రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో ఎపి ఎంసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, డిసెంబరు 1: ఎపి ఎంసెట్-2017ను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇందుకు సంబంధించిన ఏజన్సీ ఎంపికకు కసరత్తు ప్రారంభమయ్యింది. 2017 ఏప్రిల్‌లో ఎపి ఎంసెట్‌ను నిర్వహించడానికి కాకినాడ జెఎన్‌టియు ఏర్పాట్లు చేస్తోంది. గత మూడేళ్లుగా ఎంసెట్‌ను కాకినాడ జెఎన్‌టియు నిర్వహిస్తోంది. 2015, 2016 ఎంసెట్‌లను ఈ విశ్వవిద్యాలయం సమర్థంగా నిర్వహించడంతో ఎంసెట్-2017 బాధ్యతలను కూడా జెఎన్‌టియుకెకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. 2017 ఏప్రిల్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎంసెట్‌ను ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించనున్నారు. పేపర్ లెస్ విధానంలో జరిగే ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపడుతున్నారు. గతంలో నిర్వహించిన ఎంసెట్‌లకు స్థానికేతర ప్రాంతాల్లో (రహస్య ప్రాంతాల్లో) గోప్యంగా ప్రశ్నాపత్రాలను ముద్రించేవారు. ఇకపై ఎంసెట్‌కు ఆ అవసరం లేదు. ఆన్‌లైన్ విధానంలో ప్రవేశ పరీక్ష జరుగుతుండటంతో ప్రశ్నాపత్రాలు బయటకు కనిపించవు. కంప్యూటర్‌లోనే ప్రశ్నాపత్రాలను రూపొందించి సీక్రెట్ కోడ్స్ సహాయంతో వాటిని భద్రపరుస్తారు. పరీక్షకు కేవలం గంట ముందు మాత్రమే సదరు ప్రశ్నాపత్రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఈ ప్రశ్నాపత్రాలు తగిన పాస్‌వర్డ్స్‌ను వినియోగిస్తేనే ఓపెన్ అవుతాయి. గతంలో ఈ ప్రశ్నాపత్రాల వ్యవహారం ఎంసెట్ అధికారులు-ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుల మధ్యే నడిచేది. ఇక నుండి ఎంసెట్ అధికారులు-ఏజన్సీలకు మాత్రమే ప్రశ్నాపత్రాల వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇంత కీలకమైన పాత్ర పోషించే ఏజన్సీ ఎంపిక కోసం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో కాకినాడ జెఎన్‌టియుకు చెందిన ఎంసెట్ నిర్వాహకులు కసరత్తు చేస్తున్నారు. పూర్తి ఆన్‌లైన్‌లో, అత్యంత అప్రమత్తతతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరీక్షలు నిర్వహించగలిగిన సమర్ధత కలిగిన ఏజన్సీని ఎంపిక చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు ఐదు ఏజన్సీలు ఇప్పటికే అధికారిక వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం! ఎంసెట్-2017 పరీక్షల నిర్వహణపై విజయవాడలో ఉన్నత విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ వారంలో ఓ సమావేశం కూడా నిర్వహించనున్నారు.
ఎంసెట్‌కు హాజరయ్యే ప్రతీ విద్యార్థికి ఓ కంప్యూటర్‌ను కేటాయించాల్సి ఉంటుంది. అందుకే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలను పరీక్షా కేంద్రాలుగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ కళాశాలల్లోని ఒక్కో విభాగంలో 40నుండి 50వరకు కంప్యూటర్లుంటాయి. వాటిని పరీక్ష నిమిత్తం వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు జెఎన్‌టియుకె రిజిస్ట్రార్, ఎంసెట్-2016 కన్వీనర్ ఆచార్య సిహెచ్ సాయిబాబు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి చెప్పారు. అలాగే ఈ సంవత్సరం నుండి ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో ప్రవేశాన్ని ఆశించే విద్యార్థులు నీట్‌కు హాజరుకావల్సి ఉంది. దీంతో ఎంసెట్-2017లో మెడిసిన్ విభాగానికి సంబంధించి అభ్యర్ధుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అంటే హోమియో, ఆయుర్వేదం, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ బిఎస్‌సి వంటి కోర్సులకు సంబంధించి ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ కోర్సులకు 40నుండి 50వేల లోపు అభ్యర్ధులు హాజరవుతారని అధికారుల అంచనా. ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి ఎంసెట్-2017కు సుమారు రెండు లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.