ఆంధ్రప్రదేశ్‌

కొన ఊపిరిలో ‘హైడల్ పవర్’ (దుర్భిక్ష ‘సాగర్’-3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: సాగర్ నీటి కష్టాలు మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాగర్ నీటిని నమ్ముకుని ఏర్పాటు చేసిన 18 హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు నేడు కొన ఊపిరితో మిగిలి ఉన్నాయి. సాగర్ నుంచి నీరు విడుదల కాక, విద్యుత్ ఉత్పత్తి కాక తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయాయి. దీనికితోడు రాష్ట్ర విభజన తరువాత ఈ మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఇరు రాష్ట్రాలూ కొనుగోలు చేయకపోవడంతో వీరి పరిస్థితి మరింత దైనీయంగా మారింది. సాగర్ టెయిల్ పాండ్ వద్ద ఉన్న ప్రధాన జల విద్యుత్ కేంద్రానికే నీరు విడుదల కావడం లేదు. దీంతో మినీ హైడల్స్‌కు కూడా నీరు అందడం లేదు. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయంలో సాగర్ కుడికాలువపై మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. వచ్చే ఒకటి నుంచి మూడు సంవత్సరాల లోపు ఈ ఒప్పందాలు పూర్తికానున్నాయి. ఒప్పందాల చివరి దశలో ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లో భయంకరమైన నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రస్తుతం బెల్లంకొండ, జూలకల్లు, అద్దంకి, గుంటూరు బ్రాంచ్ కెనాల్‌పై 18 మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి రోజుకు 50 నుంచి 53 మెగా వాట్ల విద్యుత్‌ను అంటే సుమారు కోటి రూపాయల విలువైన విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే సంవత్సరానికి సుమారు 200 కోట్ల విలువైన విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సాగర్ నుంచి సమృద్ధిగా నీరు విడుదలైతే తొమ్మి నెలలపాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. తుంగభద్ర నుంచి 100 టిఎంసిలు, మహారాష్ట్ర నుంచి 200 టిఎంసిల నీరు విడుదలయ్యేది. దీనివలన విద్యుత్ ఉత్పత్తి నిరంతరం సాగేది. గత ఏడాది మహారాష్ట్ర నుంచి నీరు విడుదల కాలేదు. తుంగభద్ర నుంచి గత ఏడాది, ఈ ఏడాది నీరు విడుదల కాకపోవడం వలన పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను యూనిట్‌ను ఆరు నుంచి ఏడు రూపాయలకు విక్రయిస్తున్నారు.
సాగర్‌కు నీరు విడుదల చేయకుండా పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీటిని తరలించడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని హైడల్ పవర్ ప్రాజెక్ట్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2002-03లో నీటి ఎద్దడి ఎదుర్కొన్నాం. మళ్లీ 2014 నుంచి ఇప్పటి వరకూ అదే ఇబ్బందులను చవిచూడాల్సి వస్తోందని వారు చెపుతున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన తరువాత ఈ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. విభజన తరువాత ఏపిలో మిగులు విద్యుత్ ఉండడంతో మన ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదు. తెలంగాణకు కూడా ఈ విద్యుత్ అవసరం లేకపోవడంతో ఎవరికి అమ్ముకోవాలో తెలియక హైడల్ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు మూసివేయలేక కాలాన్ని నెట్టుకొస్తున్నాయి. కొన్ని యూనిట్లు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు ఉద్యోగుల కోసం ప్రాజెక్ట్‌లను కొనసాగిస్తున్నాయి. ఇదిలా ఉండగా రానున్న మూడు సంవత్సరాలు కూడా ఇదే సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు చెపుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి
రోజుకు లక్ష నుంది లక్షా పదివేల యూనిట్ల కెపాసిటీ కలిగి దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ పవర్ ప్లాంట్ ఈ ఏడాది మొత్తంలో మూడు లక్షల యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే మినీ హైడల్ పవర్ ప్రాజెక్ట్‌లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.
---జి సీతారామరాజు
మేనేజర్, డిసిఎల్ మినీ హైడల్

పెద్ద సంక్షోభమే
2015-16 ఆర్థిక సంవత్సరం మినీ హైడల్ రంగానికి ఆర్థిక సంక్షోభ సంవత్సరమనే చెప్పాలి. ఇరవై సంవత్సరాల్లో తను ఇటువంటి సంక్షోభ పరిస్థితిని చూడలేదు. ఉత్పత్తి లేకపోవడంతో యంత్రాలు చెడిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం, బ్యాంకులు ఈ సంక్షోభ పరిస్థితి నుంచి గట్టెక్కించే మార్గం చూపాలి
--దేవిరెడ్డి వెంకటరెడ్డి
మేనేజర్, సాగర్ పవర్ మినీ హైడల్ ప్రాజెక్ట్