రాష్ట్రీయం

అధికారాలు లేకుంటే ఏంచేయలేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదంగా తయారైన కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తాము ప్రతిపాదించిన ముసాయిదా మార్గదర్శకాలపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని కృష్ణా నదీ జలాల బోర్డు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. మార్గదర్శకాలను వెంటనే అమలు చేయని పక్షంలో తాము ఏమి చేయలేమని కేంద్రానికి తెలియచేసినట్లు తెలిసింది. ఈ నెల 24న శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో అందుబాటులో ఉన్న నీరు, వచ్చే ఖరీఫ్‌కు, అలాగే తాగునీటి అవసరాలకు వినియోగించుకునే విషయమై రెండు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లతో కృష్ణాబోర్డు కార్యదర్శి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వచ్చే రెండునెలలకు నీటి వినియోగం ప్రణాళికను ఖరారు చేస్తారు.
రెండు నెలల క్రితం కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు తమకు బేషరతుగా అప్పగించే విధంగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయాలని కోరిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించినా, తెలంగాణ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జలాల కేటాయింపుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, తెలంగాణకు ఎక్కువ వాటా వస్తుందని తెలంగాణ కేంద్రాన్ని కోరింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున బోర్డుకు అధికారాలు అప్పగించవద్దని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. తెలంగాణ కోరికమేరకు కేంద్రం ఒక అపెక్స్ బాడీని నియమిస్తామని హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఈవిషయమై అపెక్స్ బాడీని సమావేశపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాని ఇంతవరకు కేంద్రం ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో తమకు అధికారాలు ఇవ్వని పక్షంలో తమ సూచనలు కాగితాలకే పరిమితమవుతాయని కేంద్రానికి బోర్డు స్పష్టం చేసినట్లు సమాచారం. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచినా ఇంతవరకు కృష్ణా బోర్డుకు అధికారాలను దఖలు పరుస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయలేదు. విభజన చట్టం ప్రకారం కృష్ణాబోర్డు కార్యాలయం ఆంధ్రాలో, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలో ఏర్పాటు చేయాలి. ఈ రెండు బోర్డుకు అయ్యే వ్యయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు భరించాలి. ప్రాజెక్టుల వద్ద నిర్వహణకు కేంద్ర బలగాలను నియమించాలి. కాని వీటిల్లో ఇంతవరకు ఏ ఒక్క అంశం కూడా కార్యరూపం దాల్చలేదు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 38 టిఎంసిల వరకు నీటిని ఈనెల 16వరకు నాగార్జునసాగర్‌కు విడుదల చేసి ఆ తర్వాత గేట్లు మూసివేయాలని కృష్ణా బోర్డు చేసిన సూచనను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఖాతరు చేయడం లేదు. గత నెల వరకు 20 టిఎంసిల నీటితో బోసిపోయి ఉన్న శ్రీశైలం రిజర్వాయర్ ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో 159 టిఎంసిల నీటితో కళకళలాడుతోంది. దీంతో రెండు రాష్ట్రాలు జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. దీనివల్ల దిగువకు రోజుకు 35వేల టిఎంసిల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటి మట్టం 874.1 అడుగులు ఉంది. కనీసం 854 అడుగులు ఉండేటట్లు ఉంటేనే చెన్నైకి, పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు సాగునీటిని విడుదల చేయాల్సి ఉంటుంది.
అలాగే పోతిరెడ్డిపాడుకు ఏ మేరకు నీటిని వదులుతున్నారో ఏపి ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదని కృష్ణా బోర్డు పేర్కొంది. గోదావరి నదిపై పట్టిసీమ లిఫ్ట్‌ను పూర్తి చేసి కృష్ణా నదికి నీటిని మళ్లించడం వల్ల తమకు 80టిఎంసిల కృష్ణా జలాల్లో 40 టిఎంసిల నీటిని వినియోగించుకునే హక్కు ఉందని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసింది. పట్టిసీమ పోలవరంలో భాగమని, పోలవరం పూర్తయిన తర్వాత మాత్రమే గోదావరి జల ఒప్పందం అమలులోకి వస్తుందని ఏపి అంటోంది. కృష్ణా బోర్డుకు అధికారాలు అప్పగిస్తే రంగారెడ్డి-పాలమూరు లిఫ్ట్, దిండి ఎత్తిపోతల పథకాలకు బోర్డు అడ్డుపడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళనతో ఉంది. ఇప్పటికే ఏపి ప్రభుత్వం ఈ విషయమై గుంటూరు జిల్లా రైతాంగం ద్వారా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది.