ఆంధ్రప్రదేశ్‌

సీమపై బాబు నజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: రాజకీయ, సామాజిక కోణంలో ఇప్పటివరకూ తెదేపాను ఆదరించని రాయలసీమపై పట్టు సాధించే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికి రాజకీయంగా వైసీపీని దెబ్బకొట్టిన బాబు, ఇక అభివృద్ధి కోణంలో సీమ ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలకు పదునుపెడుతున్నారు. సొంత ప్రాంతానికి ఏమీ చేయడం లేదని, సీమపై పక్షపాతం చూపిస్తున్నారంటూ, మరో ఉద్యమానికి జనాలను సిద్ధం చేస్తున్న విపక్షాలను దెబ్బతీసేందుకు బాబు అడుగులు వేస్తున్నట్లు ఆయన కార్యాచరణ స్పష్టం చేస్తోంది. బాబు సీమవాసి అయినప్పటికీ కోస్తానాయకుడిగా పనిచేస్తున్నారన్న విమర్శలు గత ఏడాదిన్నర నుంచి ఉధృతంగా వినిపిస్తున్నాయి. పోతిరెడ్డిపాడును ఎండబెడుతున్నారని, సీమలో ప్రాజెక్టులు రాకుండా కోస్తా, విశాఖకు తరలించుకుపోతున్నారంటూ సీమ నేతలు, మేధావులు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా కడపలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం ఇటీవల కడప జిల్లాలో జరిగిన భారీ ర్యాలీకి ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అనంతపురంలో జరిగిన జగన్ దీక్షకు సైతం ప్రజల నుంచి మంచి స్పందనే లభించింది.
గత ఎన్నికల ముందు నుంచీ సీమలో రాజకీయ పరిస్థితి వైసీపీకి అనుకూలంగానే ఉంది. దీనితో బలంగా ఉన్న వైసీపీని దెబ్బతీసేందుకు బాబు రాజకీయ వ్యూహానికి తెరలేపారు. అందులో భాగంగా అంగ, అర్ధబలం ఉన్న ఆదినారాయణరెడ్డి, భూమానాగిరెడ్డి, అమర్‌నాధ్‌రెడ్డి వంటి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వైసీపీని రాజకీయంగా దెబ్బకొట్టిన బాబు, ఇప్పుడు అభివృద్ధి ద్వారా సీమ ప్రజలకు చేరువయ్యే లక్ష్యంతో వెళుతున్నారు.
అందులో భాగంగా మెగా రోడ్డు ప్రాజెక్టులపై సీరియస్‌గా దృష్టి సారిస్తున్నారు. అమరావతి నుంచి సీమ జిల్లాలకు ఎలాంటి మలుపులు లేకుండా నేరుగా వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాల ద్వారా రోడ్డు కనెక్టివిటీతో సీమ రూపురేఖలు మార్చాలని సంకల్పించారు. అయితే ఈ నిర్మాణాలన్నీ కేంద్ర అనుమతులపై ఆధారపడి ఉన్నాయి.
మొత్తం 27,635,60 కోట్లతో 598.78 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని బాబు ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీకి నివేదిక పంపించారు. గడ్కరీ ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు, బాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు దీనిపై ప్రత్యేకంగా చర్చలు జరపడం బట్టి సీమపై బాబు ఏ స్థాయిలో దృష్టి సారించారో స్పష్టమవుతోంది. అటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా గడ్కరీపై ఒత్తిడి చేస్తున్నారు. అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు నాలుగు, ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణాలకు సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ లేన్లు రూపొందించారు. ఇందులో 28కిలోమీటర్ల అండర్‌బ్రిడ్జితోపాటు 43 ఆర్‌ఓబిలు పొందుపరిచారు. దీనివల్ల విజయవాడకు కడప నుంచి 73 కిలోమీటర్లు, కర్నూలు నుంచి 28 కిలోమీటర్లు, అనంతపురం నుంచి 101 కిలోమీటర్ల దూరం తగ్గి, కొన్ని గంటల్లోనే సీమ నుంచి విజయవాడకు రావచ్చు.
దీని ద్వారా రోడ్డు కనెక్టివిటీ పెరిగి అది ప్రత్యక్షంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమివ్వడంతోపాటు, పరిశ్రమలు వచ్చేందుకు దోహదపడుతుందని బాబు అంచనా వేస్తున్నారు. దానివల్ల సీమ ప్రజల ఆర్థిక స్థితిగతులు మారిపోయి, స్థానికంగా చిన్న చిన్న పరిశ్రమలు వచ్చి ఉపాథి అవకాశాలు పెరుగుతాయన్నది ప్రభుత్వ అసలు లక్ష్యమని చెబుతున్నారు. ప్రస్తుతం సీమకు చెందిన వివిధ వర్గాల వారు విజయవాడ కంటే హైదరాబాద్‌కు వచ్చేందుకే ఇష్టపడుతున్నారు. దానికి కారణం ప్రయాణ దూరం. దీన్ని దృష్టిలో ఉంచుకునే బాబు సీమ వర్గాలను సొంత రాజధానికి తీసుకువచ్చేందుకు ఎక్స్‌ప్రెస్ వేను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.