రాష్ట్రీయం

కూచిపూడి నాట్య గురువు ఉమారామారావు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఆగస్టు 27: ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, నాట్యకళకే అంకితమైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత నాట్య శాఖాధిపతి డాక్టర్ కొల్లూరి ఉమారామారావు శనివారం తెల్లవారు జామున హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1938 జూలై 4న విశాఖపట్నంలో జన్మించిన ఉమారామారావు 5వ ఏటనే కూచిపూడి నాట్యంలో తొలి అడుగులు వేశారు. ప్రముఖ నాట్య గురువుల వద్ద కూచిపూడి నాట్యం అభ్యసించి నిష్ణాతులయ్యారు. తంజావూరు మహరాజ్ నుహాజి రచించిన యక్షగానాలు, మేలట్టూర్‌కు చెందిన వెంకట్రామయ్య శాస్ర్తీ రచించిన ప్రబంధాలకు కూచిపూడి నాట్యాన్ని జతచేశారు. విష్ణుపల్లకి సేవ ప్రబంధం, శివపల్లకి సేవ ప్రబంధం, గంగాగౌరీ సంవాదం వంటి ప్రబంధాలను రచించారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం చిత్రానికి నృత్యదర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన హ్యాపీడేస్ చిత్రంలో అతిథి పాత్ర వేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా వేలాది మంది ఔత్సాహికులకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చారు. దేశ, విదేశాల్లో 2వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు.
ఉమారామారావు నిర్దేశకత్వంలో డాక్టర్ అలేఖ్య పుంజాల, డాక్టర్ వనజ ఉదయ్, డాక్టర్ భాగవతుల శేతురాం, సరిత దిలీప్ తదితర ప్రముఖ నాట్యాచార్యులు శిక్షణ పొందారు. 2003లో అప్పటి రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చేతులమీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డును అందుకున్నారు. ఉమారామారావు మృతి పట్ల కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు పసుమర్తి రత్తయ్య శర్మ, డాక్టర్ వేదాంతం రామలింగశాస్ర్తీ, వేదాంతం రాధేశ్యాం, బిస్మిల్లాఖాన్ యువపురస్కార్ అవార్డు గ్రహీతలు వేదాంతం వెంకటాచలపతి, చింతా రవిబాలకృష్ణ, ఏలేశ్వరపు శ్రీనివాస్, కురవి ప్రసాద్, వేదాంతం సత్యనృసింహ శాస్ర్తీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

అప్పటి రాష్టప్రతి అబ్దుల్ కలాం నుండి కేంద్ర సంగీత, నాటక
అకాడమీ అవార్డు అందుకుంటున్న డాక్టర్ ఉమారామారావు (ఫైల్ ఫొటో)