రాష్ట్రీయం

తెరపైకి జనగామ, గద్వాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రతిపాదిత జిల్లాల ముసాయిదాపై వ్యక్తమవుతోన్న ప్రజాభిప్రాయం మేరకు జనగామ, గద్వాల జిల్లాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. వరంగల్ నగరాన్ని వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా విభజించడం పట్ల ప్రజలు ముఖ్యంగా సొంతపార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచే వ్యక్తమవుతోన్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు సమాచారం. హన్మకొండ స్థానంలో జనగామను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వంపై పెద్దఎత్తున వత్తిడి పెరగడంతో, జనగామ జిల్లా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. యాదాద్రి జిల్లాలో ప్రతిపాదించిన జనగామ నియోజకవర్గంలోని జనగామ మండలం, సిద్దిపేట జిల్లాలో ప్రతిపాదించిన చేర్యాల, మద్దూర్ మండలాలు, కొత్త మండలాలుగా ప్రతిపాదించిన చిల్పూర్, వేలేరుతోపాటు హన్మకొండ జిల్లాలో ప్రతిపాదించిన నర్మెట్ట, రఘునాథపల్లి, దేవరుప్పల మండలాలను కలుపుకుని జనగామ, స్టేషన్‌ఘనపూర్, పాలకుర్తి మూడు నియోజకవర్గాలతో జనగామ జిల్లాను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. చారిత్రక వరంగల్ నగరానికి ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని వరంగల్ జిల్లా నుంచి హన్మకొండను విడదీయొద్దని పాలకపక్షానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో ప్రభుత్వాన్ని కోరుతున్నారు. హన్మకొండ జిల్లా ప్రతిపాదన పట్ల జిల్లాలో ప్రజల నుంచి వ్యక్తమవుతోన్న నిరసన భవిష్యత్‌లో పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉండటంతోపాటు, జనగామ జిల్లా కోసం జరుగుతోన్న ఆందోళన నేపథ్యంలో హన్మకొండ స్థానంలో జనగామకు అవకాశం కల్పించాలని సొంత పార్టీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించడంతో, హన్మకొండకు బదులుగా జనగామను జిల్లాగా ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఇలాఉండగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి వరంగల్ జిల్లా జనగామ, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల జిల్లాల కోసం ప్రజలు పెద్దఎత్తున ఉద్యమించారు. ప్రతిపాదిత జిల్లాల ముసాయిదా వెలువడిన తర్వాత కూడా ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనగామ జిల్లా కోసం సొంత పార్టీ ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన వత్తిడి నేపథ్యంలో పునరాలోచనలో పడిన ప్రభుత్వం, ఇక మిగిలిన ఒకే ఒక గద్వాల జిల్లా డిమాండ్‌పైనా దృష్టి సారించినట్టు తెలిసింది. వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధుల స్ఫూర్తితో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు కూడా గద్వాల జిల్లా కోసం సిఎంపై వత్తిడి తీసుకోస్తున్నట్టు తెలిసింది. పైగా జనగామ జిల్లాను ఏర్పాటు చేసి గద్వాల ఒక్కదానినే వదిలేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుందని సిఎంకు సూచించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జోగులాంబ పేరుతో గద్వాల కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెరాస వర్గాల సమాచారం. వనపర్తి జిల్లాలో ప్రతిపాదించిన ఆలంపురం, గద్వాల నియోజకవర్గాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిపాదించిన కొత్తకోట నియోజకవర్గంలోని ఆత్మకూర్, అమరచింత (కొత్త మండలం), మండలాలతో గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జిల్లాల సంఖ్య 27కు మించకుండా ఏ విధంగా సర్దుబాటు చేయడానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోన్నట్టు సమాచారం.