రాష్ట్రీయం

అభివృద్ధి నమూనాకు టిజెఎసి ‘నక్షా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ సమగ్ర అభివృద్ధికోసం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటి (టిజెఎసి) కృషి చేస్తుందని ఈ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. టిజెఎసి ఆధ్వర్యంలో ‘తెలంగాణ అభివృద్ధి నమూనా- టిజెఎసి ఆలోచన’ అన్న అంశంపై ఆదివారం హైదరాబాద్ (నాచారంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్)లో సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సు పూర్తయిన తర్వాత వివరాలను కోదండరాం మీడియా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక ‘నక్షా’ (ప్రణాళిక) రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచేదే నిజమైన అభివృద్ధి అని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పనలపై సమగ్రంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. టిజెఎసి నిర్మాణంపై చర్చించామని వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకే జిల్లాల పునర్వ్యవస్థీకర జరగాలని సదస్సు అభిప్రాయపడ్డదన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమం జరుగుతోందని, ఈ ఉద్యమానికి టిజెఎసి మద్దతు ఇస్తోందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఒక సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. మండలాలు, డివిజన్లు, జిల్లాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణపై జరుగుతున్న పోరాటంలో ప్రజలపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కృష్ణాజలాల వినియోగం- రీఇంజనీరింగ్‌పై త్వరలో మహబూబ్‌నగర్‌లో సదస్సు నిర్వహిస్తామన్నారు. ఉద్యోగాల భర్తీ, ఉపాధి కల్పన, జోనల్ వ్యవస్థలపై జిల్లాల్లో పర్యటించి సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ అంశంపై శాసనసభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కరవుకు సంబంధించి కేంద్రం నిధులు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎందుకు పంపిణీ చేయలేదో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరవుబారిన పడ్డ రైతులను ఆదుకోవాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకం రైతులకు అనుగుణంగా ఉండేలా రూపొందించాల్సి ఉందన్నారు. గోదావరి జలాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని వక్తలంతా అభిప్రాయపడ్డారన్నారు.
వక్తల అభిప్రాయాలు
సదస్సులో భాగంగా జరిగిన వివిధ సెషన్స్‌ల్లో వేర్వేరు అంశాలపై నిపుణులు మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి నమూనాపై హైదరాబాద్ సెంట్రల్ యూ నివర్సిటీ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి వివరించారు. ప్రత్యామ్నాయ నమూనా అంశం పై ఆయన వివరించారు. ఈ సెషన్‌కు అడ్వకేట్ జెఎసి నాయకులు ఎన్.ప్రహ్లాద్ అధ్యక్షత వహించారు.
టిజెఎస్ కో-కన్వీనర్ జి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన మరో సెషన్‌లో జోనల్ వ్యవస్థ, స్థానిక రిజర్వేషన్లపై సచివాలయం ఉద్యోగుల నేత సురేష్ వివరించారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధి వనరులపై జరిగిన సెషన్‌కు ప్రొఫెసర్ పురుషోత్తం అధ్యక్షత వహించగా, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి.రవీందర్‌రావు వివరించారు.
నీటి వినియోగంపై జలరంగం నిపుణులు బొజ్జా భిక్షం ప్రసంగించారు. కృష్ణాజలాల వినియోగంపై ప్రొఫెసర్ రమేష్‌రెడ్డి, గోదావరి ప్రాజెక్టులపై విద్యుత్ జెఎసి సమన్వయకర్త కె.రఘు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. ఈ సదస్సులో టిజెఎసి సమన్వయకర్త పిట్టల రవీందర్, రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడారు.
ఇవీ తీర్మానాలు
ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై జిల్లాల్లో సదస్సులను నిర్వహించాలని తీర్మానించారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై జిల్లాస్థాయిలో సదస్సులతో పాటు, హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణ, మార్పులు, చేర్పులపై జిల్లాల వారీగా ప్రజాభిప్రాయం సేకరించాలని సదస్సులో తీర్మానించారు.

చిత్రం.. ‘తెలంగాణ.. అభివృద్ధి నమూనా టిజెఎసి ఆలోచన’ అన్న అంశంపై
జరిగిన సదస్సులో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం