రాష్ట్రీయం

రింగ్ రోడ్డు అవతలకు పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: హైదరాబాద్, చుట్టుపక్కల గల కాలుష్య కారక పరిశ్రమలు అన్నింటినీ రింగురోడ్డుకు అవతల వైపు తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మొదటి దశలో 1068 కాలుష్య పరిశ్రమలను నగరం అవతలకు తరలించేందుకు తీసుకోవలసిన చర్యలపై శనివారం మంత్రి కెటిఆర్ అధికారులతో చర్చించారు. నగరంలోని ప్రజల జీవితాల్లో కాలుష్యాన్ని తగ్గించి, వాతావరణంలో నాణ్యతను పెంచేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. మొదటి దశలో కాలుష్య పూరిత పరిశ్రమలు తరలిస్తామని, తర్వాత దశల్లో అన్ని పరిశ్రమలను నగరం నుంచి బయటకు తరలిస్తామని తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు. 2017 డిసెంబర్ నాటికి అన్ని పరిశ్రమలను రింగురోడ్డు అవతలకు తరలిస్తామని అన్నారు. పరిశ్రమల తరలింపు పెద్ద సవాలేనని, దీని కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన, నమ్మకం కలిగిస్తామని అన్నారు. కొత్త ప్రాంతాల్లో జనావాసాలకు సాధ్యమైనంత దూరంగా ఈ పరిశ్రమలను ఏర్పాటు చేసి, పరిశ్రమల్లో జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వంటి విధానాలతో జల, వాయు కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించవచ్చునని కెటిఆర్ తెలిపారు. ఈ తరలింపుతో పరిశ్రమలు సైతం అధునాతన పరిజ్ఞానాన్ని అందుకునేందుకు, అత్యుత్తమ వౌలిక వసతులు, సదుపాయాలు పొందేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. ల్యాండ్ కన్వర్షన్, పన్ను రాయితీలు, పరిశ్రమ ఆవరణల్లోనే గృహావసరాలకు అనుమతి వంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ పరిశ్రమలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు వాటిని వర్గీకరణ చేస్తారు. ఒకే రంగంలో ఉన్న కంపెనీలకు ఒకే క్లస్టర్లలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వాటిని వర్గీకరణ చేస్తామని మంత్రి తెలిపారు.
ఈ క్లస్టర్ల ఏర్పాటులో హెచ్‌ఎండిఎ వంటి సంస్థలతో కలిసి పని చేయాలని టిఎస్‌ఐఐసి అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే నగరంలోని పరిశ్రమలతో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ అంశంపై పలు బల్క్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్‌తో మంత్రి శనివారం సమావేశం అయ్యారు. పరిశ్రమలను తరలించేందుకు ఏయే కార్యక్రమాలు చేపట్టాలో తెలపాలని కోరారు. నగరంలోని కెమికల్, ఫార్మా కంపెనీలను నూతనంగా ఏర్పాటు చేసే ఫార్మాసిటీలోకి తరలించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. మిగిలిన కంపెనీలకు ప్రత్యేకంగా క్లస్టర్లుగా ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తామని చెప్పారు. కంపెనీల తరలింపులో పరిశ్రమలతో కలిసి సమన్వయంతో పని చేస్తామని చెప్పారు. వారి ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా చూస్తామని కెటిఆర్ తెలిపారు. కామన్ అప్లూయెంట్ ప్లాంట్ల నిర్మాణం వంటివి ఏర్పాటు చేసిన తరువాతనే తరలింపు మొదలు పెడతామని చెప్పారు.
చిన్న పరిశ్రమలతో సమావేశం
చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఆస్తి పన్నును తగ్గించాలని ప్రతినిధులు కోరారు. ఇతర రాష్ట్రాల్లో విధిస్తున్న ఆస్తి పన్ను వివరాలను ప్రతినిధులు మంత్రికి అందజేశారు. నీటి సరఫరా రేట్లను తగ్గించాలని కోరారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు హైదరాబాద్‌లో 1500 ఎకరాల భూమి కేటాయించాలని మంత్రిని కోరారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం స్థలం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, అయితే నిర్ణీత గడువులోగా కార్యకలాపాలు ప్రారంభించక పోతే లీజు దానంతట అదే రద్దు అయ్యే విధంగా నిబంధనలు విధిస్తామని కెటిఆర్ తెలిపారు.

చిత్రం.. పరిశ్రమల తరలింపుపై అధికారులతో చర్చిస్తున్న తెలంగాణ మంత్రి కెటిఆర్