ఆంధ్రప్రదేశ్‌

పచ్చని సీమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 31: రాయలసీమను సస్యశ్యామలం చేయటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత కరవు జిల్లాగా పేరున్న అనంతపురం నుంచి శాశ్వతంగా ఆ మహమ్మారిని పారదోలుతానని ఆయన అన్నారు. నిర్దిష్ట గడువును విధించుకుని సీమలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతానని ఆయన అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నష్టపోయిన రైతులకు పంట పూర్తయ్యే నాటికే పంట బీమా చేతికందేలా చర్యలు తీసుకుంటామని ఇందుకోసం పంట బీమాలో సమూల మార్పులు చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడినట్లు చెప్పారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం గుమ్మగట్ట మండలం 75 వీరాపురం గ్రామంలోని పొలాల్లో రెయిన్‌గన్స్ ద్వారా నీటి తడులు అందించే ప్రక్రియను సిఎం పరిశీలించారు. వేరుశనగ మొక్కలను పెరికి కాయలను పరిశీలించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ రైతులు పంటల నష్టపోయిన మరుసటి ఏడాది వరకు బీమా సొమ్ము కోసం ఎదురుచూడాల్సి వస్తోందని, ఇకపై ఆ పరిస్థితి లేకుండా చేస్తామన్నారు. ‘బీమా కంపెనీలను రమ్మన్నాం, గురువారం అనంతపురంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. పంటబీమా మార్గదర్శకాలపై చర్చిస్తాం’ అని అన్నారు. ఇప్పటికే బ్యాంకర్లతో మాట్లాడానని, ఇరిగేషన్ అధికారులతో కూడా చర్చించానని బాబు తెలిపారు. రాయలసీమలోని ప్రాజెక్టులన్నీ నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేస్తామన్నారు. తద్వారా అన్ని చెరువులను నీటితో నింపుతామన్నారు. అలాగే హంద్రీనీవా రెండోదశను త్వరితగతిన పూర్తిచేసి గొల్లపల్లి, మడకశిర వరకు నీరిస్తామన్నారు. ఇప్పటికే నదుల అనుసంధానం ద్వారా డెల్టా ప్రాంతానికి వినియోగించే కృష్ణాజలాల్లో 100 టిఎంసిలు హంద్రీ నీవాకు మళ్లిస్తామన్నారు. కల అనుకున్న హంద్రీనీవాను నిజం చేసి ఇప్పటికే నీటిని జీడిపల్లి వరకు తెచ్చామన్నారు. వాటిని పిఎబిఆర్‌ను పంపుతున్నామని, అలాగే తుంగభద్ర నీరు కూడా వస్తోందని అన్నారు. జీడిపల్లి నుంచి గొల్లపల్లికి, అక్కడి నుంచి మడకశిర, హిందూపురానికి తెస్తామని, అన్ని చెరువుల్ని నింపుతామన్నారు. తర్వాత చిత్తూరు, కుప్పం వరకు నీటిని తరలిస్తామన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ పరిశోధన క్షేత్రం, డైరెక్టరేట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తుఫాన్ వస్తే ఎవరైనా పట్టించుకుంటారని, అదే కరవు వస్తే ఎవరూ పట్టించుకోరని, కరవు చాలా ప్రమాదకరమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోలేదని, ఫలితంగా వ్యవసాయం దివాళా తీసిందని బాబు ఆరోపించారు. పరిపాలన సర్వనాశనమైందన్నారు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం పెరిగిందని, ప్రజల గోడు పట్టించుకోలేదని సిఎం విమర్శించారు. ఈ దశలో రాష్ట్రం విడిపోయిందని, ఒట్టి చేతులతో, కట్టుబట్టలతో వచ్చామన్నారు. ఈ స్థితిలో రాష్ట్రంలో ఓవైపు ఎవ్వరూ చేయని విధంగా సంక్షేమ పథకాలు చేపడుతూనే, మరోవైపు ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుని ఎంత కష్టమైనా ముందుకు పోతున్నామన్నారు. గతంలో కొందరు దుర్మార్గులు రాయలసీమలో హత్యలకు ప్రాధాన్యమిచ్చారని, తుపాకులు పట్టుకుని తిరిగారని, అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించారు.

ప్రతి పేదవాడికి లబ్ధి
పేదవారికి ఉపయోగపడేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటామని సిఎం అన్నారు. ఇకపై అన్ని సేవలూ సెల్ ఫోన్ల ద్వారా అందిస్తామన్నారు. కాబట్టి ప్రతిఒక్కరు సెల్‌ఫోన్ ఆపరేట్ చేయడం నేర్చుకోవాలని కోరారు. అలాగే శాంతిభద్రతల పరిరక్షణకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతామన్నారు. డిఎన్‌ఏ టెక్నాలజీ ద్వారా నేరస్తుల భరతం పడతామన్నారు. ఎలాంటి ఆధారాల కోసం ఎదురు చూడకుండా రెండు గంటల్లోనే సాంకేతికను ఉపయోగించి నిందితుల్ని పట్టుకుని జైలుకు పంపుతామన్నారు. ఆడపడుచులు ధైర్యంగా తిరిగేలా చేస్తానని సిఎం అన్నారు. రాష్ట్రంలో 50 శాతం స్మార్ట్ పల్స్ సర్వే పూర్తయిందన్నారు. త్వరలో చంద్రన్న బీమా పథకం కింద అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే సెప్టెంబర్ 15 నుంచి అమరావతిలో కంట్రోల్ రూమ్ ద్వారా వీధి దీపాల నిర్వహణకు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

చిత్రం... అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం 75 వీరాపురం గ్రామంలో జరిగిన సభలో
ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడుతున్న ఓ రైతు