రాష్ట్రీయం

సర్కారు ప్రతిష్ఠ రోడ్డుపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: భారీ వర్షాలతో రాజధాని రోడ్లు గుంతలమయంగా మారడం, నగరంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తుండటంతో మున్సిపల్ వ్యవహారాల మంత్రి కె తారక రామారావు అధికారులతో మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల వల్ల తక్కువ కాలంలోనే ప్రభుత్వానికి పేరొచ్చిందని, అదంతా దెబ్బతిన్న రహదారుల వల్ల మంటగలిసేలా ఉందని కెటిఆర్ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లు నాసిరకంగా ఉండి వర్షానికి కొట్టుకుపోవడానికి కాంట్రాక్టర్లే కారణమని కొందరు అధికారులు చెప్పగా, దీనిపై కెటిఆర్ తీవ్రంగా స్పందించారు. ఇందులో అధికారుల బాధ్యత కూడా ఉంది. రోడ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం లేదా? అంటూ ప్రశ్నించారు. ఇంతకాలం పని చేస్తున్నా రోడ్లపై అవగాహన లేదా? అని నిలదీశారు. ఇప్పటికే చాలాసార్లు మందలించినా పనితీరులో మార్పు రావడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తీసుకుంటానని మంత్రి హెచ్చరించారు. యుద్ధప్రాతిపదికన రోడ్లు మరమ్మతు చేయాలని జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. జిహెచ్‌ఎంసి ఇంజనీరింగ్ సిబ్బంది, హెచ్‌ఎండబ్ల్యుయస్, మెట్రో రైలు, టియస్‌ఐఐసి అధికారులతో కెటిఆర్ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రోడ్ల అంశంపై తాత్కాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక వ్యూహంతో వెళ్లాలని సూచించారు. రోడ్ల సమస్యల కోసం ప్రత్యేకంగా నిపుణుల కమిటీ వేస్తున్నట్టు చెప్పారు. కమిటీ సలహాలు, సూచనలు చేస్తుంది. అందుబాటులో ఉన్న నిపుణులతో కమిటీ వేస్తున్నట్టు కెటిఆర్ చెప్పారు. ఈ కమిటీ ప్రతి నెలా జిహెచ్‌ఎంసి అధికారులతో సమావేశమవుతుంది. ఒకటి రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. రోడ్ల పరిస్థితి మెరుగు పడేంతవరకు సాధ్యమైనంత ఎక్కువమంది ఇంజనీర్లు రోడ్ల మరమ్మతు పనులపైనే ఉండాలని కెటిఆర్ సూచించారు. ఒక్కో డివిజన్‌కు ఒక బృందం చొప్పున మొత్తం 150 బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్ల పనులను వేగవంతం చేసేందుకు ఇతర శాఖల సిబ్బంది సహకారం తీసుకోవాలని సూచించారు. టియస్‌ఐఐసి పరిధిలోని ఐటి కారిడార్‌లో రోడ్లు అన్ని సౌకర్యాలతో రిస్టోర్ చేయడంతోపాటు దీర్ఘకాలికంగా ఒక మాడల్‌గా ఉండేలా రోడ్లు తీర్చిదిద్దాలని కెటిఆర్ సూచించారు. జాతీయ రహదారుల సంస్థ, మెట్రో రైలు సంస్థలు, ఆర్ అండి బి శాఖలు సైతం తమ పరిధిలో రోడ్ల మరమ్మతు చేపట్టాలని కెటిఆర్ సూచించారు. నగరంలోని రోడ్లపై గుంతలను వారం రోజుల్లో పూడ్చుతామని ఇంజనీరింగ్ సిబ్బంది మంత్రికి తెలిపారు. సమావేశంలో కెటిఆర్‌తో పాటు మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ యంజి గోపాల్, జిహెచ్‌ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్‌తోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.