రాష్ట్రీయం

‘నీట్’ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా రెండు దశల్లో నిర్వహించిన ‘నీట్’ ఫలితాలను సిబిఎస్‌ఇ మంగళవారం నాడు ప్రకటించింది. ఇందులో గుజరాత్‌కు చెందిన హెత్ షా జాతీయ టాపర్‌గా నిలిచాడు, రెండో స్థానంలో ఒరిస్సాకు చెందిన ఏకాంష్ గోయల్, మూడో స్థానంలో రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ బాజియా నిలిచారు. 720 మార్కులకు నిర్వహించిన నీట్ పరీక్షలో జాతీయ టాపర్ హెత్‌షాకు 685 మార్కులు రాగా, ఏకాంష్‌కు 682, నిఖిల్ బాజియాకు 678 , ఆషాంక్ ఖైతాన్‌కు 677 మార్కులు వచ్చాయి. హెత్ షా 99.999863 పర్సంటైల్, ఏకాంష్ 99.999726, నిఖిల్ 99.999590 పర్సంటైల్ సాధించడం గమనార్హం.
తర్వాతి ర్యాంకుల్లో ఆరుషి(676), ద్యుతి షా (675), జపన్నూర్ కౌర్ (672), ద్రితిమన్ చటర్జీ(671), అమిత్ కుమార్ (669), ఉత్కర్ష్ ఆనంద్ (668) ఉన్నారు. 3,69,648 మంది అబ్బాయిలకు 3,37,572 మంది హాజరుకాగా 15 శాతం కోటాలో 11,058 మంది, మొత్తం మీద 1,83,424 మంది అర్హత సాధించారు. 4,32,930 మంది అమ్మాయిలకు గానూ 15 శాతం కోటాలో 8,266 మంది, మొత్తం మీద 2,26,049 మంది అర్హత సాధించారు. 15 మంది ట్రాన్స్ జండర్లకు 9 మంది హాజరుకాగా, అందులో ఐదుగురు అర్హత సాధించారు. మెడికల్, డెంటల్ కాలేజీల్లో నేరుగా అడ్మిషన్లకు, ఎంపిక చేసిన కాలేజీల్లో 15 శాతం ఓపెన్ కోటాలో అడ్మిషన్లకు రెండుమార్లు సిబిఎస్‌ఇ నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు)ను నిర్వహించింది. ఎఐపిఎంటి పేరుతో మే 1న నిర్వహించిన నీట్-1కు ఆరు లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.
నీట్-1కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నాన్‌లోకల్ అభ్యర్ధులు మాత్రమే నీట్-1కు అర్హులయ్యారు. అతి కొద్ది మంది మాత్రమే నీట్ -1కు ఈ రెండు రాష్ట్రాల నుండి హాజరయ్యారు. జూలై 24న నీట్-2ను నిర్వహించారు. రెండో సారి నిర్వహించిన నీట్‌కు దేశవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మంది హాజరయ్యారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి 40వేల మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో ఎంత మందికి మంచి మార్కులు దక్కాయనేది ఇంకా తేలాల్సి ఉంది. జనరల్ అభ్యర్ధుల కటాఫ్ 685 నుండి 145 మార్కుల వరకూ ఉండగా, ఒబిసి 678- 118 మార్కులుగా నిర్ణయించారు. ఎస్టీ 599-118 మార్కులు, ఎస్సీ 595-118 మార్కులు, పిహెచ్ 474-118 మార్కులుగా నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది విద్యార్ధులకు మంచి ర్యాంకులు వచ్చాయని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కోటా 15 శాతం సీట్లను నీట్ మెరిట్ ఆధారంగానే భర్తీ చేస్తారు. కాగా ఇప్పటికే నీట్ పరిధిలోకి చేరిన రాష్ట్రాల్లో మాత్రం మెడికల్, డెంటల్ కాలేజీల్లో మొత్తం సీట్లు నీట్ ద్వారానే భర్తీ చేస్తారు.

చిత్రాలు.. రాజస్థాన్‌కు చెందిన నిఖిల్ బాజియా (3వ ర్యాంకు)
ఒరిస్సాకు చెందిన ఏకాంష్ గోయల్ (2వ ర్యాంకు)
టాపర్ గుజరాత్ విద్యార్ధి హెత్ షా