రాష్ట్రీయం

ఆమే ఒక సైన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్తి సుబ్రహ్మణ్యం
ఆమె ఒక సైన్యం. ఆ సైన్యానికి రాణి, సేనాని, అంగరక్షకురాలు అన్నీ ఆమెనే. రాజకీయ రణరంగంలో ప్రత్యర్థులను ఒంటరిగానే ఎదుర్కొని ‘జయా’పజయాలను సమానంగా స్వీకరించి, మొక్కవోని ధీరత్వం ప్రదర్శించటం ఆమెకే చెల్లు. ఎంజిఆర్ మరణం అనంతరం ఒంటరిగానే రాణించి.. జీవించి.. వెళ్లిపోయిన మహానేత ఆమె.
సభలో వందలమందిలో పరాభవం పొందినా, లక్షలాది ప్రజల సాక్షిగా ఎంజీఆర్ భౌతికకాయం వద్ద అవమానాలు ఎదుర్కొన్నా నిలిచి గెలిచిన మొండిఘటం. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి, అనుమానానికి, ప్రతీకారానికి, దూకుడుకు నిలువెత్తు నిదర్శనం ఆమె. తన రాష్టమ్రే వేదికగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసి జైలుకు వెళ్లినా, చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో మళ్లీ గద్దెనెక్కిన 68 ఏళ్ల తమిళ ఉక్కుమహిళ అవిశ్రాంత పోరాటంలో ఇక అలసిపోయింది. 57 రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన తమిళ ప్రజల ఆరాధ్యదేవత అమ్మ జయలలిత శాశ్వత లోకానికి వెళ్లిపోయింది. కొన్ని కోట్ల ప్రజల ఇళ్లలో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోల్లో కనిపించే తమ అమ్మ ఇకపై కనిపించరన్న వాస్తవాన్ని తమిళులు తట్టుకోలేకపోతున్నారు. తామూ రోజూ పూజించే దేవతల పక్కన తమ అభిమాన దేవత కూడా శాశ్వతంగా చేరిపోయిందని తెలుసుకున్న జనం గుండెలవిసేలా రోదిస్తున్నారు. అశేష జనావళికి ఆరాధ్య నాయకిగా మారిన జయ అంతరంగం ఎవరికీ అర్థంకాదు. వౌనం ఆమె ఆభరణం. ఒంటరితనం ఆమె జీవనవిధానం. ఆందరికీ దూరంగా.. ఒంటరిగా గడిపిన జయ తత్వమే లక్షలాది మంది అభిమానులను సంపాదించిపెట్టింది. ప్రజాభిమానం సంపాదించుకున్న జయలలిత మనస్తత్వం, వ్యక్తిగత జీవితంలోకి ఓసారి తొంగిచూస్తే అందులో ‘మరో జయలలిత’ కనిపిస్తారు. జయలలిత వ్యక్తిగత వ్యవహార శైలి పరిశీలిస్తే ఆది నుంచి తుదివరకూ ఆమె ఒంటరి జీవనమే దర్శనమిస్తుంటుంది. సినిమాల్లో అగ్రతారగా వెలిగిన రోజుల్లోనూ జయ తన సహచర నటులతో మాట్లాడేవారు కాదు. షూటింగ్ విరామంతో పాటు ఇంట్లోనూ ఎక్కువగా పుస్తక పఠనంలోనే మునిగిపోయేవారు. ఎంజిఆర్ ఆశీస్సులతో అన్నాడిఎంకెలో చేరినప్పుడూ అదే వైఖరి. ఆయన మృతి చెందిన తర్వాత జరిగిన అంత్యక్రియల్లో తనను వెనక్కి నెట్టివేసి జానకీరామచంద్రన్‌ను తెరపైకి తీసుకొచ్చినప్పుడూ ఆమెది ఒంటరి పోరాటమే. ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం ఆమెలో ప్రపంచానికి కనిపించిన ప్రధాన లక్షణం. తన సహచరి శశికళ కుమారుడు సుధాకర్‌ను దత్తత తీసుకుని, అంగరంగ వైభవంగా వివాహం జరిపించినప్పుడు మాత్రమే ఆమె ప్రముఖులతో ఎక్కువసేపు మాట్లాడినట్లు చెబుతుంటారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తన మంత్రివర్గ సహచరులతో గానీ, పార్టీ ఎమ్మెల్యేలతో గానీ మాట్లాడిన దాఖలాలు కనిపించవు. ఆమె పార్టీ అధినేత, సీఎంగా ఉన్నరోజుల్లో తన పార్టీ నేతలతో వేళ్లమీద లెక్కించగల మందితో మాత్రమే మాట్లాడారంటే ఆశ్చర్యపోక తప్పదు. చివరకు ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడా ఇంటర్‌కమ్‌లోనే సంభాషించేవారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీడియాతో భేటీ అయి, వారితో సంబంధాలకు తాపత్రయపడుతున్న రోజుల్లో కూడా ఆమె మీడియాతో ముఖాముఖి అయిన సందర్భాలు అత్యల్పమే. అసలు సచివాలయానికి మీడియానే రానిచ్చేవారు కాదు. మరీ అత్యవసరమైతే పత్రికాప్రకటనలు పంపేవారు. చివరకు జైల్లో ఉన్నప్పుడూ తనను పరామర్శించేందుకూ ఎవరినీ అనుమతించకుండా ఒంటరితనమే అనుభవించిన విచిత్ర నైజం ఆమె ప్రత్యేకత. చిన్నతనంలో అమ్మ సినీరంగంలో బిజీగా ఉన్నప్పుడు తల్లికి దూరంగా పిన్ని వద్ద పెరిగిన జయ అక్కడా దాదాపు ఒంటరిగానే గడిపింది. చిన్నతనంలో ఎదుర్కొన్న అవమానాలే ఆమె హృదయాన్ని అలా మార్చేశాయని అంటారు. గలగలా మాట్లాడకపోయినా జననాడిని పట్టడంలో ఆమె దిట్ట. అందుకే ఆమెను తమిళ ప్రజలు దేవతగా కొలిచారు. దేవతలు మాట్లాడరుకదా!. తమిళజనం అలానే భావించినట్లున్నారు. ఆమె మాటలకన్నా చేతలనే విశ్వసించారు. ఆరాధించారు. ఆమె వౌనం, కాఠిన్యం చూసి నియంతగా వర్ణిస్తారు చాలామంది. కానీ జయతీరు వేరు. వౌనమే ఆయుధంగా ఒంటరిగా అడుగులు వేసిన జయ చివరకు వౌనంగా వెళ్లిపోయింది.. అశేష జనవాహినిని ఒంటరిని చేసి...
తమిళనాడు వేదికగా భారత రాజకీయాల్లో చరిత్ర సృష్టించి, లెక్కలేనంత సంపద సంపాదించిన జయలలిత.. చివరకు ఏ ఒక్కరినీ సొంతం చేసుకోకుండా, వారసులు లేకుండా, తాను శాసించి, శ్వాసించిన పార్టీకి ఉత్తరాధికారిని తయారుచేయకుండా, చివరిరోజుల్లో బంధుమిత్రులు పక్కనలేకుండా, ఒంటరిగా వెళ్లిపోయిన వైనం ఒక్కటే పురచ్చితలైవి జీవన ప్రస్థానంలో మరిచిపోలేని విషాదం.

మార్తి సుబ్రహ్మణ్యం