రాష్ట్రీయం

లక్షమంది భవానీల దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), జనవరి 3: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆదిపరాశక్తి, శ్రీ జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో ఆదివారం వేకువ జామున సుమారు లక్ష మంది భవానీలు భక్తిశ్రద్ధలతో దీక్ష విరమించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీక్ష స్వీకరించిన భవానీలు 41 రోజుల పాటు నియమనిష్ఠలతో ఆచరించి శనివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. పవిత్రస్నానాలు ఆచరించి ఇరుముడులకు ప్రత్యేక పూజలను నిర్వహించి గురుభవానీల ఆధ్వర్యంలో ఇరుముడులను శిరస్సుపై ధరించి సుమారు 8 కిలోమీటర్లు గిరిప్రదక్షణ చేసి కెనాల్‌రోడ్ వినాయకుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గాన్ని చేరుకున్నారు. భవానీల రద్దీని గమినించి శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవో నరసింగరావు వైదిక కమిటీ సభ్యులతోచర్చలు జరిపి ఆదివారం తెల్లవారు జామున 1-20 గంటలనుండే అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. కొంతమంది భవానీలు అమ్మవారికి తలనీలాలు సమర్పించి వారి వారి మొక్కుబడులను చెల్లించుకున్నారు. శనివారం రాత్రి నుండే క్రమక్రమంగా భవానీలు పెరగటంతో ఇవో నరసింగరావు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఆదివారం తెల్లవారు జామునుండే భవానీలకు అమ్మవారి దర్శనం ఏర్పాటు చేయటంతో ఐదు గంటల వ్యవధిలో సుమారు లక్ష మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నారు. అంతరాలయంలో పర్యవేక్షణాధికారులు కె శ్రీనివాసమూర్తి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతోపాటు, అక్కడ సిబ్బందికి నిర్థిష్టమైన ఆదేశాలు జారీ చేయటంతో భవానీలు, భక్తులు ఎంతో ప్రశాంతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు.

తెనాలి రైల్వేస్టేషన్‌లో ఘోరం
ఆగిన గూడ్స్ బోగీలు దాటుతూ ఇద్దరు దుర్మరణం
అకస్మాత్తుగా రైలు కదలడంతో దుర్ఘటన
మరొకరికి తీవ్ర గాయాలు
ఇద్దరు పిల్లలను రక్షించిన తోటి ప్రయాణీకులు
తెనాలి, జనవరి 3: తోటి ప్రయాణికుల సాక్షిగా గూడ్స్ రైలు కిందపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపట్ట సంఘటన గుంటూరు జిల్లా తెనాలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పెదవడ్లపూడి రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఉదయం 9గంటల సమయంలో చోటుచేసుకుంది. తెనాలి జిఆర్‌పి ఎస్‌ఐ ప్రభాకరరావు కథనం ప్రకారం షేక్ హసీనా, షేక్ ముంతాజ్, షేక్ షమూన్ అనే మహిళలు పొన్నూరు మండలం మాచవరం గ్రామంలో తమ బంధువుల గృహంలో జరిగే శుభకార్యానికి హాజరయ్యే నిమిత్తం వడ్లమూడి రైల్వే స్టేషన్‌కు ఉదయం 8.30గంటల సమయంలో చేరుకున్నారు. విజయవాడ నుండి పొన్నూరు వైపునకు వెళ్ళే ప్యాసింజరు రైలు 3వ నెంబరు ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుందని తెలుసుకొని 1వ నెంబరు ప్లాట్‌ఫామ్ నుండి 3వ నెంబరు ప్లాట్‌ఫామ్ మీదకు వెళ్ళేందుకు ఫ్లైఓవర్ బ్రిడ్జి మీదుగా వెళ్ళవలసి ఉండగా 2వ ఫ్లాట్‌ఫామ్ మీద ఉన్న గూడ్స్ పెట్టెల మధ్య నున్న ఖాళీస్థలం గూండా వెళ్ళేప్రయత్నం చేశారు.
సరిగ్గా అదే సమయంలో గూడ్సు రైలు కదలడంతో హసీనా (40), ముంతాజ్, షమూన్ ఇద్దరు పిల్లలతో సహా గూడ్స్ పెట్టెల మధ్యనున్న ఖాళీస్థలంలోకి వెళ్ళిపోయారు. అప్పటికే పెట్టెల మధ్యనున్న హసీనా మృతి చెందగా, ముంతాజ్, షమూన్‌లను 108 వాహనం ద్వారా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐకు తరలించారు. మార్గమద్యంలో ముంతాజ్ (50) కూడా మృతి చెందినట్లు ఎస్‌ఐ చెప్పారు. షమూన్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇదిలా ఉండగా ఈ సంఘటనలో మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు, వారిని తోటి ప్రయాణికులు రక్షించినట్లు తమ విచారణలో వెల్లడయిందని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రభాకరరావు తెలిపారు.

నెల్లూరులో స్వల్పంగా
కంపించిన భూమి
హడలెత్తిన జనం
ఉదయగిరి/వింజమూరు/దుత్తలూరు, జనవరి 3: నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం 12.25 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపిస్తూ భారీ శబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారిగా జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వింజమూరు మండలంలోని ఊటుకూరు, తక్కెళ్లపాడు, బత్తెనవారిపల్లి, చాకలికొండ, గోళ్లవారిపల్లి, వరికుంటపాడు మండలం గణేశ్వరపురం గ్రామాల్లో మూడు సెకన్లపాటు భూమి కంపించింది. గత ఆరు నెలలుగా ఇలా ప్రకంపించడం మూడో పర్యాయమని ఆయా గ్రామస్థులు పేర్కొన్నారు. నిలుచున్న స్థలంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చినట్లు జరిగిందని వారు వివరించారు. గతంలో ఇంటిలో వస్తువులు కూడా కదిలాయని, అయితే ఈసారి అంతగా లేదని స్థానికులు అంటున్నారు.
‘ఆదివాసీల స్వయం పాలనకు ఉద్యమాలే శరణ్యం’
ఉట్నూరు, జనవరి 3: పాలకులు, ప్రభుత్వాలు మారినా గిరిజనుల చట్టాలు మాత్రం దేశంలో ఎక్కడా అమలు జరగడంలేదని, అన్నిరంగాల్లో దారిద్య్రాన్ని అనుభవిస్తున్న ఆదివాసీ గిరిజనులు హక్కుల పరిరక్షణ, స్వయంపాలన కోసం ఉద్యమాలబాట పట్టాలని త్రిపుర మాజీమంత్రి, పార్లమెంట్ సభ్యులు జితిన్ చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని బిడి శర్మ ప్రాంగణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ప్రథమ మహాసభలకు వివిధ ప్రాంతాల నుండి భారీ ఎత్తున గిరిజనులు తరలివచ్చి హక్కుల కోసం కదం తొక్కారు. ఈ సందర్భంగా మహాసభల్లో ముఖ్యఅతిథిగా హాజరైన జితిన్ చౌదరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజనుల కోసం ఎన్ని చట్టాలు రూపొందించినా ప్రభుత్వాలు అమలుపర్చకుండా వారి హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు. గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన చట్టాలను, విశేష ఆధికారాలను అమలుపర్చాల్సిన గవర్నర్లు ఉత్సవ విగ్రహాల్లాగానే మిగిలిపోతున్నారని, గవర్నర్ల చేతికి కట్టబెట్టిన 5వ షెడ్యూల్‌ను తొలగించి, గిరిజనుల స్వయంపాలన కోసం 6వ షెడ్యూల్‌ను పకడ్బందీగా అమలుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ధర్మక్షేత్రంలో ధర్మాసనం ఏర్పాటు చేయాలి
హైకోర్టు సాధనకు సంతకాల సేకరణ
కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జనవరి 3: తిరుపతి ధర్మక్షేత్రంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన హైకోర్టును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ నగరంలో ఆయన సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని పలు వార్డులలో చేపట్టిన సంతకాల సేకరణకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి హైకోర్టుతో ఆంధ్ర రాష్ట్రం ఏటా 100 కోట్ల రూపాయల మేర నష్టపోతోందన్నారు. రాష్ట్ర రాజధానిలోనే హైకోర్టు ఉండాలన్న నిబంధన లేదన్నారు. రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువైన రాజధానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో కోర్టు ఉండాలన్నది అనేకమంది న్యాయమూర్తులు, న్యాయవాదుల అభిలాష అన్నారు.
ప్రజలు కూడా ఇదే భావనతో ఉన్నారన్నారు. తిరుపతిలో ఉన్నఫలంగా హైకోర్టు ఏర్పాటు చెయ్యడానికి అవసరమైన అన్ని వౌలిక సదుపాయాలతోపాటు న్యాయవాదులు కూడా పుష్కలంగా ఉన్నారన్నారు. న్యాయమూర్తులు ఉండేందుకు అవసరమైన భవన సముదాయాలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజాభీష్టం మేరకే హైకోర్టు సాధన కోసం తాను లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో రాజధాని ఏర్పాటు చెయ్యకుండా రాయలసీమ వాసులకు అన్యాయం చేశారన్నారు. కనీసం హైకోర్టు ఏర్పాటు చేయడానికైనా ఆయన తక్షణం స్పందించాలన్నారు. హైకోర్టు ఏర్పాటుకు ఆయన సానుకూలమా? వ్యతిరేకమా? అన్నది కూడా సంక్రాంతిలోపు తేల్చి చెప్పాలన్నారు. కానిపక్షంలో తిరుపతిలో హైకోర్టు ఏర్పాటు చెయ్యడం బాబుకు ఇష్టం లేదనే అభిప్రాయానికి ప్రజలు రావలసి ఉందన్నారు. ఇక 7008 మంది నిరుపేద మహిళలకు మంజూరైన రెండు బెడ్‌రూంల ఇళ్ల నిర్మాణం తక్షణం ప్రారంభించి లబ్ధిదారులకు అందించేలా బాబు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది రవి, పిసిసి కార్యదర్శి రుద్రరాజు శ్రీదేవి, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, శాంతి, సావిత్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.