రాష్ట్రీయం

సంకల్ప బలంతో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 18: సర్వతోముఖాభివృద్ధికి సంకల్ప బలంతో ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఏడోరోజైన గురువారం కృష్ణా జిల్లా హంసలదీవి సాగరసంగమ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. సాగరసంగమ క్షేత్రాన ఉన్న కృష్ణమ్మ పాదాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. కృష్ణా, గోదావరి నదులు రాష్ట్రానికి ప్రాణ, జీవనాడులన్నారు. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో గోదావరి జలాలను కృష్ణమ్మతో అనుసంధానం చేయాలని సంకల్పించి పట్టిసీమ ప్రాజెక్టును దిగ్విజయంగా నిర్మించామన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని నదుల అనుసంధానాన్ని తమ ప్రభుత్వం చేపట్టి చరిత్ర సృష్టించిందన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు ఎంతోమంది ఎన్నో ఆటంకాలు సృష్టించినా లక్ష్యపెట్టక అనుకున్న సమయంలో రెండు నదుల్ని అనుసంధానం చేశామన్నారు. ఖరీఫ్‌కు గోదావరి జలాలు అందిస్తున్న తరుణంలో కొందరు దుర్మార్గులు గండి కొట్టారని, వారి పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు కృష్ణా, గోదావరి, పెన్నా నదులను అనుసంధానం చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. దీనిద్వారా రాయలసీమ ప్రాంత భూములను సస్యశ్యామలం చేస్తామన్నారు. రాయలసీమకు నీరిచ్చేవరకు విశ్రమించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రెండు నదుల పుష్కరాలు జరుపుకోవడం తన అదృష్టమన్నారు. రాష్ట్రానికి ఇచ్చాపురం నుండి తడ వరకు విస్తారమైన సముద్ర తీరం ఉందని, దాని వెంబడి సాగరమాల ప్రాజెక్టు కింద రహదారి మార్గం ఏర్పాటు చేసి కోస్టల్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు రూపొందించామన్నారు. గత పాలకులు అవసరం లేకపోయినా హంసలదీవి ప్రాంతాన్ని అభయారణ్యంగా రిజర్వు చేశారన్నారు. ఫలితంగా ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయన్నారు. ఈవిషయమై కేంద్రంతో సంప్రదించి డీ రిజర్వు చేయించి ప్రాముఖ్యత కలిగిన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బందరు ఓడరేవు నిర్మాణం, భవానీపురం - ఉల్లిపాలెం వంతెన నిర్మాణంతో దివిసీమ ప్రాంతాన్ని పర్యాటక, పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దీనిద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంట్ ప్యానల్ స్పీకర్, బందరు పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జిల్లా కలెక్టర్ బాబు.ఎ, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. హంసలదీవి వద్ద గురువారం నిర్వహించిన
బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు