రాష్ట్రీయం

రద్దు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 28: తెలంగాణ ఎంసెట్-2ను రద్దుచేయవద్దన్న నినాదాలతో రాష్ట్ర సచివాలయం దద్దరిల్లిపోయింది. ఎంసెట్-2ను రద్దు చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సచివాలయం ఎదుట ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెండోరోజైన గురువారం కూడా పెద్దఎత్తున ధర్నా చేశారు. గురువారం జరిగిన ధర్నాలో దాదాపు రెండు వందల మంది పాల్గొనగా, శుక్రవారం కూడా కొనసాగిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రకటించారు. మంచి ర్యాంకు వచ్చిన విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా శుక్రవారం జరిగే ధర్నాలో పాల్గొనాలని విద్యార్థుల తల్లిదండ్రులు పిలుపు ఇచ్చారు. ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయవద్దని, లీకు చేసిన వారిపై మాత్రమే చర్య తీసుకుని మిగిలిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ధర్నా సాయంత్రం ఆరుగంటల వరకు కొనసాగింది.
ధర్నా చేస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో పదిమందిని సచివాలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసేందుకు సెక్యూరిటీ సిబ్బంది అనుమతించారు. ‘డి’ బ్లాకులో ఉన్న హోంమంత్రిని 10-15 మంది కలిసి చర్చించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హోం మంత్రి మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, ఎంసెట్-2లో మెరిట్ సాధించిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ధర్నా చేస్తున్న విద్యార్థులను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎంసెట్-2ను రద్దు చేయవద్దంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
‘రద్దుచేస్తే డాక్టర్లు కాదు..
పేషెంట్లు అవుతాం’
ఎంసెట్-2ను ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయవద్దని విద్యార్థులు మీడి యా ముందు డిమాండ్ చేశారు. హోంమంత్రితో మాట్లాడిన తర్వాత ఉన్నత ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎ. శ్రీకండేశ్వరరెడ్డి (11 వ ర్యాంకు), కోశిత (300), సాయిప్రతాప్ (141), ఎ.అభినవ్ (826), కుశ్లూ (256), మనీషా (582), సహయోగ్ సాంగ్వి (490), ఎ. శాండిల్య (553) తదితరులు మీడియాతో మాట్లాడుతూ, ఎంసెట్-2 ను ఎట్టిపరిస్థితిలో రద్దు చేయవద్దని, కేవలం తప్పు చేసిన వారిని మాత్రమే శిక్షించాలని డిమాండ్ చేశారు. మళ్లీ పరీక్ష పెడితే మానసికంగా తాము కృంగిపోతామని, డాక్టర్లు కావాల్సిన తాము పేషంట్లుగా మారి దవాఖానాలో చేరాల్సి వస్తుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మహేందర్, అశోక్, ఎ. సురేశ్‌కుమార్, లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ ఎంసెట్-2 రద్దు చేస్తే తాము కోర్టుకు వెళతామన్నారు. తమ పిల్లలు రేయింబవళ్లు కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించారని, మళ్లీ పరీక్ష పెడితే మానసికంగా కృంగిపోతారని వెల్లడించారు. ఈ కారణంగా ప్రభు త్వం మానవతా ధృక్పథంతో నిర్ణయా లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విశ్వవిద్యాలయాల్లో ఆందోళన
వివిధ విద్యార్థి సంఘాలు జెఎన్‌టియు (హెచ్)తో పాటు ఉస్మానియా విశ్వవిద్యాయంలో పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఎంసెట్-2 రద్దు చేయవద్దంటూ కోరారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎబివిపి నేతృత్వంలో మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని తర్వాత విడిచిపెట్టారు.

చిత్రం.. సచివాలయం వద్ద గురువారం ధర్నా చేస్తున్న ఎంసెట్ ర్యాంకర్లు, తల్లిదండ్రులు