రాష్ట్రీయం

అంత్య పుష్కరాలకు ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 22: గోదావరి తీరంలో అంత్య పుష్కరాలకు ఆధ్యాత్మిక శోభ వెల్లి విరయనుంది. పవిత్ర అంత్య పుష్కర స్నానాలకు తరలివచ్చే పుష్కర యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కర భూమికలో కీలకపాత్ర పోషించే దేవాదాయ ధర్మాదాయశాఖ అంత్య పుష్కరాల పనె్నండు రోజులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రాలతోపాటు, గోదావరి నది ఒడ్డున వున్న ప్రాచీన ఆధ్యాత్మిక ప్రాశస్థ్యం కలిగిన పురాణ ఇతిహాస క్షేత్రాల్లో పుష్కర యాత్రికుల దైవ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు పనె్నండు రోజులపాటు జరగనున్న గోదావరి నది అంత్య పుష్కరాలకు దేవాదాయ శాఖ ప్రధాన ఆలయాలు, క్షేత్రాల్లో భక్తుల సౌకర్యార్థం విశేష రీతిలో వౌలిక సదుపాయాలు కల్పించింది. అంతకంటే ప్రత్యేకంగా జిల్లాలోని అన్ని ప్రధాన క్షేత్రాలతో పాటు నది ఒడ్డున రాజమహేంద్రవరంలోని ప్రసిద్ధ క్షేత్రాల వద్ద పుష్కర యాత్రికులకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా కోటిలింగాలు, మార్కండేయస్వామి గుడి, పుష్కర ఘాట్ వద్ద హరికథ, బుర్రకథ వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నదీ పుష్కరాలు, పుష్కర ప్రాశస్థ్యం, పురాణ గాథలతో కూడిన ప్రత్యేక హరికథ, బుర్రకథ కాలక్షేపాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు.
అంత్య పుష్కరాల ప్రారంభం రోజు పుష్కర ఘాట్ వద్ద దేవాలయాల్లో వేద పండితులతో విశేష పూజలు ఏర్పాటు చేశారు. రోజుకు సుమారు లక్ష మంది వరకు భక్తులు వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్టు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్ తెలియజేశారు. అన్ని ఆలయాల్లో ఉచిత భోజన సమారాధన, ఉచిత ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు అన్నింటిలోనూ పుష్కర యాత్రికుల కోసం ప్రత్యేక దర్శనాలు, శీఘ్ర దర్శనాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతర దర్శనం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలోని కోటిలింగేశ్వర, పుష్కర ఘాట్, మార్కండేయేశ్వర ఘాట్, పద్మావతి ఘాట్, శ్రద్ధానంద ఘాట్, రామపాదాల ఘాట్, కోటిపల్లి ఘాట్‌ల వద్ద మాత్రమే పిండ ప్రదాన క్రతువులకు అనుమతిచ్చారు. పిండ ప్రదాన సామాగ్రి లభించే ఏర్పాట్లు, యాత్రికులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ఘాట్‌ల వద్దే దేవాదాయ శాఖ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
గోదావరి నదిలో పుష్కరుడికి వీడ్కోలు వినూత్నంగా పలికేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 11వ తేదీ సాయంత్రం పుష్కర ఘాట్ వద్ద ఆధ్యాత్మిక వైభవం మధ్య పుష్కరుడికి వీడ్కోలు పలికేలా సన్నాహాలు చేశారు. పండిత కోవిదులు, దేవాదాయ శాఖ వేదపండితులు, అన్నవరం దేవస్థానం వేదపండితులు సైతం పుష్కర ఘాట్‌కు చేరుకుని అక్కడ వేద ఘోష మధ్య పుష్కరుడికి వీడ్కోలు పలికే విధంగా ఏర్పాట్లు చేశారు. అదే సమయంలోని ఇటు కోటిపల్లిలోనూ, నది ఒడ్డున వున్న అన్ని క్షేత్రాల్లోనూ విశేష పూజలు ఏర్పాటు చేశారు.
పెద్ద ఎత్తున ముత్తయిదువలను సమీకరించి రాజమహేంద్రవరంలోని అన్ని రేవుల్లోనూ, కోటిపల్లి వద్ద హారతి నీరాజనాల మధ్య పుష్కరుడికి వీడ్కోలు పలికేందుకు దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేసింది. అన్ని ఘాట్ల వద్ద లక్షలాదిగా మహిళా భక్తులు నదికి దీపారాధన చేయడం ద్వారా అంత్య పుష్కరాలకు ముగింపు పలికేందుకు దేవాదాయ శాఖ సమాయత్తమైంది.