రాష్ట్రీయం

ఇక దూకుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ‘బాలారిష్టాలు దాటేశాం. రెండున్నరేళ్లలో సంతృప్తికరమైన అభివృద్ధి సాధించాం. మిగిలిన రెండున్నరేళ్లలో దూకుడు పెంచుతాం. ప్రభుత్వ ప్రాధాన్యతలైన ముఖ్య ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తాం. పెద్ద నోట్ల రద్దు అనూహ్య స్పీడ్ బ్రేకర్. సమస్యను అధిగమించి, రెండేళ్లలో హైదరాబాద్ అభివృద్ధిలో మార్పు చూపిస్తాం. హైదరాబాద్‌ను విశ్వనగరం చేయాలన్న కల సాకారం కావడానికి ఎనిమిదేళ్లు పడుతుంది. మా పని తీరు నచ్చి ప్రజలు మరోసారి అవకాశమిస్తే సరే. కాదంటే ఇంట్లో కూర్చుంటాం’ అంటూ ఐటి మంత్రి కె తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భవించి రెండున్నరేళ్లయిన సందర్భంగా ఆంధ్రభూమికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాధించిన ప్రగతిని వివరిస్తూనే, ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కాలం ప్రగతి ప్రణాళికలను వివరించారు. ‘కొత్త రాష్ట్రం కుదురుకోవడానికి చాలాకాలం పడుతుంది. చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాలు ఇంకా నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్నాయి. తెలంగాణ మాత్రం రెండున్నరేళ్లకే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది’ అన్నారు. తెలంగాణ ఆవిర్భవించి సర్కారు కొలువుదీరినా, మొదటి పది నెలల్లో అధికారుల కేటాయింపులే జరగలేదు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్ కొరతతో చీకటిలో గడపాలని, అశాంతి, కలహాలతో హైదరాబాద్ ఏదో అయిపోతుందన్న భయాలు ప్రచారం చేశారు. పెట్టుబడులు వెనక్కిపోతాయని బెరిదించారు. అవన్నీ అబద్దాలేనన్న విషయాన్ని రెండున్నరేళ్ల పాలనతో తెలంగాణ సర్కారు నిరూపించింది అన్నారు. గతంలో పరిశ్రమల ప్రతినిధులు విద్యుత్ కోసం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవాళ్లని, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పారిశ్రామిక విద్యుత్తేకాదు, పగటిపూట పొలం పనులకు విద్యుత్ ఇవ్వగలిగే స్థాయికి చేరుకున్నామన్నారు. ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, అదే సమయంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. ‘గతంలో తెరాసకు గ్రేటర్ హైదరాబాద్‌లో అభ్యర్థులే లేరు. ప్రజా విశ్వాసంతో గ్రేటర్‌లో ఘన విజయం సాధించటం ద్వారా తెరాస విజయం సంపూర్థమైంది’ అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.
మొదటి రెండున్నరేళ్లు పాలనను పట్టాలెక్కించేందుకే ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఇప్పుడు దేశ అభివృద్ధి రేటుకన్నా రెట్టింపు అభివృద్ధి రేటు తెలంగాణలో నమోదైందని వివరించారు. మిగిలిన రెండున్నరేళ్ల కాలంలో పథకాల అమలులో దూకుడు పెంచుతామని కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో ఇక సిఎం విస్తృతంగా వివిధ వర్గాల ప్రజలను రోజూ కలుస్తారని, వృత్తి పనివారు, పారిశ్రామిక వేత్తలు సమాజంలోని అన్ని వర్గాలతో సమావేశాలు కొనసాగిస్తారన్నారు.
తెలంగాణ ఆవిర్భావ క్రమంలో జరిగిన ప్రచారంతో మెట్రో సంస్థకూ అపనమ్మకం ఏర్పడిన మాట వాస్తవమేనని కెటిఆర్ అంగీకరించారు. హైదరాబాద్‌లో జనం తగ్గటంతో ట్రాఫిక్ తగ్గుతుందన్న ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. కాలక్రమంలో ఆ సంస్థకూ వాస్తవాలు అర్థమయ్యాయని, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు మొదటి దశ ఏప్రిల్ నుంచే ప్రారంభమవుతోందని కెటిఆర్ ప్రకటించారు.
నిధులు, నీళ్లు, నియామకాలు.. తెలంగాణ ఉద్యమ నినాదాలు. ఇప్పటి వరకు 62 వేల ప్రభుత్వోద్యోగాల నియామకాలు జరిగాయి. ఎన్నికల్లో చెప్పినవేకాకుండా చెప్పనివీ చేస్తున్నామని అన్నారు.
తక్కువ మార్జిన్ ఉంటుందన్న ఆలోచనతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణంపై కాంట్రాక్టర్లు శ్రద్ధ చూపలేదు. ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి 12వేల కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. నోట్ల రద్దు తరువాత కూలీలకు ఉపాధి ఉండాలనే ఉద్దేశంతో ఇళ్ల నిర్మాణం వేగం చేశాం. వచ్చే రెండున్నరేళ్లలో లక్షల్లో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఇంటింటికి మంచినీటితోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనున్నామని, ఇప్పటికే 2 వేల కిలోమీటర్ల పరిధిలో కేబుల్ వర్క్ పూరె్తైందన్నారు. మొత్తం 50 వేల కిలోమీటర్ల వరకూ అండర్ గ్రౌండ్ కేబుల్ వేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో తీర్మానం చేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తామన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులున్నా, తెలంగాణలో 80నుంచి 85 శాతం ఎస్సీ, బీసీ, మైనారిటీలే ఉన్న విషయాన్ని కేంద్రానికి వివరించి అనుమతి సాధిస్తామన్నారు. కేంద్రంతో తెరాస సంబంధాలు మిశ్రమంగా ఉన్నాయని ఒక ప్రశ్నకు కెటిఆర్ సమాధానమిచ్చారు.
కొన్ని అంశాల్లో తక్షణం నిర్ణయాలు, కొన్నింటిని కేంద్రం పట్టించుకోవడం లేదన్న అంశాన్ని ప్రస్తావిస్తూ.. హైకోర్టు విభజన రెండు నెలల్లో పూర్తి చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి హైదరాబాద్‌లో ప్రకటించి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా విభజన జరగని విషయాన్ని గుర్తు చేశారు. కొన్ని ప్రభుత్వ సంస్థల విభజన కూడా ఇంకా పూర్తి కాలేదంటూ, ఐటిఐఆర్ ప్రాజెక్టు గురించి ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదన్నారు. ఇదే సమయంలో జాతీయ రహదారుల గురించి అడగగానే కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు.
గడచిన ఆరు దశాబ్దాల్లో తెలంగాణలో ఉన్న జాతీయ రహదారుల విస్తీర్ణంకన్నా రెండేళ్ల కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో జాతీయ రహదారులను సాధించుకున్నామని కెటిఆర్ అన్నారు.
వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల వివరాలు తెలుసుకుంటున్నారు. కొత్త రాష్టమ్రైనా దేశంలో ఆదర్శంగా నిలిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో మొదటిస్థానంలో తెలంగాణ నిలిచిందని, టిఎస్‌ఐపాస్ పెట్టుబడిదారుల దృష్టి ఆకర్షిస్తోందని గుర్తు చేశారు. ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు కెటిఆర్ వెల్లడించారు. 12 వందల టిఎంసి తెలంగాణ వాటా జలాలు ఉపయోగించుకుని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. రెండున్నరేళ్ల పాలన సంతృప్తికరంగా సాగిందంటూ, ఇప్పుడు మరింత దూకుడు పెంచుతాం, మిగిలిన కాలంలో ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాలన్నీ పూర్తి చేస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ముందున్న ముఖ్యాంశాలను వివరిస్తూ, 2018లో ఫార్మా సిటీ ప్రారంభమవుతుందన్నారు. ఇప్పటి వరకు ఆరువేల ఎకరాల భూమి సేకరించామని, మొత్తం 12వేల ఎకరాల్లో ఫార్మా సిటీ ఉంటుందన్నారు. అలాగే, 2018లో తండాలను సైతం పంచాయితీలుగా చేసి ఎన్నికలకు వెళ్తామన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు వేల కోట్లు ఖర్చవుతున్నాయంటూనే, అవే నిధులతో ప్రభుత్వాస్పత్రులు, ప్రభుత్వ కాలేజీలకు వెచ్చిస్తే శాశ్వతత్వం ఉండేదన్నారు. ఆ పథకాలను ముట్టుకోవాలంటే రాజకీయం చేసే పరిస్థితి ఉందంటూనే, సమాజానికి శాశ్వతంగా కలిగిస్తున్న నష్టంపై ఒక అధ్యయనం జరపాల్సి ఉందన్నారు. ‘వచ్చే ఎన్నికల్లో మాకు పోటీ ఉండదంటే అది అహంకారం అవుతుంది. కాంగ్రెస్‌తో మాకు పోటీ ఉంటుంది’ అని కెటిఆర్ వ్యాఖ్యానించారు.