రాష్ట్రీయం

‘అనంత’ పోలీసుల వలలో అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 7: అంతర్జాతీయ స్థాయిలో కోట్లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అనంతపురం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ముఠా నాయకుడు నరసింహతో పాటు మరో ఐదుగురిని అరెస్టుచేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు, 10 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఎస్‌వి రాజశేఖర్‌బాబు తెలిపారు. ఈ ముఠాలో మరో 43 మంది ఉన్నట్లు ఆయన తెలిపారు. గురువారం అనంతపురంలోని పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ముఠా వివరాలను ఎస్పీ వెల్లడించారు. అనంత కేంద్రంగా కోట్లలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో స్పెషల్‌బ్రాంచ్ డిఎస్పీ సిఎం.గంగయ్య, ధర్మవరం డిఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసుల బృందాలు గాలింపు తీవ్రతరం చేశాయన్నారు.
గురువారం ఎన్‌ఎస్ గేటు వద్ద క్రికెట్ బెట్టింగ్ కంపెనీ నిర్వాహకుడు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన యాలా నరసింహులు అలియాస్ ప్రొద్దుటూరు నరసింహ(34), మార్తాల సుబ్బారెడ్డి(33), మైదుకూరుకు చెందిన బి.గిరీశం (22), అనంతపురం జిల్లా పుట్లూరు మండలం రంగరాజకుంటకు చెందిన బెడదూరి శివరామాంజులరెడ్డి(30), తాడిపత్రికి చెందిన బళ్లారి జీవరత్నం అలియాస్ జీవా(40)లను అరెస్టుచేశారన్నారు. ఇదే ముఠాకు చెందిన 22 మంది బుకీలను గత నెలలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసింహ ముఠా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, దుబాయ్ తదితర దేశాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోందని ఎస్పీ వివరించారు. గతంలో బెట్టింగ్‌లో డబ్బు పెట్టిన నరసింహ తదనంతరం బుకీగా మారాడన్నారు.
గతంలో ప్రొద్దుటూరు పోలీసులు పలుమార్లు అరెస్టు చేశారని, జైలు నుంచి బయటకు వచ్చాక భార్యాపిల్లలతో సహా హైదరాబాదుకు మకాం మార్చాడన్నారు. అక్కడ తన స్నేహితుడు మునిస్వామి సహకారంతో మళ్లీ బెట్టింగ్‌లు మొదలు పెట్టి లక్షల్లో లావాదేవీలు నడిపాడన్నారు. పెద్దమొత్తంలో క్రికెట్ బెటింగ్ నిర్వహించే అంకోలా నరేష్‌సేఠ్‌తో పరిచయం పెంచుకున్న నరసింహ కటింగ్ లైన్ (కమ్యూనికేటర్ బాక్సు) సాయంతో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు శ్రీకారం చుట్టాడన్నారు. కమ్యూనికేటర్ బాక్సు సాయంతో 25 ఫోన్‌లైన్ల ద్వారా ఒకేసారి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించాడన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివాజీ, ఇతని అన్న రవి ద్వారా 15మంది పంటర్స్, సాయి, సూరి, మునేష్, రంగరాజు, నవీన్ రాజును ముఠాలో చేర్చుకున్నాడన్నారు. ముంబాయి నుంచి మరో కమ్యూనికేటర్ బాక్సు తెప్పించి ఏక కాలంలో 52 ఫోన్ లైన్ల ద్వారా క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు కొనసాగించాడని ఎస్పీ వివరించారు. అకమంగా సంపాదించిన డబ్బుతో కడప జిల్లా ప్రొద్దుటూరు, ఖాదరాబాద్, దొరసానిపల్లి, కడప, కర్నూలు, అనంతపురం, హిందూపురం, మడకశిర, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించాడన్నారు. మ్యాచ్ జరిగిన రోజుల్లో రూ.2 నుంచి రూ.2.50 కోట్ల లావాదేవీలు నిర్వహిస్తుండేవాడన్నారు. డబ్బు బ్యాంకులు, ఏజెంట్లు, హవాలా మార్గంలో చేరవేసేవాడన్నారు. జనవరి 1 నుంచి గత (జూన్ వరకు రూ.8.50 కోట్ల లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు ఖాతాలను బట్టి తెలుస్తోందన్నారు నిందితులపై కుట్ర కేసు, ఏపి గేమింగ్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఏపి కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజింగ్ క్రైమ్ యాక్టులపై కేసు నమోదు చేశామన్నారు. నరసింహ ముఠాలోని మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

చిత్రం.. గురువారం అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా వివరాలు వెల్లడిస్తున్న జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు