ఆంధ్రప్రదేశ్‌

సచివుల సత్తాకు సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ఏపి మంత్రుల సత్తాకు స్థానిక సంస్థల ఎన్నికలు సవాలుగా పరిణమించాయి. ఫలితాలపై మీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వారికి కత్తిమీద సాములా పరిణమించాయి.
ఫిబ్రవరిలో విశాఖ, గుంటూరు, శ్రీకాకుళం, కర్నూలు, కాకినాడ, ఒంగోలు, తిరుపతి కార్పొరేషన్లు, రాజంపేట, రాజాం, కందుకూరు, నెల్లిమర్ల మునిసిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ మేరకు పార్టీ అధినేత బాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. చిన్నపాటి ఎన్నికలయినా సీరియస్‌గా తీసుకునే బాబు 7 కార్పొరేషన్, 4 మునిసిపాలిటీ ఎన్నికలపై ఇప్పటినుంచే సమీక్షలు మొదలుపెట్టడం బట్టి పార్టీ ఈ స్థానిక ఎన్నికలపై ఏ స్థాయిలో దృష్టి సారిస్తుందో స్పష్టమవుతోంది. తాజాగా పార్టీకి చేదు ఫలితం మిగిల్చిన పెడన మునిసిపల్ చైర్మన్ ఎన్నికతో నాయకత్వం ఇంకా అప్రమత్తమయింది.
కాగా, ఈ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాకపోతే కొందరు మంత్రుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో వైఎస్ అమలుచేసిన ఫార్ములానే బాబు కొనసాగించనున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు రాబట్టడంలో విఫలమైన మంత్రులు మాగంటి బాబు, మారెప్పను తొలగించారు. ఇప్పుడు బాబు కూడా అదే ఫార్ములాను పాటించడం ద్వారా మంత్రులకు పరీక్ష పెట్టనున్నారు.
పనిచేయని మంత్రులను నేరుగా తొలగించకుండా, ఫలితాల సాకుతో తొలగించడం ద్వారా అసంతృప్తి తలెత్తకుండా చూసే వ్యూహం కూడా ఉందంటున్నారు.
అయితే, రాజధాని గుంటూరు జిల్లా కేంద్రమైన గుంటూరు కార్పొరేషన్ తెదేపాకు తలనొప్పిగా పరిణమించింది. ఇద్దరు మంత్రులున్నా ఇక్కడ పార్టీపై సొంత శ్రేణుల్లోనే అసంతృప్తి కనిపిస్తోంది. కేవలం ఒక సామాజికవర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీకి ఆది నుంచి కష్టించి పనిచేసిన వారికి మొండిచేయి చూపిస్తున్నారన్న విమర్శ బహిరంగంగానే వినిపిస్తోంది. తాజాగా కార్పొరేషన్ చైర్మన్లు దక్కించుకున్న డొక్కా మాణిక్యవరప్రసాద్, హిదాయత్‌ల వ్యవహారం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. పార్టీకి పనిచేసిన వారిని కాదని ఎన్నికల ముందు పార్టీలో చేరిన ఎంపి రాయపాటి అనుచరులకు పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వాళ్లనే గెలిపించమనండని పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి కూడా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏపిలో అతిపెద్ద గుంటూరు యార్డుకు తాను సూచించిన నేతకు కాకుండా, కమ్మ వర్గానికి చెందిన నేతకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికల్లో తాను సూచించిన వారికి టికెట్లు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. కార్పొరేషన్‌లో కొన్ని డివిజన్లు మంత్రి రావెల కిశోర్‌బాబు నియోజకవర్గానికి వస్తాయి. అక్కడ బలంగా ఉన్న కాపు వర్గం మంత్రిపై కారాలు మిరియాలు నూరుతోంది. ఆయనకు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి నిరాహారదీక్ష కూడా చేశారు. అటు మిత్రపక్షమైన బిజెపి కూడా తెదేపాతో దూరంగా ఉంటోంది. గుంటూరులో పట్టు ఉన్న కన్నాలక్ష్మీనారాయణ ఇప్పటికే డివిజన్లలో పర్యటిస్తున్నారు. బిజెపిలోని ఒక వర్గానికి చెందిన నేతలు మినహా మిగిలిన వారంతా తెదేపాకు వ్యతిరేకంగానే ఉన్నారు. యార్డులో ఇద్దరికి డైరక్టర్లు ఇవ్వాలని కోరినా తెదేపా పట్టించుకోని వైనమే దానికి కారణం. ఈ జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న పుల్లారావు, రావెలకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి.
ఇక పెద్ద కార్పొరేషన్ అయిన విశాఖలో పార్టీని గెలిపించే బాధ్యత మంత్రి గంటా శ్రీనివాస్‌దే. మరో మంత్రి అయ్యన్నపాత్రుడు జిల్లానుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆయన రూరల్ బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇటీవలి కాలంలో వైసీపీ బలపడుతోంది. హోదా ప్రభావం బాగా ఉంది. దానికితోడు తెదేపాలో అంతర్గత కలహాలు ఆందోళనగా పరిణమించాయి. గంటాపైన అసంతృప్తి కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ బిజెపికి ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నందున ఆ పార్టీ కూడా ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తున్నందున సీట్ల పంపకం కూడా సమస్యగా మారింది.
ఇక ఒంగోలు, కందుకూరు ఎన్నికల ఫలితాలు ప్రకాశం జిల్లా మంత్రి శిద్దా రాఘవరావుకు అగ్నిపరీక్షగా మారింది. ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో రెడ్లు, బిసి ప్రభావంతోపాటు వైసీపీ పట్టు కూడా బలంగా ఉంది. ఈ రెండు స్థానాలు గెలిస్తేనే శిద్దాకు భవితవ్యం ఉంటుంది. మంత్రి కెఇకి కర్నూలు ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఇక్కడ వైసీపీ, సీపీఎం బలంగా ఉన్నాయి. ఎంపి రేణుక వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలుపై దృష్టి సారించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యక్రమాలకు స్పందన వస్తున్న జిల్లా కర్నూలు ఒక్కటే కావడం గమనార్హం. కాకినాడ గెలుపు బాధ్యత మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప మీద ఆధారపడి ఉంది. ఇక్కడ కూడా వైసీపీ బలంగానే ఉంది. సహజంగా మొదటి నుంచి కాకినాడ వ్యవహారాలు యనమల చూస్తున్నారు. ఇప్పుడు రాజప్ప కూడా ఉన్నందున ఇక్కడ ఫలితాల అనంతర పరిస్థితి ఆసక్తికరంగా మారింది.
బాబు సొంత జిల్లాలోని తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు బొజ్జలకు సవాలుగా మారాయి. ఇక్కడ కుల సమీకరణలపైనే గెలుపు ఆధారపడి ఉంది. శ్రీకాకుళం ఎన్నికల ఫలితాలు మంత్రి అచ్చెన్నాయుడు సత్తాకు పరీక్ష పెట్టనున్నాయి. ఇక్కడ కూడా వైసీపీ బలంగా ఉంది. మంత్రి మృణాళిని కూడా మునిసిపాలిటీని గెలిపించుకోవడం తప్పనిసరయింది. విస్తరణలో మృణాళిని, శిద్దా రాఘవరావు, రావెలను తొలగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు వారి సత్తాకు సవాలుగా మారాయి.