రాష్ట్రీయం

పోస్టర్ల వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 3: అనుకున్నట్లుగానే మావోయిస్టుల బంద్ ఉద్రిక్తతలు రేపింది. ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ మావోలు, పోలీసులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. ఆంధ్రా, ఒడిశా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర బంద్‌కు మావోలు పిలుపునివ్వడంతో గురువారం సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఉనికి కోసం ఇరువర్గాలు సై అంటే సై అన్నాయి. మావోలు ఏఓబిలో బ్యానర్లు, వాల్‌పోస్టర్లు అంటిస్తే అందుకు దీటుగా వారికి వ్యతిరేకంగా కొన్ని పోస్టర్లు వెలియటంతో బంద్‌కాస్తా వేడెక్కింది. ఏఓబి ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ ప్రజలు బంద్ పాటించాలని మావోలు డిమాండ్ చేశారు. మావోల చేతిలో గిరిజనులు బలి అవుతున్నారంటూ వెలిసిన వాల్‌పోస్టర్లు చూపరులను ఆలోచింపజేశాయి. ‘ఓ అన్నా.. మా కుటుంబాన్ని కూల్చివేయకు. మా గూడును చెదరనివ్వకు. నాన్న, అన్నలను మానుంచి దూరం చేయకు. మా రెక్కలు విరిచేయకు. బంద్‌లని మమ్మల్ని బాధించకు. వారోత్సవాలని మమ్మల్ని వేధించకు. స్థూపాలు కట్టాలని మమ్మల్ని బెదిరించకు. మా గిరిజనుల సహనాన్ని పరీక్షించకు.. ఓ అన్నా!’ అంటూ గిరిజన మహిళల చిత్రాలతో కూడిన పోస్టర్లు విడుదల చేశారు. మరో పోస్టర్‌లో ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు. ఆర్కే భార్య శిరీష తన కుమారుడు మున్నా మృతదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఫొటోను ముద్రించి ఇలా రాశారు. ‘మీబిడ్డ మున్నా ప్రాణాలుపోతే మీ కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయా..? గిరి తల్లుల కన్నీళ్లకు సమాధానం ఏంటి?. ఎందరో గిరి మహిళల పసుపు, కుంకుమలు చెరిపేశారు. మీ మున్నా వయస్సు ఉన్న ఎందరినో పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే నెపంతో కిరాతకంగా చంపారు’.. అంటూ అందులో రాశారు. పోలీసు వర్గాలే వీటిని ముద్రించాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఈ పోస్టర్లు పలువురిని ఆలోచింపజేశాయి. కాగా బంద్ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. మారుమూల ప్రాంతాలకు బస్సులు నడపలేదు. రాజమండ్రి, తాడేపల్లిగూడెం, నరసాపురం వంటి ప్రాంతాల నుంచి భద్రాచలానికి బస్సులు నడపలేదు. భద్రాచలం - విశాఖ, సీలేరు, మోతుగూడెం, కుంట సర్వీసులు రద్దు చేశారు. భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే సర్వీసులను ఉదయం నడపలేదు. సరిహద్దుల్లోని ఒడిశా, చత్తీస్‌గడ్ ప్రాంతాల్లో మావోలు చెట్లు నరికి రోడ్డుకు అడ్డంగా వేశారు. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు వదిలి వాటి కింద మందుపాతరలు పెట్టారు. తొలగించడానికి వచ్చే భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మందుపాతరలు పేల్చాలనే మావోల వ్యూహాన్ని పోలీసులు కనిపెట్టారు. దీంతో ప్రమాదం తప్పింది. ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లోని విశాఖ - కిరండోల్ రైలును చత్తీస్‌గఢ్‌లో నిలిపివేశారు. ఒడిశాలో మాజీ సర్పంచ్‌ను మావోలు హత్య చేశారు. కాగా, చత్తీస్‌గఢ్‌లో మిషన్-2016 పేరిట మారణహోమం సృష్టిస్తున్నారని, ఇప్పటివరకు 110 మంది అమాయకులను హత్య చేశారని చత్తీస్‌గఢ్‌లోని దక్షిణ బస్తర్ కార్యదర్శి వికాస్ ధ్వజమెత్తారు. రంపచోడవరం మన్యంలో బస్సులను బంద్ వల్ల నిలిపివేయడంతో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారంటూ చింతూరు, డొంకరాయి, మోతుగూడెంలకు పోలీసులు ఉచితంగా ఆటోలు తిప్పారు.