రాష్ట్రీయం

ఇష్టపడ్డాడు.. శిఖరాన నిలిచాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బి.శ్రీధర్
హైదరాబాద్, జూలై 21: అతనో సామాన్యుడు... మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు... అయితేనేం అతని లక్ష్యం మాత్రం ఉన్నతం... ఆ లక్ష్య సాధనకు సరిపడా ఆత్మవిశ్వాసం అతని సొంతం... ఆ దిశగా అడుగులు వేసి తన కలను సాకారం చేసుకున్నాడు. అబ్దుల్ కలాం ‘కల’ల స్ఫూర్తితో ప్రపంచ యువకుల జాబితాలో అగ్రభాగాన నిలిచాడు... ‘మిస్టర్ వరల్డ్’ కిరీటాన్ని భారత్‌కు కానుకగా తెచ్చాడు... అతనే రోహిత్ ఖండేల్వాల్. ఇష్టపడి ఎంచుకున్న రంగమే అతన్ని అగ్రభాగాన నిలిపింది. తన ఆసక్తిపై తల్లిదండ్రులు అభ్యంతరాలు చెప్పినా, అడ్డంకులెదురైనా లక్ష్యపెట్టకుండా లక్ష్యాన్ని చేరుకున్న విధానం రోహిత్ ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం. ‘మిస్టర్ వరల్డ్’ పోటీలో విజయకేతనం ఎగురవేసి భారత్‌కు కీర్తిప్రతిష్ఠలు సాధించిన రోహిత్ కుటుంబ సభ్యులను ‘ఆంధ్రభూమి’ ప్రతినిధి ఇంటర్వ్యూ చేశారు. రోహిత్ గురించి చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...
చార్మినార్ సమీపంలోని చేలాపురాలో 1989 ఆగస్టు 19న రోహిత్ జన్మించాడు. అబిడ్స్‌లోని గ్రామర్ స్కూల్‌లో విద్యనభ్యసించాడు. ‘రోహిత్ ధ్యాస ఎప్పుడూ మోడలింగ్, డాన్స్‌పైనే. ఇతర రంగాలవైపు అతని దృష్టి మళ్లించేందుకు ఎంత ప్రయత్నం చేసినా మాకు నిరాశే ఎదురైంది. ఎంత చెప్పినా వినలేదు. మా ఇష్టానికి వ్యతిరేకంగా ఎదురీది ఏకంగా ప్రపంచ కిరీటానే్న ధరించాడు’ అని తల్లిదండ్రులు సుమలత ఖండేల్వాల్, రాజ్‌కుమార్ ఖండేల్వాల్ వివరించారు. ఈ విషయం చెప్తున్నప్పుడు భావోద్వేగానికి గురైన వారిద్దరి కళ్లల్లో ఆనంద బాష్పాలు తొంగిచూశాయి. దేశం గర్వించేలా, కుటుంబ పేరు ప్రతిష్ఠలు ఇనుమడించేలా తమ కుమారుడు సాధించిన విజయం వారిద్దరినీ ఉక్కిరిబిక్కిరి చేసింది. ‘అన్నయ్య రాహుల్ ఖండేల్వాల్ మాదిరిగానే పివిసి పైపుల వ్యాపార రంగంలో స్థిరపడి వ్యాపారవేత్తగా ఎదగాలని భావించాం. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం పొందాలని కోరుకున్నాం. కానీ తను ఎంతో ఇష్టపడే మోడలింగ్, డాన్స్‌లోనే కొనసాగాడు’ అని తల్లిదండ్రులు వెల్లడించారు. ‘టీవీ సీరియల్స్‌లో నటించి తన కళా ప్రతిభకు పదును పెట్టుకున్నాడు. కుటుంబంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఏ ఒక్కరి సహకారం తీసుకోకుండా ఇంతటి వాడయ్యాడు’ అని వారు తెలిపారు. వన్ మ్యాన్ ఆర్మీగా తన జీవితాన్ని తనకు నచ్చిన మలుచుకుని నేటి యువతకు రోహిత్ ఆదర్శప్రాయంగా నిలవడం గర్వకారణమన్నారు.
కుచ్ పానాహైతో..కుచ్ ఖోనా!
కుచ్ పానాపైతో కుచ్ ఖోనా (ఒకటి పొందాలంటే మరొకటి త్యాగం చేయాలి) అన్న నానుడి సైతం రోహిత్ విషయంలో నిజమైంది. రాజస్థాన్‌లోని జైపూర్ స్వస్థలమైన రోహిత్ కుటుంబానికి మిఠాయిలంటే ఎంతో ప్రాణం. చిన్ననాటి నుంచి కూడా రోహిత్ స్వీట్లు బాగే తినేవాడు. ఇంటర్మీడియట్ దశలోనే తాను అందరిలా కాకుండా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు మోడలింగ్, డాన్సు అనే రెండు ట్రాక్‌లపై తన పయనాన్ని ప్రారంభించిన రోహిత్ సీట్లను త్యాగం చేశాడు. స్వీట్లు తింటే తాను మంచి డాన్సర్, సింగర్ కాలేనని నిర్ణయించుకుని అప్పట్లోనే మానేశాడని తల్లి సుమలత, నానమ్మ గీతాబాయి తెలిపారు. ఇంట్లో అందరికి రోహిత్ అంటే ప్రాణం. అలాంటివాడు తమ లక్ష్యసాధన కోసం రోజుల తరబడి మాకు కన్పించకుండా దూరంగా ఉండటం కొంత బాధకలిగించేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
మా భయాల్ని పటాపంచలు చేశాడు: తల్లి సుమలత
చిన్ననాటి నుంచే రోహిత్‌లో ఓ ప్రత్యేకత కన్పించేది. మొదటి రోజు స్కూల్‌కు వెళ్లేటపుడు ఎంత మారం చేస్తాడోనని మేం ఊహించాం.. కానీ మరుసటి రోజు కూడా స్కూల్‌కు వెళ్లేందుకు తానే తొందరపడేవాడు. అపుడు మా అంచనా తారుమారైంది.. మాకు ఇష్టం లేని మోడలింగ్, డాన్సు రంగాలను ఎంచుకోవటంతో ఎలాంటి పరిణామాలెదురవుతాయోనని భయపడ్డాం. కానీ నేడు మిస్టర్ వరల్డ్ సాధించటంతో ఇపుడూ మా అంచనాలు తలకిందులయ్యాయి. తన ఆలోచన తీరును ఎదుటివారు గుర్తించకుండా జాగ్రత్తపడుతూనే ఎంచుకున్న లక్ష్యాన్ని చేరటమే రోహిత్ స్పెషాల్టీ.
నేనంటే చాలా ఇష్టం:
గీతాబాయి, నానమ్మ
నేను కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాను. నాకు టిఫిన్లలో దోశ అంటే మహా ఇష్టం. కానీ వైద్యులు తనొద్దంటూ హెచ్చరించారు. కానీ మా రోహిత్‌కు నాకు ఇష్టమైన ఆహారం తినిపించటం ఎంతో ఇష్టం. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే బయటి నుంచి దోశ తీసుకువచ్చి, నా తలపై నిమురుతూ తినిపించిన ఆ సందర్భం నా జీవితంలో మరువలేనిది. రోహిత్ తన పట్టుదలతో మిష్టర్ వరల్డ్‌గా ఎదగటం మాటల్లో చెప్పలేని ఆనందం.
పిల్లల అభిరుచులకు విలువనివ్వాలనీ, వారిలోని సృజనను గుర్తించి ప్రోత్సహించాలని చివరకు తల్లిదండ్రులతోనే చెప్పించే స్థాయికి రాహుల్ ఎదగడం అతనిలో నిగూఢంగా వున్న లక్ష్యసాధనకు నిదర్శనం. పిల్లల ఆలోచనలను గౌరవించి ప్రోత్సహించాలనే సంకేతాన్ని రోహిత్ విజయం చాటిచెపుతోంది.

చిత్రాలు.. నృత్యం చేస్తూ రోహిత్. అమ్మ, నాన్న, అన్న, వదినలతో రోహిత్ (ఫైల్‌ఫొటోలు)