ఆంధ్రప్రదేశ్‌

రష్యాతో చెలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలో నౌకా నిర్మాణం, రేవులు, తయారీ రంగం, వౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అణు విద్యుత్, రక్షణావసరాలు, తదితర ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వామి కావడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రష్యాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం నాడిక్కడ ఓ ప్రైవేట్ స్టార్ హోటల్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ముఖ్యంగా అంతర్గత జలరవాణా, సముద్రతీర ప్రాంత ఆధారిత అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం రష్యాతో చెలిమిని కోరుతోంది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ - రష్యా మధ్య సరికొత్త వాణిజ్య, పారిశ్రామిక, ఆర్థిక బంధాలకు ఈ సమావేశం వేదికగా నిలిచింది. రష్యా మంత్రి డెనిస్ మాంతురోవ్ నేతృత్వంలోని బృందం విజయవాడలో రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చలు జరిపింది. రెండు ప్రాంతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు వ్యాపార అవకాశాలపై కూలంకషంగా చర్చించారు. ఈసందర్భంగా రష్యన్ ఫెడరేషన్ మంత్రి గౌరవార్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విందు ఇచ్చారు. ఈ సమ్మేళనం సందర్భంగానే చంద్రబాబు, మాంతురోవ్ విడిగా భేటీ అయ్యారు. ఆ తరువాత రెండు అంశాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఏపి ఇడిబి, జెఎస్‌బి, జెఎస్‌సి యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. రష్యాకు చెందిన జెఎస్‌సి యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ తూర్పు యూరప్‌లో అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థగా పేరొందింది. ఈ సంస్థ సబ్ మెరైన్లు, ఉపరితల నౌకలు, సైనిక అవసరాల కోసం ప్రత్యేక జల వాహనాలు, సముద్రగర్భంలో మంచుగడ్డలు కరిగించే యంత్రాలు, ఆఫ్‌షోర్ సొల్యూషన్స్, ట్రాన్స్‌పోర్టు వెస్సల్స్, స్పెషలైజ్డ్ వెస్సల్స్, జాలర్లకు ఉపయోగపడే వేటపడవలను తయారుచేస్తుంది. జెఎస్‌సి యునైటెడ్ షిప్పింగ్ సంస్థ ఏపి ప్రభుత్వంతో కలిసి సరుకు రవాణా, ప్రయాణికుల రవాణాకు వీలయ్యే నౌకలను రూపొందిస్తుంది. నిర్వహణ పనులు కూడా చేపడుతుంది. జలశుద్ధి రంగంలో కూడా ఈ సంస్థ ఏపి ప్రభుత్వం కోసం పనిచేస్తుంది. లీటర్ రూ.20లుగా వున్న నీటి ధరను సామాన్యులకు అందుబాటులో లీటర్ రూపాయికి అందించే సాంకేతికతను ఈ సంస్థ పుణికిపుచ్చుకుని ఏపికి అందించాలని ముఖ్యమంత్రి ఈసందర్భంలో సూచించారు. విశాఖలో వరల్డ్ క్లాస్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్‌ను నెలకొల్పేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రష్యాకు చెందిన టెక్నో నికోల్, ఇండియాకు చెందిన సన్ గ్రూప్ ప్రతినిధులు రెండో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో 62 మిలియన్ యుఎస్ డాలర్ల ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. వాటర్ ప్రూఫింగ్, రూఫింగ్, ఇన్సులేషన్‌కు ఉపయోగపడే మెటీరియల్ తయారీలో టెక్నో నికోల్ సంస్థ వరల్డ్ లీడర్‌గా ఉంది. రాష్ట్రంలో పోలీ ప్రొపైలిన్, ఎస్‌బిస్ మెంబ్రేన్స్, పోలివినైల్ క్లోరైడ్ మెంబ్రేన్స్, షింగిల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఈ ఒప్పందం చేసుకున్నారు.
సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలైలో ఇన్నోప్రోమ్ కోసం రష్యా పర్యటించినప్పుడు డెనిస్ మాంతురోవ్‌ను కలిశానని గుర్తుచేసుకుంటూ, ఆ సందర్భంలో ఆయన్ని రాష్ట్రానికి రమ్మని ఆహ్వానిస్తే ఒక్కరే రాకుండా ఒప్పందాలతో వచ్చారని చమత్కరించారు. రాయలసీమలో స్టీల్ ప్లాంటు ఏర్పాటుకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చనని ఆయన రష్యన్ పారిశ్రామికవేత్తలకు సూచించారు. పరిశ్రమలు స్థాపించేవారికి రాబోయే 40ఏళ్లపాటు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవన్నారు. సమావేశానికి ముందు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకున్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం... సిఎం చంద్రబాబు, రష్యా మంత్రి మాంతురోవ్ సమక్షంలో
అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు