రాష్ట్రీయం

ఉన్నంతలో చేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: పెద్ద నోట్ల రద్దు తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేయడంతో ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిపోనున్నాయి. నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి గాడిలో పడే వరకూ ‘బంగారు తెలంగాణ’ విజన్‌ను పక్కన పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇకనుంచి ఏవిధమైన కార్యాచరణతో ముందుకు సాగాలన్న దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది ప్రజానీకం బడుగు, బలహీన వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఈ కోణంలో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ రంగానికి దాదాపు రూ.29 వేల కోట్లు ఖర్చు పెడుతూ వచ్చింది. మెజారిటీ ప్రజల జీవన స్థితిగతులకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను మునుపటి మాదిరిగానే కొనసాగిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలపై కోత పెట్టేలా ప్రభుత్వం తన ప్రాధాన్యతలను మార్చుకుంటోంది. ఇకనుంచి ఏ విజన్‌తో ముందుకుసాగాలన్న దానిపై ఆర్థికశాఖ అధికారులు, నిపుణలు, ఆర్థిక సలహాదారులు కసరత్తు చేస్తున్నారు. మారనున్న ప్రభుత్వ ప్రాధాన్యతలు వచ్చే బడ్జెట్‌లో ప్రతిబింబించనున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టనున్న బడ్జెట్‌కు మరో మూడు నెలల గడువు ఉంది. ఆ లోగా ప్రభుత్వ పాలన ఏవిధంగా కొనసాగించాలి, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటి? అన్న అంశాలపై కలెక్టర్లకు సిఎం కె చంద్రశేఖర్‌రావు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈనెల 24న సిఎం కొత్త క్యాంపు కార్యాలయం ప్రారంభం కానుంది. క్యాంపు కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా నిర్మించిన సమావేశ మందిరంలో నెలాఖరున కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు సమాచారం. ఈ కీలక సమావేశంలోనే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను సిఎం వెల్లడిస్తారన్నది అధికార వర్గాల సమాచారం. ‘ఆసరా’ పెన్షన్ల పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ప్రణాళికలో హామీఇచ్చిన మేరకు ప్రతి రైతు కుటుంబానికి లక్ష చొప్పున పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల చొప్పున మూడు వాయిదాల్లో రూ.11,500 కోట్లను ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే బడ్జెట్‌లో మరో నాలుగు వేల కోట్లు కేటాయిస్తే పంట రుణ మాఫీ పథకం ముగిసిపోతుంది. మూడు విడతలు చెల్లించిన పంట రుణ మాఫీ వాయిదాను నాల్గవ విడత కూడా చెల్లించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి పథకాన్ని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను యథాతథంగా కొనసాగించనున్నట్టు సమాచారం. బడ్జెట్‌లో నీటిపారుదల ప్రాజెక్టుల కోసం కేటాయిస్తున్న రూ.25 వేల కోట్లలో సగానికి సగం కోత పెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇంటింటికి మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకానికి దాదాపు 80శాతం ఆర్థిక సంస్థల రుణంతోనే కొనసాగిస్తుండటంతో, ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల్లో దీన్ని కూడా కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. డబుల్ బెడ్‌రూమ్ పథకం కింద జిహెచ్‌ఎంసి పరిధిలో లక్ష, జిల్లాల్లో మరో లక్ష ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించడంతో, ఈ పథకం కింద ఇక కొత్త ఇళ్లను ప్రకటించకుండా పాత వాటిని పూర్తి చేయడానికే పరిమితం కావాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. కొత్త సచివాలయం, జిల్లాల్లో సమీకృత కార్యాలయాల సముదాయం, హైదరాబాద్ నగరంలో స్కై టవర్లు, కళాభారతి, కుల సంఘాలకు ప్రకటించిన భవనాలు తదితర వాటిని పక్కన పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.