రాష్ట్రీయం

పాతభవనాల కూల్చివేత సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ముందస్తు కార్యాచరణ, శాఖల మధ్య సమన్వయలోపం కలసి వెరసి పురాతన భవనాల్లో నివసిస్తున్న వారికి శాపంగా పరిణమించింది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడ్డప్పుడు ఇళ్లు ఖాళీ చేయాలని అధికారులు హడావిడి చేయడం, తర్వాత మర్చిపోవడం తంతుగా మారింది. ఎప్పుడు కూలిపోతాయో తెలియని అత్యంత పురాతన భవనాలను ఖాళీ చేయించే అంశంలో జీహెచ్‌ఎంసీ-రెవిన్యూ శాఖల మధ్య కొనసాగుతున్న సమన్వయ లోపం సమస్యలు సృష్టిస్తోంది. పర్యవసానంగా ఆ భవంతుల్లోని కుటుంబాల్లో చావుడప్పులు మోగుతున్నాయి. 2013లో సికింద్రాబాద్‌లో అత్యంత పురాతనమైన సిటీలైట్‌హోటల్ భారీ వర్షాలకు కూలిపోగా, 13మంది మృతి చెందిన ఘటన నగరంలో ఉన్న వందలాది పాత భవనాలపై దృష్టి సారించేలా చేసింది. పాత భవనాల పరిరక్షణ, పటిష్టతకు కొత్తవిధానం ప్రవేశపెడతామన్న జీహెచ్‌ఎంసి అధికారుల ప్రకటన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
జిహెచ్‌ఎంసి అధికారులు అప్పట్లో ప్రకటించిన హైదరాబాద్‌లోని ప్రమాదకర పురాతన భవనాల జాబితాలో సిటీలైట్ హోటల్ లేదు. దీన్నిబట్టి పురాతన భవనాల గుర్తింపు పారదర్శకత ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఆ తర్వాతే హుస్సేనీఆలంలో మరో ఇల్లు కూలి భార్యాభర్తలు చనిపోయారు. సిటీలైట్ హోటల్ వంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరపాలక సంస్థ చట్టంలోని సెక్షన్ 353ని 353 (సి)గా సవరించి, ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని అప్పటి కమిషనర్ వెల్లడించారు. తర్వాత మళ్లీ షరా మామూలే. దాదాపు వందేళ్ల నాటి ఏళ్ల నాటి భవనాలు పదుల్లో, 50 ఏళ్ల నాటివి వందల్లోనూ ఉన్నాయి. గతంలో జీహెచ్‌ఎంసి పరిధిలో 1,819 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించగా, అందులో 176 భవనాలు కోర్టు కేసుల్లో ఉన్నాయి. వీటిలో 1248 భవనాలు కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించుకున్నారు. అందులో 150 భవనాల పటిష్టతపై ఇంజనీరింగ్ విభాగానికి జెహెచ్‌ఎంసి ప్రతిపాదించగా 32 భవనాలను కూల్చివేసినట్లు అధికారులు ప్రకటించారు. కృష్ణబాబు కమిషనర్‌గా ఉండగా, 30-50 ఏళ్లు దాటిన పాత భవనాలకు తప్పనిసరిగా, ప్రతి పదేళ్లకు స్ట్రక్చరల్ తనిఖీలు చేపట్టాలని తీసుకున్న నిర్ణయం అమలుచేస్తున్న దాఖలాలు లేవు.
గత నాలుగురోజుల నుంచి రాజధాని నగరంలో 23 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇది కొన్ని ప్రాంతాల్లో 16, 13 సెంటీమీటర్లుగా నమోదవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో నగరంలో వందల సంఖ్యలో ఉన్న పురాతన భవనాల కూల్చివేతను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. స్థానికంగా దశాబ్దాల నుంచి నివసిస్తోన్న వారిని ఖాళీ చేయించి, దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాళ్లకు తరలించి తాత్కాలికంగా ప్రమాదం తప్పించడమే తమ బాధ్యత అన్నట్లు జీహెచ్‌ఎంసి అధికారులు భావిస్తున్నారు. తమకు పరిసర ప్రాంతాల్లోనే ఇళ్లు కట్టించి ఇస్తే వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నామని భవనాల్లో ఉన్న ప్రజలు వాదిస్తున్నారు. ఆ బాధ్యత రెవిన్యూ వారిదే తప్ప, తమది కాదని జీహెచ్‌ఎంసి అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు లేనందున, ఈ విషయంలో తామేమీ చేయలేమని, కావాలంటే శివార్లలో వాంబే కింద నిర్మించి ఖాళీగా ఉన్న భవనాలను కేటాయిస్తామని రెవిన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే, ఎక్కడో ఇస్తే తామెందుకు వెళతామని భవనాల్లో ఉన్న వారు భీష్మిస్తున్నారు. పాత భవనాల్లో నివసిస్తున్న వారికి సమీపంలోనే పునరావాసం కల్పిస్తే తప్ప, ఈ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదు.