రాష్ట్రీయం

విప్ ఉల్లంఘన ఫిరాయింపే హైకోర్టు స్పష్టీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ఒక రాజకీయ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీ ఇచ్చిన విప్‌ను ఉల్లంఘించి మండల పరిషత్ లేదా ఇతర స్థానిక సంస్థల అధ్యక్ష పదవికి పోటీ చేస్తే, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 కింద ఫిరాయింపు కిందికే వస్తుందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్, జస్టిస్ అనిస్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక మహిళా ఎంపిటిసి సభ్యురాలి అనర్హతపై ఎన్నికల ట్రిబ్యునల్ జారీ చేసిన ఆదేశాలపై జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేయాల్సిందిగా టిపిసిసి కార్యదర్శి ఎన్ అశోక్ హైకోర్టు సింగిల్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. కాగా స్టే ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు.
ఈ విషయమై ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేసింది. ‘సాధారణంగా రాజకీయ పార్టీలు క్రమశిక్షణ కోసం విప్‌ను జారీ చేస్తుంటాయి. ఫిరాయింపులను నిరోధించేందుకు విప్‌లను పార్టీలు జారీ చేస్తుంటాయి. పార్టీ విప్‌ను ఉల్లంఘించి అవిధేయత ద్వారా విప్ అందుకున్న వ్యక్తులు బెనిఫిట్ పొందుతారు. ఆత్మప్రబోధం మేరకు నడుచుకున్నట్లు వీరే చెబుతుంటారు’ అని హైకోర్టు పేర్కొంది. అలాగే విప్‌ను జారీ చేయడం ద్వారా తమ పార్టీకి చెందిన ప్రతినిధులు అధ్యక్ష లేదా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయకుండా నిరోధించినట్లవుతుందని కూడా హైకోర్టు పేర్కొంది. తాజా కేసులో ఎంపిటిసి సభ్యురాలు ఏ పదవికి పోటీపడకుండా, విప్‌ను ఉల్లంఘించి మరో రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినా ఫిరాయింపు కిందికే వస్తుందని, దీనిని న్యాయపరంగా సమర్థించలేమని హైకోర్టు పేర్కొంది.
అదే ఒక వ్యక్తి విప్‌ను ఉల్లంఘించి అధ్యక్ష పదవికి పోటీ పడితే, ఈ చర్య బేరసారాల్లో భాగంగా ఫిరాయించినట్లుగా భావించలేమని హైకోర్టు తెలిపింది. పైగా ఒక అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థిపై విప్‌ను జారీ చేయడం ద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసినట్లుగానే భావించాల్సి ఉందని, ఈ అంశం చాలా విస్తృతమైనదని హైకోర్టు తెలిపింది. ఒక పదవిని చేపట్టేందుకు అర్హత లేదని ఎన్నికల ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాలపై జిల్లాకోర్టు స్టే ఇవ్వడం సరైన విధానం కాదని హైకోర్టు తీర్పులో పేర్కొంది.

నేడు మాతృభాషా
అధ్యయనంపై సదస్సు

హైదరాబాద్, ఆగస్టు 24: ప్రజల్లో మాతృభాష అధ్యయనం ఆవశ్యకతను తద్వారా మానవ సంబంధాల పరిరక్షణ గురించి, పరిపాలనా సంబంధ అంశాల గురించి మరీ ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వీలుగా తెలంగాణ తెలుగు భాషా పరిరక్షణ సమితి ఈ నెల 25న మహబూబ్‌నగర్‌లో ఒక సదస్సు నిర్వహించనుంది. గతంలో భాషా పరిరక్షణ సమితి వరంగల్, కరీంనగర్ పట్టణాల్లో చర్చా గోష్టులు నిర్వహించినట్టు సమితి కన్వీనర్ వెల్చాల కొండలరావు పేర్కొన్నారు.

సబితకు భద్రత ఉపసంహరణ

హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణ మాజీ హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భద్రతను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సబితా ఇంద్రారెడ్డి 2009 నుంచి 2014 వరకు హోంశాఖ మంత్రిగా పనిచేశారు. అప్పటినుంచి ప్రస్తుత టిఆర్‌ఎస్ ప్రభుత్వం భద్రతను కొనసాగిస్తూ వచ్చింది. బుధవారం ఒక గన్‌మెన్‌ను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఓ లేఖ అందజేసింది. తన భద్రత కుదింపుపై సబిత కోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.
జీతాలు చెల్లించడం లేదు
108 ఉద్యోగుల సంఘం నేత వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 24: తెలంగాణలోని 108 అంబులెన్స్ సర్వీసు ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని తెలంగాణ 108 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ పల్లె తెలిపారు. ఈ నెలలో ఇప్పటి వరకు జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల కుటుంబాల జీవితాలు దుర్భరంగా మారాయని ఆయన బుధవారం ఒక ప్రకటనలోపేర్కొన్నారు. కాబట్టి సిఎం కెసిఆర్ చొరవ తీసుకుని వెంటనే జీతాలు చెల్లించేలా సంబంధికులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.