రాష్ట్రీయం

ఎక్కడి పనులక్కడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల ప్రారంభానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. పనులు మాత్రం ఇప్పటికీ సా...గుతూనే ఉన్నాయి. ఈ నెల 4 నాటికి పుష్కర పనులన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినా, పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. పుష్కరాలను వేదికగా చేసుకుని కృష్ణా - గోదావరి నదీ సంగమ ఘట్టాన్ని పెద్దఎత్తున ప్రచారంలోకి తేవాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం నగరానికి పాతిక కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నం వద్ద భారీ ఘాట్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడే నదీ హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ పనులేవీ ఇంకా కొలిక్కి రాలేదు. ఇబ్రహీంపట్నం జంక్షన్ నుంచి సుమారు కిలోమీటరున్నర దూరంలో ఉన్న ఘాట్ వద్దకు యాత్రికులు నడిచి వెళ్లాలి. ఈ మార్గంలో వాహనాలను అనుమతించరు. ఇందుకోసం రోడ్లను ఇప్పటికీ నిర్మిస్తూనే ఉన్నారు. అలాగే ఘాట్ల పని 50శాతం కూడా పూర్తికాలేదు. ఇంకా కాంక్రీట్ వేసే పనిలోనే సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఇప్పుడిప్పుడే బిగిస్తున్నారు. తాత్కాలికంగా నిర్మించిన హెలిప్యాడ్ రోడ్డు ధ్వంసమైంది. పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. యాత్రికులను ఆకట్టుకునేందుకు నిర్మిస్తున్న నమూనా దేవాలయాల పనులు కూడా పూర్తికాలేదు. సోమవారం సాయంత్రం చూస్తే పుష్కరాలు ప్రారంభమయ్యాక కూడా పనులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. నగరంలోని పున్నమి ఘాట్‌ను విఐపి ఘాట్‌గా ప్రకటించారు. ఇక్కడ కూడా 40 శాతం పనులు మిగిలే ఉన్నాయి. పున్నమి గెస్ట్‌హౌస్‌లోని గార్డెన్‌ను అభివృద్ధి చేయాలని అనుకున్నారు. కానీ అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. పున్నమి ఘాట్ నుంచి దుర్గా ఘాట్‌కు వెళ్లే రహదారిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేదు. ప్రధానమైన దుర్గాఘాట్ వద్ద కూడా పనులు పూర్తి కాకపోవడం గమనార్హం. దుర్గా ఘాట్ వద్ద ఉన్న మోడల్ గెస్ట్‌హౌస్‌ను పునర్నిర్మిస్తున్నారు. ఆ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నా, ఇంకా 40శాతం వరకు పనులు మిగిలే ఉన్నాయి. మరోపక్క ప్రకాశం బ్యారేజ్‌కు రంగులు వేసే పనులు సోమవారమే ప్రారంభించారు.
ఇదిలావుంటే, స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్ నుంచే మూడు జిల్లాల్లో జరుగుతున్న పుష్కరాలను ముఖ్యమంత్రి పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం కౌన్సిల్ హాలు రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇక్కడ పనులు హడావుడిగా జరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే.. పుష్కరాల వేళకు ఈ కౌన్సిల్ హాలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యే అవకాశం కనిపించడం లేదు. కాగా, కృష్ణా బ్యారేజ్ నుంచి శనీశ్వరాలయం మీదుగా నగరంలోకి ప్రవేశించే రహదారిని వెడల్పు చేసే పనులు కొలిక్కి రాకపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. కాగా, పుష్కర పనులను మంత్రులు గంటకొకరు పర్యవేక్షించి హడావుడి చేసి వెళుతున్నారేతప్ప వాటి ప్రగతి గురించి పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. ఫ్లైఓవర్ పనులను ప్రస్తుతానికి నిలిపివేశారు. దానికింద నాలుగు రోడ్ల నిర్మాణాన్నైనా పూర్తి చేస్తారనుకుంటే అదికూడా సాధ్యం కాలేదు.

చిత్రం.. ఇబ్రహీంపట్నం నదీ ప్రాంతం వద్ద సోమవారం సాయంత్రం నాటికీ నిర్మాణంలో ఘాట్లు