ఆంధ్రప్రదేశ్‌

కరవుపై యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 30: కరవుపై యుద్ధం ప్రకటించాం. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన అసాధారణ కరవు నివారించేందుకు అధికార యంత్రాంగాన్ని, సాంకేతిక వ్యవస్థను సమాయత్తం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. స్థానిక కమాండ్ కంట్రోల్ రూంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి, పంటలను కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఫలప్రదమయ్యాయని ఆయన చెప్పారు. ‘రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కరవు ఏర్పడింది. అయితే, కర్నూలు జిల్లాలో రాత్రి కురిసిన వర్షం అక్కడి పంటకు ఉపకరించింది. ఇది నా సంకల్పసిద్ధికి నిదర్శనం’అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో భూగర్భజలాలు 2.15 మీటర్ల ఎత్తుకు పెరిగాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 64,990 పంట కుంటలు ఏర్పాటు చేశామని, ఇంకా 3,50,000 పంట కుంటలు వివిధ దశల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 36 టిఎంసిల నీటిని నిల్వ చేసి, రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తరలిస్తామని ఆయన చెప్పారు. రాయలసీమలో పంటలను కాపాడే బాధ్యతను తాను తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. 15 సంవత్సరాల నుంచి రాయలసీమ జిల్లాల్లో రైతులు నిరాశ, నిస్మృహలతో జీవిస్తున్నారని అన్నారు. వారి కళ్ళల్లో ఆనందం చూసేందుకు పంట నష్టం వాటిల్లకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. రాయలసీమ జిల్లాల్లో 13,334 రెయిన్ గన్స్, 13,334 స్ప్రింక్లర్స్, 10 వేల ఆయిల్ ఇంజన్లు కేటాయించామని ఆయన చెప్పారు.
రాయలసీమలో కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు 21 మంది ఐఎఎస్ అధికారులను, 80 మంది గ్రూప్-1 అధికారులు, 1270 మంది ఎంపిడిఓలను పంపించామని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఐఎఎస్ అధికారిని నియమించామని, ప్రతి మండలానికి ఒక గ్రూప్-1 అధికారిని నియమించామని ఆయన చెప్పారు. ఆయా జిల్లా కలెక్టర్లు పరిస్థితిని ఎప్పకప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారని చంద్రబాబు చెప్పారు. బుధవారం సాయంత్రానికి నాలుగు జిల్లాల్లో అన్ని పంటలకు ఒక తడి నీరు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశామని ఆయన చెప్పారు. దేవుడు కరుణించకపోయినా, కరవును ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు చెప్పారు. ‘రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేశాను. పంటలను కాపాడేందుకు తీసుకోవలసిన అన్ని చర్యలూ తీసుకుంటున్నా. ఏమాత్రం పంట పాడైనా, దానికి బీమా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నా’నన్నారు.. ఒకటి, రెండు రోజుల్లో బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో దీనిపై చర్చించనున్నానని ఆయన చెప్పారు. పంట నష్టం వాటిల్లితే, రైతులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలి. కేంద్రం ఇచ్చే నష్ట పరిహారం కోసం తాను తప్పుడు నివేదికలు పంపించనని ఆయన చెప్పారు. కాగా, అనంతపురంలో నీరు లేదని, అటువంటప్పుడు రెయిన్ గన్స్, స్ప్రింక్లర్స్ ఎలా పనిచేస్తాయని విలేఖరులు ప్రశ్నించగా, ఆయా రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేసి గొలుసుకట్టు చెరవులను నింపుతామని అక్కడి నుంచి నీటిని పొలాల్లోకి విడుదల చేస్తామని ఆయన చెప్పారు.