రాష్ట్రీయం

నల్లధనంపై యుద్ధం తీవ్రతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 9: నల్లధనం నిర్మూలనకు పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ప్రజల నుండి తగిన మద్దతు లభించిందని, నల్లధనంపై యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తామని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి జి.మురళీధర్ రావు అన్నారు. శుక్రవారం ఇక్కడ బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత, ఈ నెల 16 నుండి బిజెపి కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ పదాధికారులు దేశవ్యాప్తంగా నల్లధనం వ్యతిరేక ప్రచారాన్ని విస్తృత స్థాయిలో చేస్తారని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ చర్యలతో కలిగే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు చెప్పారు.
నోట్ల రద్దు నిర్ణయంతో ప్రజలకు ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి ముందస్తు అవగాహన ఉందని, అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని అన్నారు. నల్లధనం నివారణతో దేశానికి మేలు జరుగుతుందన్న ఆలోచనతో ప్రజలు కూడా సహనంతో మోదీ నిర్ణయానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ప్రపంచంలోనే భారత దేశం అత్యధిక నల్లధనం ఉన్న దేశంగా సర్వేలు వెల్లడించాయని 2012 తర్వాత 90 బిలియన్ డాలర్ల నల్లధనం దేశం దాటగా దేశ జిడిపికి సమాంతరంగా నల్లధనం పేరుకు పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనతోనే దేశంలో నల్లధనం పెరిగిపోయినందున ఆ పార్టీ ఇందుకు బాధ్యత వహించాలన్నారు. బిజెపి నల్లధనంపై మొదటి నుండి పోరు ప్రకటిస్తూనే ఉందన్నారు.
2009 ఎన్నికల్లో, 2011లో అద్వానీ జనచేతన యాత్రలో, 2014 ఎన్నికల్లో నరేంద్రమోదీ నల్లధనం నివారణ చర్యలపై ప్రచారం చేశారన్నారు. నల్లధనం వ్యతిరేక విధానాలపై బిజెపి వెనుకడుగు వేసేది లేదన్నారు. నగదు రహిత విధానాల అమలు పూర్తిస్థాయిలో ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని తెలుసునని, అయితే రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లను సర్దుబాటు చేస్తూనే ఇంకోవైపు నగదు రహిత పద్ధతులను ప్రోత్సహించాలని భావిస్తోందని అన్నారు.