రాష్ట్రీయం

153శాఖల్లో పంపకాలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపకం ప్రక్రియను కమల్‌నాథన్ కమిటీ దాదాపు ముగించింది. ఇంతవరకు 153 శాఖల ఉద్యోగులను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించింది. ఇందులో 151 శాఖలకు సంబంధించి ఉద్యోగాల పంపకాన్ని ఆమోదిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. మరో రెండు శాఖల ఉద్యోగుల పంపకాల జాబితాను గత గురువారం కేంద్రానికి పంపారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ డిపార్టుమెంట్ ఉద్యోగుల పంపకం పని దాదాపు పూర్తయింది. కేంద్రం ఆమోదించిన వెంటనే ఈ జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు. పోలీసు శాఖలో డిఎస్పీలు, రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్ల పంపకానికి కోర్టుకేసులుసమస్యగా మారాయి. ఇవి కూడా త్వరలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులను ఆంధ్ర కేడర్‌లో తీసుకునేందుకు ఏపి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. గత రెండేళ్లలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల ఖాళీల్లో వీరిని నియమించే అవకాశం ఉంది. ఈ ఫైల్ ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద పరిశీలనలో ఉంది. అవసరమైతే అదనపు పోస్టులను కూడా ఏర్పాటు చేసే అవకాశాన్ని ఏపి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఏపి సచివాలయంలో దాదాపు వెయ్యి మందికిపైగా తెలంగాణలో జన్మించిన ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకునే విషయమై త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మధ్య చర్చలు జరగనున్నాయి. కోర్టుల్లో కేసులు దాఖలు చేసిన ఏపికి చెందిన డిఎస్పీలను కూడా రాష్ట్రంలో నియమించాలని ఏపి పోలీసు శాఖ యోచిస్తోంది.
కమల్‌నాథన్ కమిటీ మొత్తం 46672 మంది ఉద్యోగుల పంపకాలను ఖరారు చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి 24401 మంది స్థానికులు, తెలంగాణకు చెందిన 1824 మందిని, నాన్‌లోకల్స్ 347 మందిని కేటాయించారు. మొత్తం 26040 మంది ఉద్యోగులను ఏపికి కేటాయించారు. తెలంగాణకు 18,469 మంది ఉద్యోగులు, ఆంధ్రలో జన్మించిన వారు 1292 మంది ఉద్యోగులు, నాన్‌లోకల్స్ 339 మందిని కలిపి 20632 మందిని కేటాయించారు.
కాగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్‌ను పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. కాని విభజన చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం 58 శాతం తమకు దక్కుతుందని ఏపి ప్రభుత్వం వాదిస్తోంది. ప్రస్తుతం ఈ అంశంపై 22వ తేదీన వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంబంధించిన అధికారులతో మాట్లాడాలని కేంద్ర హోంశాఖ భావించింది. కాని అసెంబ్లీ సమావేశాల వల్ల తమకు ఇప్పుడు కుదరదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ సమావేశాన్ని వచ్చే నెలకు కేంద్ర హోంశాఖ వాయిదా వేసింది. విభజన చట్టంలో 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్ధల ఆస్తులు, రుణాల పంపకంపై ఈ నెల 26వ తేదీన సమావేశం ఏర్పాటు చేసినట్లు హాజరు కావాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.