ఆంధ్రప్రదేశ్‌

పోలవరంతో జల భద్రత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, సెప్టెంబర్ 13: పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి జలభద్రత చేకూరుతుందని, ఈ ప్రాజెక్టును 2018 వర్షాకాలం నాటికి పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రగతిని ప్రతి సోమవారం కెమెరాల ద్వారా పరిశీలించి, సమీక్షిస్తానని, ప్రతి నెల మూడో సోమవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం మనచుట్టూ ఉన్న పరిస్ధితులను పరిశీలిస్తే నీటిభద్రత అవసరం ఎంత ఉందో తేటతెల్లమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేవలం 12 టిఎంసిల నీటి విడుదల విషయంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య అగ్గిరాజుకోవడం చూస్తున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు ఎంత ప్రాధాన్యత కలిగినదో అర్థమవుతుందన్నారు. దీనివల్ల రాష్ట్రానికి అవసరమైన సాగునీరు, తాగునీరుతోపాటు పారిశ్రామిక అవసరాల నిమిత్తం కూడా జలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీపై నీరు పారేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇకనుంచి పోలవరం పనులు యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తామని, సంబంధిత శాఖల మధ్య పూర్తిసమన్వయాన్ని సాధించటం ద్వారా వచ్చే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ప్రతి రోజు ఎంత పని జరగాలి, ఎంత పని జరిగింది అన్న సమాచారాన్ని తెప్పించుకుంటానని, కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ఈ సమాచారాన్ని పరిశీలించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి అధునాతన యంత్రాలను తెప్పించామని, వీటితో పనులు పరుగులు తీస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నుంచి డిశ్చార్జ్ అయ్యే జలాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటాయని, ఈవిధమైన డిశ్చార్జ్ సామర్ధ్యానికి తగిన నిర్మాణాలు ప్రస్తుతం ఎక్కడా లేవన్నారు. ఇంతవరకు అత్యధికంగా రోజుకు 36లక్షల క్యూసెక్కుల డిశ్చార్జ్ నమోదు అయిందని, అయితే పోలవరంలో రోజుకు 50 లక్షల క్యూసెక్కుల నీటి డిశ్చార్జ్‌కు తట్టుకునే నిర్మాణాలను రూపకల్పన చేశామన్నారు. ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు నిమిత్తం రూ.1800 కోట్లు ఖర్చుచేశామని, జాతీయ హోదా ఇచ్చినప్పటి నుంచి కేంద్రం ఆ నిధులను అందిస్తుందన్నారు. దీనిలోనే ఆర్‌ఆర్ ప్యాకేజీ కూడా కలిసి ఉంటుందని వివరించారు. అయితే ఇంత అత్యవసరమైన, ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టును చిత్తశుద్ధితో ముందుకు తీసుకువెళ్తుంటే ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయని విమర్శించారు. కేంద్రం ఈ పనులను రాష్ట్రానికి అప్పగిస్తే కాంగ్రెస్, వైసిపిలకు ఉలుకెందుకని చంద్రబాబు ప్రశ్నించారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేసిన వైసిపి అభ్యర్థి కనీసం రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎటువంటి టెండరు వేయకపోయినా న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, దీంతో స్టే వచ్చిందన్నారు. ఇదో తరహా ఉన్మాదమని, దానికి ఎటువంటి కారణం ఉండదని, మంచి జరుగుతుంటే నష్టం చేయటం ఒక్కటే వారి లక్ష్యమని చంద్రబాబు ధ్వజమెత్తారు.
అనంతరం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల్లో ఉపయోగించడానికి ఆస్ట్రేలియా నుంచి తీసుకువచ్చిన అధునాతన యంత్రాలను చంద్రబాబు ప్రారంభించారు.

చిత్రం... పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు, భారీ యంత్రాలను ప్రారంభిస్తున్న దృశ్యం

ఇక పరుగులే!

పోలవరంలో ‘బాహుబలి’ అతి భారీ యంత్రాలు
స్పీడందుకోనున్న పనులు ప్రారంభించిన చంద్రబాబు

ఏలూరు, సెప్టెంబర్ 13: పోలవరానికి ‘బాహుబలి’ వచ్చేశాడు. అంటే కంగారు పడకండి. ఆ రేంజ్‌లో పోలవరం ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్రప్రభుత్వం విదేశాల నుంచి పెద్దఎత్తున వాహనాలను, యంత్రసామాగ్రిని రప్పించింది. వీటితో దేశంలోనే ఎక్కడా సాధ్యంకాని విధంగా మట్టిపనులు, మట్టి తరలింపు నిముషాల్లో నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ యంత్ర సామాగ్రిని, వాహనాలను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రారంభించారు. ఈ యంత్రాల సామర్ధ్యాన్ని, వివరాలను బాబు విలేఖరులకు వివరించారు. ఆ విధంగా చూస్తే ఇంతకాలం పనులు ఒకమాదిరిగా జరుగగా ఇకనుంచి పరుగులు తీస్తాయనే భావించాల్సి ఉంటుంది. ఈ వాహనాలన్నింటిని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నారు. దీనిలో ప్రధానమైంది ఎక్స్‌కవేటర్. దీని ఖరీదు రూ.70కోట్లు. ఇది ఒకసారికి 36 క్యూబిక్‌మీటర్ల మట్టిని తొలగిస్తుంది. ఆ విధంగా గంట పనిచేస్తే 1500 క్యూబిక్ మీటర్ల మట్టిని, కొండలను కూడా పిండిచేసి తొలగించగలదు. ఈవాహనాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రారంభించి, కొద్దిసేపు నడిపారు. భారీ వాహనాలంటే మనకు తెల్సిన ఎత్తుకన్నా భారీగా ఉంది.
పనికూడా అలాగే చేస్తుందని చంద్రబాబు, ఇంజనీర్లు వివరించారు. ఈస్థాయిలో మట్టిని తొలగిస్తే అదే స్థాయిలో దాన్ని తరలించే సామర్ధ్యం ఉన్న టిప్పర్లను కూడా రప్పించారు. ఒక్కొక్కటి రూ.20కోట్లు విలువచేసే ఆరు టిప్పర్లను రప్పించారు. వీటికి రోజుకు 30నుంచి 40వేల క్యూబిక్‌మీటర్ల మట్టిని తరలించే సామర్ధ్యం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 639 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉందని, ఈవాహనాలతో ఈపనులన్ని యుద్దప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లేందుకు నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. లక్షల క్యూబిక్‌మీటర్ల మట్టి పనులు పూర్తిచేస్తూనే మరోవైపు కాంక్రీట్ పనులను కూడా వేగవంతం చేస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సామర్ధ్యంతో పనులు ముందుకు తీసుకువెళ్లగలిగే విదేశీ ఏజన్సీలను కూడా దీంతో సమన్వయం చేసి ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఫొటోల హడావిడి
ఇంతవరకు ఎప్పుడూ చూడని భారీ నుంచి అతిభారీ వాహనాలు ప్రాజెక్టు ప్రాంతంలోకి రావటం, పనులు చేయటం చూస్తే అందరికి విపరీతమైన ఆశ్చర్యం కలిగింది. అంతేకాకుండా ఆ వాహనాలు పనులు చేస్తుంటే ఒకరకమైన కంగారు, ఆందోళన కూడా కలిగిందనే చెప్పాలి. ఇలాంటి వాహనాలను ఎప్పుడూ చూడని రాజకీయనేతలతోపాటు మీడియా, ప్రజలు కూడా ఆ వాహనాల ముందు ఫోటోలు తీసుకునేందుకు విపరీతంగా పోటీ పడ్డారు. వారిని నిరాశపర్చకుండా ముఖ్యమంత్రి కూడా అటు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు ఇటు మీడియా, ఇంజనీర్లు, ఏజన్సీ ప్రతినిధులు, కార్మికులతో కూడా ఫోటోలు దిగారు. టైరు ముందు నుంచుంటే ఆ వాహనం ఎంత భారీగా ఉందో ఆ ఫోటో చూస్తేనే అర్ధమవుతుంది.