రాష్ట్రీయం

బహుళజాతి సంస్థల కోసమే పెద్దనోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: పెద్దనోట్ల రద్దు పేరుతో కేంద్ర ప్రభుత్వం పేదలపై ఆర్థిక దౌర్జన్యానికి పాల్పడుతోందని, ఇది బహుళజాతి సంస్థలకు లాభం చేకూర్చేందుకేనని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు కోసం ప్రధాని మోదీ చెప్పిన అవినితి నిర్మూలన జరగలేదని, అవినీతి స్థాయి మరింత తీవ్రమైందని తెలిపారు. విజయవాడలో నిర్మించిన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ఒకవైపు పేదలు డబ్బులు దొరక్క బ్యాంకుల వద్ద క్యూల్లో గంటల తరబడి నుంచుంటున్నారని, అదే సమయంలో రిజర్వు బ్యాంకు ముద్రించిన పెద్దనోట్లు నేరుగా పెద్దల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, కట్టలు కట్టలుగా గదుల్లోకి చేరుతున్నాయని ఆయన ఉదహరించారు. ఇటీవల తనిఖీల్లో దొరుకుతున్న నగదే దీనికి నిదర్శనమన్నారు. దీనికి మోదీ సమాధానం చెప్పాలన్నారు. అవినీతి నిర్మూలిస్తామని చెప్పిన నెలలోపే గతంలో కంటే విలువైన నగదు ఇళ్లలో చేరిపోతోందని చెప్పారు. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతుంటే అక్కడకు రాకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమెరికాలో 48 శాతం, చైనాలో 80 శాతం నగదు లావాదేవీలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం 100 శాతం ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాలని చెప్పడం కార్పొరేట్ల లబ్ధికోసం తప్ప మరొకటి కాదని ఏచూరి స్పష్టం చేశారు. ఆన్‌లైన్ లావాదేవీల పేరుతో డబ్బంతా ఒక దగ్గరకే పంపిస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. సామ్రాజ్యవాదానికి మోదీ జూనియర్ భాగస్వామిగా మారారని ఆరోపించారు. మోదీ నిర్లక్ష్యం వల్ల కాటన్, లెదర్, జ్యూయలరీ రంగాల్లో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని చెప్పారు. ఆయా రంగాల్లో 31.9 మిలియన్ల మంది రోజువారీ, వారాంతపు కూలీలు ఉన్నారని, వారందరికీ డబ్బు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిశ్రమలూ మూతపడుతున్నాయన్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెన్నడూ ఎదురుకాలేదని చెప్పారు. బ్లాక్‌మనీ రద్దుచేస్తామంటూ మోదీ చేసిన ప్రకటన హాస్యాస్పదమన్నారు. నల్లధనం మొత్తం బంగారం రూపంలో, విదేశీ బ్యాంకుల్లో, దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఉందని చెప్పారని, అదికూడా ఐదు నుండి ఆరు శాతం మాత్రమేనని, అలాంటప్పుడు దాన్ని రద్దుచేయడం సాధ్యం కాదని తెలిపారు. ఓవైపు బ్యాంకుల్లో నగదు లేదని, అదే సమయంలో కొద్దిమంది వద్ద కోట్లాది రూపాయల కట్టలు దొరుకుతుంటే అవినీతి నిర్మూలన ఎక్కడ జరిగిందో మోదీ సమాధానం చెప్పాలన్నారు. అసంబద్ధమైన మోదీ విధానాలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వారిని చైతన్యపర్చాల్సిన అవసరం ఉందన్నారు. సభలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శివర్గ సభ్యుడు వై వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విజయవాడలో ఎంబి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీతారాం ఏచూరి