రాష్ట్రీయం

ఉద్యమ నేతలా? పరిపాలనాదక్షులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 1: తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల ఎంపిక కసరత్తు తుది అంకానికి చేరింది. ఆసక్తివున్న విద్యావేత్తలు తమ దరఖాస్తులు పంపించేందుకు 8వ తేదీ ఆఖరు కాగా, మరోపక్క ఇంతవరకూ వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొంతమందిని ఎంపిక చేసేందుకు సెర్చి కమిటీలను సైతం ప్రభుత్వం నియమించింది. ఇంతవరకూ వివిధ చోట్లకు చేరిన దరఖాస్తులు అన్నింటినీ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సెర్చి కమిటీలకు అందించనున్నారు. అయితే ఇప్పటికే 9 వర్శిటీలకు సంబంధించి విసిల జాబితాను సిఎం ఖరారు చేసి తన వద్ద ఉంచుకున్నారనే ఊహాగానాల నేపథ్యంలో రానున్న రోజుల్లో వర్శిటీలను పాలించేది ఉద్యమ నేతలా? ఐఏఎస్ అధికారులా? లేకా విద్యావేత్తలా? అనే సంశయం అందరిలో మెలుగుతోంది. కొంతమంది ఉన్నత విద్యామండలికి, మరికొంత మంది డిప్యూటీ సిఎం, విద్యాశాఖలను చూస్తున్న కడియం శ్రీహరి పేషీకి, మరికొంత మంది సిఎం ఆఫీసుకు నేరుగా దరఖాస్తులు పంపించగా, ఇంకొంతమంది పద్ధతి ప్రకారం ముఖ్యకార్యదర్శి కార్యాలయానికి, ఈ-మెయిల్‌కు దరఖాస్తులు పంపించారు. ఇదంతా లెక్క ప్రకారం జరుగుతున్నా అసలు నియామకాలు దగ్గరకు వచ్చేసరికి ఏం జరగనుందో అనే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. దీనికి కారణం గత పాతికేళ్లలో యూనివర్శిటీల బాధ్యులుగా వచ్చిన విసిల తీరు, పద్ధతి, విధానాలు చూడటమేనని చెబుతున్నారు. కాకతీయ వర్శిటీలో పాఠాలు చెప్పిన సీనియర్లు ఎంతోమంది ఉన్నా వారిని కాదని వారి దగ్గరే చదువుకున్న జూనియర్ ప్రొఫెసర్‌ను విసిగా నియమించడంతో వర్శిటీల్లో చెలరేగిన ఉద్యమాలు, వివాదాలు అన్నీ ఇన్నీ కావు. మహాత్మాగాంధీ యూనివర్శిటీలోనూ, కాకతీయలోనూ నియామకాల విషయంలో జరిగిన గొడవలు ఇంకా చల్లారనే లేదు. నియామకాల్లో జరిగిన అక్రమాలపై కేసులు నడుస్తూనే ఉన్నాయి. సెర్చికమిటీలు ఏదో పేరుకు మాత్రమేగాక, అభ్యర్ధుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేయాలని సీనియర్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకు అవసరమైన స్వేచ్ఛను సెర్చి కమిటీలకు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రతిభావంతులు, సమర్ధులైన అభ్యర్ధులను ఎంపిక చేయాల్సిన బాధ్యత సెర్చి కమిటీలపైనే ఉంటుందని అన్నారు. రాజకీయ ప్రమేయంతో గత 20 ఏళ్లుగా వర్శిటీలు పతనావస్థకు చేరుకున్నాయని, చాలా సందర్భాల్లో జూనియర్లను ప్రతిభ లేనివారిని విసిలుగా ఎంపిక చేయడం వల్ల వర్శిటీల్లో క్రమశిక్షణ దెబ్బతిని విద్యాపరిశోధనా ప్రమాణాలు పడిపోవడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఎంతోకాలంగా క్రమశిక్షణతో పనిచేస్తున్న సీనియర్ ఆచార్యులను కాదని జూనియర్‌లను విసిలుగా ఎంపిక చేయడంతో వారిలో నిర్లిప్తత , నిరాసక్తత ఆవరించి వర్శిటీల్లో విద్యాత్మక అంశాలను గాలికి వదిలేశారని చెబుతున్నారు. గతంలో జరిగిన నియామకాలు దృష్టిలో ఉంచుకుని అలాంటి పొరపాటు జరగకుండా ప్రభుత్వం, సెర్చికమిటీలు తగిన జాగ్రత్తలు తీసుకుని సరైన ఆచార్యులనే ఎంపిక చేయాల్సి ఉందని, అపుడే విశ్వవిద్యాలయాలను పునరుద్ధరించే అవకాశం కలుగుతుందని చెబుతున్నారు.
ప్రభుత్వం గతంలో ఉన్న విసి నియామక మార్గదర్శక సూత్రాలను మార్చడంతోనే పెద్ద దుమారమే చెలరేగింది. గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రి నేరుగా నియమించే అధికారాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారనే భావన వ్యక్తమైంది. వాస్తవానికి ముఖ్యమంత్రి మనసులో అలాంటి భావన లేకున్నా మిగిలిన వారిలో సిఎం తన అనుయాయులనే విసిలుగా నియమించనున్నారని ప్రచారం జరిగింది. సెర్చి కమిటీలు కూడా వేసేది లేదని ఒకదశలో అనుకున్నా, యుజిసి నియామకాల ప్రకారం విసిలు నిర్బంధంగా సెర్చికమిటీల ద్వారానే నియమితులు కావల్సి ఉందని తెలియడంతో ప్రభుత్వం సెర్చి కమిటీలపై దృష్టి పెట్టింది. సెర్చి కమిటీల్లో ఉన్న వారు సైతం విసిలు కావాలనే ఆలోచనలో ఉన్నా వారి ఆశలు అడియాశలయ్యాయి.
తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రొఫెసర్ల సీనియారిటీని 10 నుండి ఐదేళ్లకు తగ్గించడం, పరిపాలనా అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే అవకాశం అనే నెపంతో ఐఏఎస్/ ఐపీఎస్‌లను వర్శిటీలకు విసిలుగా నియమించే యోచనలో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అదే జరిగితే గత ఐదేళ్లలో యూనివర్శిటీలో అచేతన స్థితికి ఎలా వెళ్లాయో అదే కొనసాగే ప్రమాదం ఉందని ఆచార్యులు అభిప్రాయపడుతున్నారు. విద్యాత్మక పాలన, అంశాలపై అవగాహన పట్టున్న వారు మాత్రమే విసిలుగా నియమితులైతే ఔచిత్యం ఉంటుందని విద్యార్ధి సంఘాల నాయకులు సైతం అభిప్రాయపడుతున్నారు. దాదాపు గత ఐదేళ్లుగా యూనివర్శిటీలు అన్నీ ఐఏఎస్‌ల పాలనలోకి వెళ్లి చివరికి పిహెచ్‌డి అడ్మిషన్లు సైతం న్యాయస్థానాలకు చేరాయి. కాకతీయ యూనివర్శిటీలో జాబితాలో చివర ఉన్న ఒక మహిళకు సీటు ఇవ్వమని నిబంధనలను తోసిరాజని విసి ఇన్‌చార్జిగా ఉన్న ఐఏఎస్ అధికారి సిఫార్సు చేయడం వివాదాస్పదమైంది. అర్హతలు లేని విద్యార్థికి సీటు ఇస్తే మిగిలిన విద్యార్థుల భవితవ్యం ఏమిటని వర్శిటీ పాలకులు ప్రశ్నిస్తున్నారు. విద్యాత్మక అంశాలపై అనుభవం లేకపోవడం వల్లనే ఐఏఎస్‌లతో కాకతీయ యూనివర్శిటీ చిక్కుల్లో పడింది. గతంలో జగన్మోహన్‌రెడ్డి, డిఎస్‌రెడ్డి, ప్రొఫెసర్ వెంకటరామయ్య, ప్రొఫెసర్ పల్లె రామారావు వంటి వారు విసిలుగా సత్తా చూపడానికి కారణం స్వతహాగా వారు విద్యావేత్తలు, శాస్తవ్రేత్తలు కావడమే.