రాష్ట్రీయం

బెజవాడలో ‘వంగవీటి’ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 3: కుల రాజకీయాలకు పెట్టింది పేరయిన బెజవాడలో సంచలన సినీ దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ నిర్మించనున్న ‘వంగవీటి’ సినిమా విడుదలకు ముందే వివాదంగా మారుతోంది. సినిమా ప్రమోషన్, పబ్లిసిటీలో తనదైన శైలితో అందరినీ ఆకట్టుకునే వర్మ విడుదల చేసిన ఈ సినిమా టీజర్, ప్రత్యర్ధి సామాజికవర్గాలయిన కమ్మ-కాపులలో ఉత్కంఠ కలిగిస్తోంది. దివంగత రంగా హత్య, అంతకుముందు బెజవాడ ఘటనలపై తమ సామాజిక, కుటుంబాల పాత్రలను వర్మ ఏవిధంగా చిత్రీకరించారన్న ఉత్కంఠ ఆ రెండు సామాజికవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నట్లు వంగవీటి, దేవినేని కుటుంబసభ్యుల మాటలు స్పష్టం చేస్తున్నాయి. వంగవీటి సినిమా ప్రమోషన్ కోసం శనివారం విజయవాడ వచ్చిన దర్శక నిర్మాత రాంగోపాల్‌వర్మ పర్యటన ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. సినిమా నిర్మాణానికి ముందు సీనియర్ నేత దేవినేని నెహ్రూతో మాట్లాడిన వర్మ, తాజాగా తన సినిమాలోని పాత్రలను వివరించేందుకు వంగవీటి కుటుంబసభ్యులతో భేటీ అయ్యారు. దీనికి హెల్ప్ ఆసుపత్రి వేదికయింది. ఈ భేటీలో రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రత్నకుమారి, తనయుడు వంగవీటి రాధాతోపాటు సినిమా నిర్మాత దాసరి కిరణ్, రంగా-రాధా మిత్రమండలి నేతలు కూడా పాల్గొన్నారు. గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే నాని వీరిద్దరికి మధ్యవర్తిత్వం వహించి ఈ భేటీ ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఈ భేటీలో తన తండ్రి పాత్రపై చిత్రీకరణ ఏవిధంగా ఉంటుందని రాధా వర్మను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సినిమాల్లోని కొన్ని సీన్లను వివరించగా, వాటిపై వంగవీటి కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసి, వాటిని తొలగించాలని డిమాండ్ చేసింది. రంగాను కించపరిచేలా సన్నివేశాలుంటే సహించేది లేదని, వివాదస్పద సన్నివేశాలను తొలగించాల్సిందేనని రాధా స్పష్టం చేసినప్పటికీ, వర్మనుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. కులాలను ప్రస్తావిస్తూ వర్మ పాడిన పాటను కూడా తొలగించాలని సూచించినా వర్మ వౌనంగా విని ఊరుకున్నట్లు చెబుతున్నారు. దాదాపు గంటన్నరసేపు వీరి భేటీ కొనసాగింది. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన రాధా భేటీపై అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఇంకా తమకు అభ్యంతరాలున్నాయి. వర్మ వివరణతో సంతృప్తి చెందలేదని అన్నారు.‘ఆయన వచ్చి మాట్లాడతానంటేనే మేం మాట్లాడటం జరిగింది. మా అభ్యంతరాలేమిటో ఆయనకు చెప్పాం. ఆ తర్వాత ఆయనిష్టం. రంగాను కించపరిచేలా ఉంటే మాత్రం సహించేది లేదు. రంగా ఒక సామాజికవర్గానికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు. అయినా కేసు కోర్టులో ఉంది. అక్కడే తేల్చుకుంటాం’ అని రాధా వ్యాఖ్యానించారు. వర్మ తన పర్యటనలో తెదేపా సీనియర్ నేత దేవినేని నెహ్రూతో కూడా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా తన సినిమా గురించి ఆయన నెహ్రూకు వివరించారు. వర్మ పాడిన పాటను తొలగించాలని నెహ్రూ సూచించగా, అది సాధ్యం కాదని అందులో వివాదం ఏమీ ఉండదని వర్మ చెప్పినట్లు సమాచారం. సమాజంలోని వ్యక్తులపై సినిమా తీసే హక్కు తనకుందని, అయినా వంగవీటి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టని వర్మ చెప్పారు. ఆడియో రిలీజుకు ఎవరినీ పిలవలేదని దేవినేనికి వివరించారు.
నెహ్రూతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన వర్మ, సినిమాలోని ఒక పాటపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, రాధాతో భేటీ గురించి ఇప్పుడేమీ చెప్పలేనని, దానిపై భేదాభిప్రాయాలున్నాయన్నారు. అయితే రాధా సూచనలను పరిగణనలోకి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ సినిమాతో రక్తపాతం జరుగుతుందన్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
తమ భేటీపై స్పందించిన దేవినేని నెహ్రూ ఒక పాటను తొలగించాలని కోరినట్లు వెల్లడించారు. తనకు నిమిషంన్నర ట్రైలర్ మాత్రమే చూపారని, సినిమా చూపించలేదన్నారు. సినిమా విడుదల తర్వాత విజయవాడలో మళ్లీ ఘర్షణలు జరిగే పరిస్థితి ఇప్పుడు లేదని, అయినా సినిమాలు చూసి కొట్టుకుచచ్చే పరిస్థితి సమాజంలో లేదన్నారు.
కాగా, వంగవీటి కుటుంబసభ్యులకు, వర్మకు మధ్యవర్తిగా వ్యవహరించిన గుడివాడ ఎమ్మెల్యే నాని వారి భేటీ అంత సంతృప్తికరంగా సాగలేదని మీడియాకు చెప్పారు.

చిత్రాలు.. నెహ్రూతో కలిసి విలేఖర్లతో మాట్లాడుతున్న వర్మ, వంగవీటి కుటుంబంతో భేటీ అయన రాంగోపాల్‌వర్మ