ఆంధ్రప్రదేశ్‌

మొరాయిస్తున్న బ్యాంకు సర్వర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం, బ్యాంకులు, ఎటిఎంలలో నగదు కొరత నేపధ్యంలో ఆన్‌లైన్ కొనుగోళ్లకు సిద్ధపడిన ప్రజలకు బ్యాంకు సర్వర్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన వస్తువుల బిల్లుల చెల్లింపులకే కాకుండా దుకాణాల్లో కొనుగోళ్ల అనంతరం స్వైపింగ్ యంత్రాల ద్వారా బిల్లు చెల్లిద్దామంటే అవి కూడా పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మండిపడుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా సమస్య ఉన్నా శనివారం నాటికి అది మరింత తీవ్రతరమై అసలే పని చేయడం లేదని కొందరు వ్యాపారులు పేర్కొన్నారు. బ్యాంకుల నుంచి నగదు ఉప సంహరణపై పరిమితులు, కొద్ది మొత్తమైనా తీసుకుందామని బ్యాంకుల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలు, ఎటిఎం వద్ద కనిపిస్తున్న నో క్యాష్ బోర్డులతో జనం డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లకు సిద్ధపడగా సమస్య తలెత్తుతోంది. అవసరమైన వారికి నగదు బదిలీ కోసం నెట్ బ్యాంకింగ్‌లో ప్రయత్నిస్తే అక్కడ సైతం సర్వర్ బిజీ అన్న సమాధానం వస్తోందని ప్రజలు పేర్కొంటున్నారు. బ్యాంకు సర్వర్లు మొరాయిస్తుండటంతో నగదు బదిలీ సాధ్యం కావడం లేదు. నగదు బదిలీ సాధ్యం కాకపోవడంతో సామాన్యుడే కాకుండా పెద్ద వ్యాపారులు, వాణిజ్యవేత్తలు సైతం ఇబ్బంది పడుతున్నారు. నగదు బదిలీ అయితే తప్ప తమకు సరుకు పంపరని వ్యాపారులు పేర్కొంటున్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి సర్వర్లు సరిగ్గా స్పందించడం లేదని చివరకు శనివారం పూర్తిగా మొరాయించాయని వారు ఫిర్యాదు చేస్తున్నారు. దీనికి తోడు జాతీయ రహదార్లపై ఉన్న టోల్‌గేట్లలో ఏర్పాటు చేసిన స్వైపింగ్ యంత్రాలు కూడా సరిగ్గా పనిచేయకపోవడంతో వాహనాలు పెద్దసంఖ్యలో బారులు తీరాయి. జనం గంటల తరబడి టోల్‌గేట్ల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. టోల్‌గేట్లలో రూ.200కు మించిన రుసుముకు రూ.500 పాత నోటు తీసుకోవచ్చని అనుమతి ఉన్నా చిల్లర కొరత కారణంగా తీసుకోకపోవడంతో వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. సర్వర్ సమస్యపై ఓ బ్యాంకు అధికారి స్పందిస్తూ గతంలో ఉన్న సర్వర్ సామర్థ్యం కంటే ప్రస్తుత వినియోగం 200 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందని అన్నారు. ఫలితంగా సర్వర్‌పై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. నగదు ఉపసంహరణ పరిమితి తగ్గడంతో ఆన్‌లైన్ కొనుగోళ్లు, స్వైపింగ్ యంత్రాల ద్వారా చెల్లింపులకు ప్రజలు సిద్ధపడటంతో సర్వర్‌పై సామర్థ్యానికి మించి రద్దీ పెరిగిందన్నారు. ఇక శనివారం పూర్తిగా మొరాయించడానికి కారణం ఉద్యోగులకు జీతాలు రావడం, టోల్‌గేట్లలో వసూళ్లు ప్రారంభం కావడంతో బ్యాంకు సర్వర్లపై భారం మరింత ఎక్కువైందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఇప్పటికే స్పందించారని రానున్న రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.