ఆంధ్రప్రదేశ్‌

టిటిడిపికీ నోట్లరద్దు పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి నీట్ల రద్దు గండి భారీగా పడింది. గత ఏడాది ఆగమేఘాల మీద సభ్యత్వం తీసుకున్న వారు సైతం ఈ ఏడాది రెన్యువల్ చేసుకోకపోగా, కొత్త సభ్యులను సైతం ఆకర్షించలేకపోయింది. ఉన్న సభ్యులను నచ్చచెప్పి చేర్పిద్దామనుకునేంతలో పులిమీద పుట్రలా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వచ్చి పడింది. తొలిరోజు నుండి పెద్ద నోట్ల రద్దును సమర్ధిస్తూ వచ్చిన టిడిపికి అసలుకే మోసం వచ్చి పడింది. సభ్యత్వం నమోదు నవంబర్ 1న మొదలైంది. నవంబర్ 30తో ముగిసింది. నిరుడు తెలంగాణలో 15 లక్షల మంది సభ్యత్వం తీసుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య రెండు లక్షలు కూడా దాటలేదు. అలాగే ఆంధ్రాలో 33 లక్షల మంది తీసుకోగా దానిని రెట్టింపు చేయాలనే ఆశలు నెరవేరకపోగా, గత ఏడాది సభ్వత్వం సైతం దక్కలేదని తెలిసింది. 2014లో 54 లక్షల మంది టిడిపి సభ్యులుగా చేరారు. అప్పుడు దేశంలో ఎక్కువ మంది సభ్యులున్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం ఆవిర్భవించింది. ఈ ఏడాది దానిని కనీసం కోటి సభ్యత్వానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికపుడు కోటి సభ్యులు కాకున్నా 2019 నాటికైనా దానిని సాధించాలని లక్ష్యంగా టిడిపి ఏర్పాట్లు చేసుకుంది. గత ఐదేళ్లుగా సభ్యత్వం వ్యవహారాలను వ్యక్తిగతంగా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. ఎలాగైనా సభ్యత్వం పెంచాలని 494 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్ల బృందాలను సైతం ఏర్పాటు చేశారు. గ్రామాల్లో సభ్యుల వద్దకే వెళ్లి రెన్యువల్ చేయాలనే లక్ష్యం కూడా నెరవేర లేదు , చిల్లర సమస్యతో వంద రూపాయల కోసం అంతా 2000 నోటు ఇస్తున్నారని దాంతో సభ్యులు దొరికినా రెన్యువల్ చేయలేకపోతున్నామని టిడిపి నేత ఒకరు చెప్పారు.
సభ్యత్వ తేదీ పొడిగించాం: పెద్దిరెడ్డి
తెలంగాణలో అనుకున్నంత సభ్యత్వం కాకపోవడంతో సభ్యత్వ గడువును నవంబర్ 30 నుండి డిసెంబర్ 15 వరకూ పొడిగించినట్టు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ ఇ పెద్దిరెడ్డి చెప్పారు. పది జిల్లాల స్థానంలో ఏర్పాటైన 31 జిల్లాలకు కమిటీలు ఏర్పాటు చేసుకోవల్సి రావడం, డీమానిటైజేషన్ వల్ల సభ్యత్వ నమోదులో జాప్యం జరిగిందని అన్నారు. నవంబర్ 30 వరకూ 2,37,241 మంది తెలంగాణలో సభ్యులుగా చేరారని గురువారం నాడు మరో 10వేల మంది సభ్యులయ్యారని అన్నారు. దీంతో సభ్యత్వం 2.50 లక్షలకు చేరుతుందని చెప్పారు. గతంలో సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత ఎన్నికల షెడ్యూలును ప్రకటించేవారమని, ఈసారి సభ్యత్వ నమోదుతో పాటు గ్రామ కమిటీల ఎన్నికలను నిర్వహించుకునే వెసులుబాటు కూడా కల్పించామని పేర్కొన్నారు. తాజాగా సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం 2019 మహానాడు వరకూ ఉంటుందని, ఈ నిర్మాణమే 2019లో జరిగే ఎన్నికలకు సారధ్యం వహిస్తుందని చెప్పారు. పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించాలన్నా, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులకూ ఈ సభ్యత్వమే ప్రామాణికం అవుతుందని పేర్కొన్నారు.