రాష్ట్రీయం

నీటి పంచాయతీ నేడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20:ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల నీటి తగవు ఎట్టకేలకు కేంద్రానికి చేరింది. తెలంగాణలో నిర్మించనున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఒక రైతు రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో, ఇరు రాష్ట్రాలతో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుచేయాలని సుప్రీం ఆదేశించింది. అజెండాలో తెలంగాణ ప్రభుత్వం సూచించిన అంశాలను కూడా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రిజర్వాయర్ల వద్ద ఔట్ ఫ్లో, ఇన్‌ఫ్లోకు సంబంధించిన లెక్కలు స్పష్టంగా ఉండే విధానాన్ని అజెండాలో చేర్చారు. కేటాయించిన నీటి కంటే ఎక్కువ, తక్కువ వినియోగించుకున్నప్పుడు వాటిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశాన్ని అజెండాలో పొందుపరిచారు. ఆ మేరకు బుధవారం ఢిల్లీలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఏపి సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం చంద్రశేఖరరావుతోపాటు ఏపి మంత్రి దేవేనిని ఉమ, తెలంగాణ మంత్రి హరీష్‌రావుహాజరై, వాదనలు వినిపించనున్నారు. ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శులు, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శి, కేంద్ర జలసంఘం, కృష్ణా-గోదావరి బోర్డు సభ్య కార్యదర్శులు శ్రమశక్తి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
పాలమూరు, డిండిపైనే ఏపి గురి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ప్రాజెక్టులకు అనుమతి లేదని ఏపి వాదించనుంది. విభజన చట్టం షెడ్యూల్ 11లో పేర్కొన్న ప్రాజెక్టుల్లో ఆ మూడు ప్రాజెక్టులు లేనందున, అవి కొత్త ప్రాజెక్టులే అన్నది ఏపి వాదన. ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ ప్రభుత్వం 120 టీఎంసీల కృష్ణా జలాలను అక్రమంగా వాడుకునేందుకు ప్రణాళిక రచించిందని ఆరోపించనుంది. నిబంధనల ప్రకారం వీటికి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలని స్పష్టం చేయనుంది. అన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరనుంది. తెలంగాణలో మిగుల జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు పూర్తి కాకుండా, వరదపై ఆధారపడిన ప్రాజెక్టులపై అధ్యయనానికి నాటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి డిపిఆర్‌కు ఉత్తర్వు చేశారు. అయితే, డిపిఆర్ కోరినంతమాత్రాన సరిపోదని, దానికి పాలనాపరమైన అనుమతులు అవసరమని వాదించనుంది. ప్రాజెక్టులను కెఆర్‌ఎంబి పరిధిలోకి తీసుకోవాలని విభజన చట్టం స్పష్టం చేస్తున్నందున, దానిపై కౌన్సిల్‌లో వాదించాల్సిన అవసరం లేదన్నది ఏపి భావన. తెలంగాణ రీ డిజైన్ చేస్తున్న ప్రాణహిత, కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టులతో పాటు, వాటర్‌గ్రిడ్‌పైనా తనకున్న అనుమానాలను కౌన్సిల్ దృష్టికి తీసుకురానుంది.
ఎదురుదాడికి తెలంగాణ వ్యూహం
ఏపి వాదనను తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు భారీ కసరత్తు చేశారు. ఏపి ఫిర్యాదు చేస్తున్నట్లు తమ మూడు ప్రాజెక్టులు, రీడిజైన్ కొత్తవి కాదని, సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే వాటికి అనుమతులు ఇచ్చారని ఎదురుదాడి చేయనుంది. కృష్ణాలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేనప్పుడు ప్రాజెక్టులను బోర్డు పరిథికి తీసుకురావడం ఎందుకన్నది తెలంగాణ సర్కారు వాదన. నిర్ణీత కేటాయింపుల నుంచే తమ వాటా వాడుకుంటున్నామని, ఏపి మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తోందని వాదించనుంది. ఈ కాలువ ద్వారా సీమకు 22 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తుండగా, ఏపి మాత్రం 4500 క్యూసెక్కుల లెక్కలు మాత్రమే చూపిస్తోందన్నది తెలంగాణ వాదన. వినియోగంపై వివాదాలు పరిష్కారం కావాలంటే ఒక రాష్ట్రంలోని ప్రాజెక్టులను, మరో రాష్ట్రంలోని ఇంజనీర్లు పరిశీలించేందుకు చొరవ తీసుకోవాలని ఉమాభారతికి సూచించనుంది. బచావత్ అవార్డు ప్రకారం పోలవరం ద్వారా 45, పట్టిసీమ ద్వారా 45 టీఎంసీల నీరు దక్కాల్సినందున, వాటిని కూడా తమకు కేటాయించాలని వాదించనుంది. దీనిపై ఇప్పటికే హరీష్‌రావు లేఖ కూడా రాశారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం తమకు 45 టీఎంసీ, ఇంకా ఏదైనా ప్రాజెక్టు గోదావరి నుంచి కృష్ణాకు తరలిస్తే పై రాష్ట్రాలకూ వాటా ఉంటుంది కాబట్టి, 90 టీఎంసీల వాటా తమకు దక్కుతాయన్నది స్పష్టం చేయనుంది. సిఎం కెసిఆర్, మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటిపారుదల శాఖ అధికారులు ఎస్‌కె జోషి, విజయ్ ప్రకాశ్ మంగళవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు.
చర్చకు వచ్చే అంశాలివే!
ఢిల్లీలో బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీలో పలు అంశాలు చర్చకు రానున్నాయి. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై పరిష్కారం, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ కోసం వర్కింగ్ అరేంజ్‌మెంట్‌ను రూపొందించడం, వివిధ కాలువలు, రిజర్వాయర్ల వద్ద నీటిరాక, విడుదలను లెక్కించేందుకు పారదర్శక పద్ధతితో కూడిన యంత్రాంగాన్ని రూపొందించడం, నీటి సంవత్సరంలో నిర్దిష్టమైన ఒక కాలువ, లేదా ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకోవడం, హక్కుల ప్రకారం రావలసిన దానికంటే తక్కువ నీరు లభ్యమవుతూ ఉంటే, దానిని భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించడం, గోదావరి జలాలను కృష్ణానదిలోకి మళ్లించిన కారణంగా నీటి పంపకాల ఫార్ములాను రూపొందించడం-ఈ అంశాలపైనే అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ జరుగుతుంది.