రాష్ట్రీయం

సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 14: అనూహ్యంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొందామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విశాఖలో జరుగుతున్న 3వ బ్రిక్స్ అర్బనైజేషన్ ఫోరంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్య, విజ్ఞానం, వైద్యం, ఉపాధి తదితర అంశాలతో పాటు సౌకర్యవంతమైన జీవనం అందుబాటులో ఉన్న పట్టణాలకు వలసలు ఊహించని రీతిలో కొనసాగుతున్నాయన్నారు. దీనివల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, పట్టణ ప్రజానీకానికి అవసరమైన వౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతోందన్నారు. దేశ జనాభాలో 377 మిలియన్ల (32శాతం) ప్రజానీకం పట్టణాల్లో నివసిస్తుండగా, 2050 నాటికి ఈ సంఖ్య 600 మిలియన్లు (70 శాతం) అయ్యే అవకాశం ఉందన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలైన బ్రెజిల్‌లో పట్టణ జనాభా 84 శాతం కాగా, రష్యాలో 73శాతం, దక్షిణాఫ్రికాలో 64శాతం, చైనాలో 56శాతంగా ఉందన్నారు. ఈ తరుణంలో పట్టణీకరణ సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో క్లిష్టమైన అంశాల్లో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య పరస్పర సహకారం అవసరమన్నారు. విశాఖలో జరుగుతున్న అర్బనైజేషన్ ఫోరం సవాళ్లకు మెరుగైన పరిష్కారం కనుగొనే దిశగా అర్ధవంతమైన పరిష్కారాన్ని కనుగొనాలని సూచించారు. గృహ నిర్మాణంలో చైనా సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ వారి సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమన్నారు. పురాతన పట్టణాలను పునర్నిర్మించే క్రమంలో రష్యా ఎంతో ప్రగతి సాధించిందన్నారు. వీరందరి సహకారం ఉంటే దేశంలో పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కొనడంలో భారత్ మరింత ప్రగతి సాధిస్తుందన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల విశాఖ అర్బనైజేషన్ ఫోరం సదస్సును బిల్డింగ్, రెస్పాన్సివ్, ఇన్‌క్లూసివ్ అండ్ కలెక్టివ్ సొల్యూషన్స్ (బ్రిక్స్)గా వెంకయ్య సూత్రీకరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రణాళికాయుతంగా ముందుకు సాగాలన్నారు. వేగంగా విస్తరిస్తున్న పట్టణాల్లో వౌలిక సదుపాయాల కల్పన అతిపెద్ద సవాలుగా నిలిచిందన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, కాలుష్య రహిత వాతావరణం కల్పించేందుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సదుపాయాల కల్పన మంచి ఫలితాలు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే కీలక చర్యలు తీసుకుంటున్నామని, సుస్థిర అభివృద్ధి సాధనకు 7 మిషన్‌లు, 5గ్రిడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. నిరంతరం తాగునీరు, విద్యుత్, గ్యాస్ సరఫరాకు వాటర్, విద్యుత్, గ్యాస్ గ్రిడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటులో ఎపి ముందుందన్నారు. వచ్చే రెండు నెలల్లో కేవలం రూ.149కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ అనుమతులన్నీ ఆన్‌లైన్ చేశామన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తొలగించడం ద్వారా సుస్థిరత సాధ్యమన్నారు. నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగారియా మాట్లాడుతూ పట్టణల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో పట్టణీకరణ వేగవంతం అవుతోందన్నారు. వలస వస్తున్న వారికి వౌలిక సదుపాయాల కల్పనతో పాటు పౌర రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమావేశంలో దక్షిణాఫ్రికా సహకార పాలన ఉపమంత్రి ఆండ్రూనీల్, బ్రెజిల్ ప్రతినిధి డయానా మెంటో, చైనా ప్రతినిధి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి రాజీవ్ గుబ, ఎపి మున్సిపల్ మంత్రి కె నారాయణ, విశాఖ ఎంపి కె హరిబాబు, ఎపి పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.... బ్రిక్స్ సదస్సులో ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు