేదని తేలడంతో ముగ్గురు కుమారులతో కలిసి అయిదుగురూ ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు పురుగుల మందు కూడా తెచ్చుకున్నారు. అయితే హైదరాబాద్‌లో ఉన్న కుమార్తె అనాథగా మిగిలిపోతుందనే భయంతో గురువారం ఉదయం నిర్ణయం తీసుకుందామని అంతా పడుకున్నారు.
అయితే గురువారం వేకువజామున 3.30 గంటల సమయంలో రామిరెడ్డి నిద్రలో ఉండగా భూలక్ష్మి, ముగ్గురు కుమారులు మేల్కొని మరో అలోచనచేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న కుమార్తె కోసం రామిరెడ్డిని వదిలి, తాము చనిపోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం భూలక్ష్మి, కుమారులు ప్రభుప్రకాష్, అనిల్, ప్రేమసాగర్ పురుగుల మందు తాగారు. అయినా బతికే అవకాశం ఉంటుందని భావించి, వెంటనే సమీపంలోని ఉప్పుటేరు వద్దకు వెళ్ళి అందులో దూకేశారు.
గురువారం తెల్లవారుజామున నిద్ర లేచిన రామిరెడ్డి ఇంట్లో భార్య, పిల్లలు లేకపోవడంతో సందేహించాడు. వెంటనే స్థానికులతో కలిసి గాలించగా, సమీపంలోని ఉప్పుటేరువద్ద వారి చెప్పులు కనిపించాయి. దీనితో ఉప్పుటేరులో గాలించడంతో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన రామిరెడ్డి అక్కడే కుప్పకూలిపోయాడు. కాకినాడ డిఎస్పీ ఎస్ వెంకటేశ్వరరావు, యు.కొత్తపల్లి తహసీల్దారు రత్నకుమారి తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎస్ వర్మ, మాజీ ఎమ్మెల్యే వంగా గీత తదితరులు రామిరెడ్డిని ఓదార్చే ప్రయత్నం చేశారు.
జన్యులోపమే కారణమా...
రామిరెడ్డి, భూలక్ష్మిది మేనరిక వివాహం కావడంతో జన్యులోపం వలనే ముగ్గురు కుమారులకు కిడ్నీ సమస్య వచ్చినట్టు తెలిసింది. ఒకే కుటుంబంలో ముగ్గురికీ ఒకే రకమైన వ్యాధి రావడం అనేది జన్యులోపం వల్లే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రామిరెడ్డి కుటుంబానికి ఆరోగ్యశ్రీ, ఇతర ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేకపోవడంవల్ల ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది.

చిత్రం.. ఆత్మహత్య చేసుకున్న తల్లి, కుమారుల మృతదేహాలు