రాష్ట్రీయం

పైపుల కోసమే నీళ్ల్లు!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: మిషన్ భగీరథ పథకం నీళ్ల కోసం పైపుల్లా కాకుండా, పైపుల కోసం నీళ్లన్నట్టుగా మారిందని కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్క ఆరోపించారు. మిషన్ కాకతీయ పథకానికి లెస్ టెండర్లు రాగా మిషన్ భగీరథకు మాత్రం ఎక్సెస్‌తో టెండర్లు ఎందుకు కోట్ చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు కోట్ చేసిన టెండర్లను పరిశీలిస్తే ఒక్కో టెండర్‌కు మధ్య 0.5 నుంచి 1.5 అదనంగా కోట్ చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటీ? వీటిని చూస్తుంటే కాంట్రాక్టర్లంతా ఒకచోట కూర్చొని టెండర్లు వేసినట్టుగా ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. శాసనసభలో మంగళవారం మిషన్ భగీరథపై జరిగిన లఘు చర్చలో కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.36 వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.25 వేల కోట్లు ఖర్చుతో ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు తీసుకొస్తుండగా, తిరిగి రూ.42 వేల కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకం ఎందుకని భట్టి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు తెలంగాణకు రూ.69 వేల కోట్ల అప్పు బదలాయించగా, తెరాస ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో లక్ష 24 వేల కోట్లకు అప్పు చేరిందన్నారు. ఇంత పెద్ద అప్పు రాష్ట్రానికి మోయలేని భారం కాదా? అని నిలదీశారు. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలో వచ్చినప్పుడు ఇంత అప్పు చెల్లింపు పెనుభారమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ఈ పథకంలో రూ.210 కోట్లు దుర్వినియోగం అవుతుండగా, రాష్టవ్య్రాప్తంగా ఇంకెంత మొత్తంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క పథకానికి రూ.42 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ పారదర్శకంగా ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. డిపిఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ పథకానికి డిపిఆర్‌లను ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్‌ఇసి, త్రిబుల్ ఐటీల ద్వారా తయారు చేయించినప్పుడు మిషన్ భగీరథకు మాత్రం ప్రైవేట్ సంస్థ వ్యాప్కాస్‌తో చేయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వ్యాప్కాస్ గురించి ఇదే సభలో ‘వారిదేముంది.. ప్రభుత్వం ఎలా చెబితే అలా తయారు చేసి ఇస్తుంది’ అని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారని భట్టి గుర్తు చేశారు.
టిడిపి సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు రెండు వేల కోట్ల ఫీజు రియింబర్స్ చెల్లించలేని ప్రభుత్వం, రూ.42 వేల కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 22 లక్షల కుటుంబాలకు ఇళ్లు లేనప్పుడు, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇస్తామనడం హాస్యాస్పదంగా లేదా? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్ ఇళ్ల పథకాన్ని, ఉద్యోగ పోస్టులను భర్తీ చేయకుండా రూ.42 వేల కోట్లు అప్పు చేసి మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టడం అవసరమా? అని కృష్ణయ్య ప్రశ్నించారు. బిజెపి సభ్యుడు ఎన్‌విఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకం చాలా బాగుందని, ప్రధాన మంత్రి, నీతి అయోగ్‌తోపాటు అనేక రాష్ట్రాలు కూడా ప్రశంసించాయన్నారు. వచ్చే బడ్జెట్‌లో ఈ పథకానికి కేంద్రం పెద్ద మొత్తంగా ఆర్థిక సాయం చేయబోతుందని, దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలని, అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఎన్‌విఎస్ ప్రభాకర్ గుర్తు చేశారు.