రాష్ట్రీయం

నాది జనపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన పోరాటంలో ప్రజలతో కలిసి ఉద్యమం నడిపినట్టే, ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిలో ప్రజల పక్షానే పనిచేస్తానని తెలంగాణ జెఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణలోని తాజా పరిస్థితులపై ఆదివారం ఆంధ్రభూమి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా ఆందోళనలు చేస్తున్నారు?
నేను జీవితాంతం ప్రజలపక్షానే ఉంటాను. ప్రజావసరాలు గుర్తించి, సాధించేందుకు పాటుపడుతాను. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా, మంచి చేస్తే సమర్థిస్తాను. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తాం.
ఉద్యమ సమయంలో కెసిఆర్‌తో నిరంతరంవున్న మీరు, ఇప్పుడెందుకు కలవడం లేదు?
తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాడు నా ప్రాధాన్యత. అందుకే రోజూ కెసిఆర్, ఇతర నేతలతో చర్చించేవాడిని. ఇప్పుడు కెసిఆర్ సిఎం పదవిలో ఉన్నారు. పాలనలో బిజీగా ఉంటారు. నేను ప్రజాపక్షపాతిని. కలవాల్సిన అవసరం ఉండటం లేదు. సమస్యలుంటే వివిధ మార్గాల్లో సర్కారు దృష్టికి తీసుకెళ్తున్నాం.
కొత్త తెలంగాణలోని ప్రస్తుత పాలనపై మీ అభిప్రాయం?
తెలంగాణ తన అస్తిత్వాన్ని చాటుకుంది. సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదల కనిపిస్తోంది.
ప్రజలకిచ్చిన హామీల మాటేంటి?
నెరవేరితే ఆందోళనల అవసరం ఏముంటుంది? జలాల పంపిణీపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నాయి. కొత్తగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత పది జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధులు అవసరాలకు అనుగుణంగా అందుబాటులోకి వచ్చాయి. ఉపాధి అవకాశాలు మాత్రం అనుకున్న మేరకు అందుబాటులోకి రాలేదు.
ప్ర: ఉద్యమకారులకు పరిపాలనలో ప్రాధాన్యత లభిస్తోందా?
జ: తెలంగాణ ఉద్యమంలో పాల్నొన్న వారికి పరిపాలనలో తగినంత ప్రాధాన్యత లభించడం లేదు. తెలంగాణను వ్యతిరేకించిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది మంచి విధానం కాదు.
ప్ర: తెలంగాణ సాధనలో ఏ రాజకీయ పార్టీ కీలకపాత్ర పోషించిందని భావిస్తున్నారు.
జ: తెలంగాణ ఉద్యమంలో ప్రజలే ‘హీరో’లు. వారి ఆందోళన వల్లే ప్రత్యేక రాష్ట్రం ఆవిష్కృతమైంది.
ప్ర: బంగారు తెలంగాణ అంటున్నారు కదా!
జ: పేరు ఏదైనా తెలంగాణ అన్ని రంగాల్లో ఉన్నతస్థాయికి చేరాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో అభివృద్ధి జరగాలి. ప్రతి వ్యక్తీ గౌరవప్రదంగా జీవించగలగాలి.
ప్ర: తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ జీవించి ఉంటే?
జ: తెలంగాణ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లేవారు. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవారుకాదు.
ప: మల్లన్నసాగర్ విషయంలో మీ ఆందోళన ఫలితం ఎలా ఉందని భావిస్తున్నారు?
జ: వాస్తవ పరిస్థితి ఏమిటో తెలంగాణ ప్రజలకు చెప్పగలిగాం. ప్రజలకు అన్ని అంశాలు అర్థమయ్యాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అవసరమే. అయితే భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలి. పునరావాసం అత్యుత్తమంగా ఉండాలి.
ప్ర: నిజాం చక్కెర కర్మాగారం (ఎన్‌ఎస్‌ఎఫ్) విషయంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీపై మీ అభిప్రాయం?
జ: ఎన్‌ఎస్‌ఎఫ్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. దానివల్ల రైతులకు, కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఆయా జిల్లాలు అభివృద్ధి చెందుతాయి.
ప్ర: గోదావరి నీటి వినియోగంపై మహారాష్టత్రో కుదిరిన ఒప్పందం ఎలా ఉంది?
జ: జల వివాదాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి. ఒప్పందం కుదర్చుకోవడం మంచిదే. అయితే ఈ ఒప్పందం కాపీని చూశాక దానిపై స్పందిస్తాను.
ప్ర: కొత్త జిల్లాల ఏర్పాటుపై మీ స్పందన ఏమిటి
జ: పరిపాలనకోసం కొత్త జిల్లాలు అవసరమే. జిల్లాల పునర్వ్యస్థీకరణ జరగాలన్నది చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండే. ప్రజల అభిప్రాయాల మేరకే జిల్లాల పునర్విభజన జరగాలి. అనవసర వివాదాలకు తావు ఇవ్వద్దు.
ప్ర: విద్యారంగం ఎలా ఉంది?
జ: కెజి టు పిజి వరకు ఉచిత విద్య అన్న అంశాన్ని వెంటనే అమల్లోకి తేవాలి. విశ్వవిద్యాలయాల విషయంలో యుజిసి మార్గదర్శకాలను విస్మరించి జీవోలు జారీ చేశారు. వర్శిటీలు స్వయంప్రతిపత్తితో నడవాలి. వర్శిటీలకు ఉన్న గౌరవాన్ని కాపాడాలి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎప్పటికప్పుడు జరగాలి. ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలకే ప్రోత్సాహం లభిస్తోంది. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టొద్దు. ఇది మంచి విధానం కాదు.
ప్ర: వైద్య, ఆరోగ్య పరిస్థితి సజావుగా ఉందా
జ: వైద్య, ఆరోగ్య రంగాలు అనారోగ్యానికి గురయ్యాయి. ఈ రంగాలను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. విద్య, వైద్య రంగాల్లో ప్రైవేట్ సంస్థలను నియంత్రించాలి. కార్పొరేట్ సంస్థలను నిర్మూలించాలి. ప్రభుత్వ సంస్థలను ప్రజలకు చేరువలోకి తేవాలి.
ప్ర: ప్రభుత్వ విధానాలు ఎలా ఉన్నాయి?
జ: ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీఠ వేసేలా ప్రణాళికలు ఉండాలి. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు, గ్రామీణ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలి.
ప్ర: ఉద్యోగాల భర్తీ విధానం ఎలా ఉంది?
జ: రాష్ట్రంలో డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు 20 లక్షలు, డిగ్రీలోగా చదువుకున్న వారు 80 లక్షల మంది ఉన్నారు. వీరికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వ విధానం రూపొందించుకోవాలి.