రాష్ట్రీయం

వర్మ-రాధా మాటల యుద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 26: రాంగోపాల్ వర్మ.. వివాదాల పుట్ట. ఇటీవల ఆయన తీసిన ‘వంగవీటి’ సినిమా అనుటున్నట్లుగానే వివాదాస్పదమయింది. వంగవీటి రంగా కుటుంబంపై అభ్యంతరకర దృశ్యాలు చిత్రీకరించారంటూ రంగా తనయుడైన మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తాజాగా మీడియాకెక్కి, డిజిపికి సైతం ఫిర్యాదు చేశారు. తాజాగా తన తండ్రి రంగా వర్ధంతి సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాధా సినిమా దర్శక, నిర్మాత వర్మపై కారాలు, మిరియాలు నూరారు. వర్మను ఆయనో ‘పకోడిగాడు’గా అభివర్ణించి ఆ వేస్ట్‌ఫెలో తీసిన సినిమా గురించి మాట్లాడాల్సిన పనిలేదని, తగిన మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. అయితే, వర్మ కూడా ఎక్కడా తగ్గకుండా బస్తీమే సవాల్ అని ఘాటుగా కౌంటర్ ఇచ్చి, రంగాను గాంధీ మహాత్ముడిలా చూపించాలా?.. అంటూ సెటైర్లు సంధించడంతో వంగవీటి సినిమా వ్యవహారానికి బోలెడంత ఉచిత ప్రచారం లభించినట్టయింది. ఇద్దరి మాటల తూటాలు ఘాటుగానే సాగాయి.
‘ఎవడో పకోడిగాడు తలాతోక లేకుండా తీసిన సినిమా గురించి మాట్లాడుకోనక్కరలేదు. ఆ వర్మకు డబ్బే ప్రధానమనుకుంటే రంగా అభిమానులే చందాలు పోగుచేసి ఆయన ముఖాన విసిరేసేవారం’ అని వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. రంగా 28వ వర్ధంతి సందర్భంగా సోమవారం విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న రాధాకృష్ణ తొలుత బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.‘అసలు వంగవీటి అనేది బ్రాండ్ నేమ్. ఎవడో పకోడిగాడు తీసిన సినిమా వల్ల ఆ బ్రాండ్ వాల్యూ తగ్గ’దన్నారు. అసలు ముందూవెనుకా తెలియని ఇలాంటి వేస్ట్‌ఫెలో తీసిన సినిమా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రంగాను దారుణంగా హత్య చేసినవారు నేటికీ దర్జాగా తిరుగుతున్నా ఆయన కళ్లకు కన్పించడం లేదా? అంటూ, తనకే అన్నీ తెలుసంటూ కోతలుకోసే వర్మ రంగా క్యారెక్టర్‌ను తప్పుగా చిత్రీకరించినందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రాధా హెచ్చరించారు. ఈ సినిమాపై తాను ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏమిచేయాలో, తానేమిచేయాలో తనకు బాగా తెలుసన్నారు.
రంగాను గాంధీగా చూపించాలా?:వర్మ
తననేదో చేసేస్తానంటూ వంగవీటి రాధాకృష్ణ చేస్తున్న బెదిరింపులకు తాను ఏమాత్రం భయపడేది లేదన్న రాంగోపాల్‌వర్మ బస్తీమే సవాల్ అన్నారు. ఆయన ఒక ప్రైవేటు చానెల్‌లో మాట్లాడుతూ రాధాపై విరుచుకుపడ్డారు. రంగా క్యారెక్టర్‌ను వక్రీకరించానన్నది పూర్తి అవాస్తవమంటూ ‘ఆయన ఉద్దేశం రంగాను బోసిపళ్ల మహాత్మాగాంధీగా చూపించాలా? మర్డర్ల మాట అటుంచి ఎవర్నీ మొట్టికాయ కూడా కొట్టలేదని చూపించాలా? మదర్ థెరిస్సా కంటే సాత్వికునిగా చూపించాలా? లేక నిరంతరం అన్నదానాలు, ప్రజాసేవ మినహా చీమకైనా హానిచెయ్యని గౌతమబుద్ధునిగా చూపించాలా?’.. అంటూ సెటైర్లు సంధించారు. ఇక రాధా చెబుతున్నట్లుగా వాస్తవాలే చూపించాల్సివస్తే రంగా గురించి, ఆయన భార్య గురించి రంగా అభిమానులు వినటానికి, చూడటానికి ఇష్టపడని ఆధారాలతో కూడిన వాస్తవాలను తు.చ.తప్పక చూపించగలనన్నారు. అయితే రంగాపై ఉన్న గౌరవంతో వాటిని ఎక్కడా చూపించలేదన్నారు. ఆయనకు దమ్ముంటే అవాస్తవాలేమిటో తెలియచేయాలని, ఒకవేళ రాధా డిమాండ్ చేస్తే వాటినన్నింటినీ కుండబద్దలు కొట్టినట్లు చెబుతానని వర్మ అన్నారు.