రాష్ట్రీయం

‘దేశం’లో ధిక్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: క్రమశిక్షణకు మారుపేరుగా పేరొందిన తెలుగుదేశంలో అధినేత ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. స్వయంగా చంద్రబాబునాయుడే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినా, దానిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తూ రోడ్డెక్కి ఆందోళనబాట పడుతున్న వైనం పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.
కాపులను బీసీల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి, తెదేపా తీసుకున్న నిర్ణయం సొంత పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులకు మింగుడుపడటం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలోనే కాపులను బీసీల్లో చేరుస్తామని, రెండువేల కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని తెదేపా హామీ ఇచ్చింది. దానికి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత, ముద్రగడ దీక్ష ఫలితంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని తెదేపా తెలంగాణ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య తొలిసారి తీవ్రంగా వ్యతిరేకించారు. బాబు కాపుల మెప్పు కోసం ప్రయత్నిస్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ ప్రయోజనాలను అణగదొక్కుతున్నారని, కాపులను బీసీల్లో చేరిస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని బహిరంగ హెచ్చరిక చేశారు. సొంత పార్టీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, దానిపై బాబు ఇంతవరకూ స్పందించలేదు. ఆయనపై చర్య తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు.
బాబు కాపు అనుకూల ధోరణిని వ్యతిరేకిస్తున్నప్పటికీ, దానిని బహిరంగంగా వ్యతిరేకించలేని తెదేపాలోని బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు కృష్ణయ్య ఉద్యమానికి తెర వెనుక ఉండి, ఆయనకు మద్దతునిస్తున్నారు. వారి ఉమ్మడి నేతృత్వంలోనే, విజయవాడలో బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుకానుంది. బాబు అనుసరిస్తున్న కాపు అనుకూల వైఖరితో బీసీల హక్కులు దెబ్బతింటాయని, ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లన్నీ ఆర్ధికంగా బలంగా ఉన్న కాపులకే దక్కుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకూ అత్యంత వెనుకబడిన కులాలేవీ అసెంబ్లీలో అడుగుపెట్టలేని పరిస్థితి ఉందని, ఇక కాపులు బీసీల్లో చేరితే ఉన్న ఆ ఒక్క ఆశ కూడా అడుగంటిపోతుందని భయపడుతున్నారు.
కాగా, కాపులను బీసీల్లో చేరిస్తే సహించేది లేదని బహిరంగంగా ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి సోదరుడైన మాజీ ఎమ్మెల్యే కెఇ ప్రభాకర్, ఇటీవల రెండుసార్లు భారీ ర్యాలీలు నిర్వహించడం బాబుకు ఇరకాటంగా పరిణమించింది. దానితో బాబు ఉప ముఖ్యమంత్రి కెఇతో మాట్లాడి, ప్రభాకర్‌కు సర్దిచెప్పాలని ఆదేశించారు. అన్న బుజ్జగించడంతో ప్రభాకర్ తాత్కాలికంగా తన ఆందోళన విరమించారు. ఆ సందర్భంలోనే తనకు కుటుంబం కంటే పార్టీనే ముఖ్యమని కెఇ వ్యాఖ్యానించారు. ప్రభాకర్ ర్యాలీ నిర్వహించినప్పుడు కూడా తెదేపాలోని బీసీ ప్రజాప్రతినిధులు ఆయనకు పరోక్ష మద్దతునిచ్చారు. కాగా, తాజాగా విజయవాడలో కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏర్పాటయిన మంజునాధ కమిషన్ కార్యాలయం ఎదుట పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన వేలాదిమంది బీసీలు ధర్నా నిర్వహించిన వైనం ఉద్రిక్తతకు దారితీసింది. కృష్ణయ్యకు చెందిన బీసీ సంక్షేమసంఘ ఆధ్వర్యంలో ఇది జరిగినప్పటికీ, దానికి తెదేపా ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కుమారుడు వెంకట్ నేతృత్వం వహించడం ప్రస్తావనార్హం. అంతకుముందు ఈనెల 5న సత్యనారాయణ కొమ్మచిక్కాలలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీసీ సంఘాలతో సమావేశమయి, కాపు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ బీసీల గళం వినిపించాలని నిర్ణయించిన ప్రకారంగా విజయవాడలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. గత ఎన్నికల ముందు పితాని కాంగ్రెస్ నుంచి తెదేపాలో చేరిన విషయం తెలిసిందే.
అయితే, పార్టీకి గత ఎన్నికల్లో వంద శాతం విజయం అందించిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచే బీసీల నిరసన వ్యక్తం కావడం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

చిత్రాలు.. కె.ఇ.కృష్ణమూర్తి, పితాని సత్యనారాయణ