రాష్ట్రీయం

అడ్మిషన్లలో తవ్వినకొద్దీ అక్రమాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జనవరి 12: బోగస్ అడ్మిషన్ల కళాశాలలోని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బో గస్ అడ్మిషన్లను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రభూమి’ కార్యాలయానికి బాధితులు మరింత సమాచారాన్ని అందిస్తున్నారు. తమవద్దకు కళాశాల యాజమాన్యం ఎలా వచ్చిందీ, ధృవపత్రాలు ఎలా తీసుకున్నదీ, తమకు జరిగిన నష్టం వివరాలను వారు వెల్లడిస్తున్నారు. ఇదే సమయంలో ‘ఆంధ్రభూమి’లో వచ్చిన బోగస్ అడ్మిషన్ల వార్తను ఆధారం చేసుకొని ఇంటిలిజెన్స్ వర్గాలతో పాటు విద్యాశాఖాధికారులు కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఖమ్మం జిల్లా మండల కేంద్రం కారేపల్లిలోని ఓ డిగ్రీ కళాశాలలో బోగస్ అడ్మిషన్లపై ‘దర్జాగా దోచేస్తున్నారు’.. శీర్షికన ‘ఆంధ్రభూమి’లో మంగళవారం వార్తాకథనం ప్రచురితమైన నేపథ్యంలో మరింత మంది బాధితులు వెలుగులోకొస్తున్నారు. తమకేమీ తెలియదని, టెన్త్ మెమో జిరాక్స్ ఇస్తే చాలు డిగ్రీ అడ్మిషన్ పొందటానికి సరిపోతుందంటే ఇచ్చామని, అసలు వాళ్లు ఏ గ్రూప్‌లో చేర్చుకున్నారో కూడా తమకు తెలియదని కొందరంటే, తామసలు కళాశాలలోనే చేరలేదంటూ మరికొందరు చెబుతున్నారు. కళాశాల ద్వారా యూనివర్సిటీకి, ఇ-పోస్‌కు అప్‌లోడ్ చేసిన ఫొటోలు అసలు తమవికాదని మరికొందరు వాపోయారు. తాము ఈ కళాశాలలో చేరి ఉంటే తమవద్ద నుండి ఒరిజినల్ సర్ట్ఫికెట్లు తీసుకోవాలి కదా!.. అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న కారేపల్లిలోని సదరు కళాశాల యాజమాన్యం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని విద్యార్థులను కూడా బోగస్ ధ్రువపత్రాలతో అడ్మిషన్లు చేయించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌కు చెందిన ఇంద్రకంటి శ్రావణి మానుకోటలో పారామెడికల్ కోర్సులో చదువుతుండగా, సదరు కళాశాలవారు ఫొటోను మార్చేసి ఇ-పోస్‌లో, యూనివర్సిటీ పోర్టల్‌లోనూ అప్‌లోడ్ చేశారు. కారేపల్లి మండలం భాగ్యనగర్ తండాకు చెందిన దసానియా సంజీవ్ మాట్లాడుతూ తనవద్ద టెన్త్ మెమో జిరాక్స్ మాత్రమే తీసుకున్నారని, ఆతర్వాత ఏమిజరిగిందో తనకు తెలియదన్నాడు. కాగా కళాశాలకు యూనివర్సిటీ నుండి వచ్చిన నామినల్ రోల్‌లో చూస్తే తన ఫొటోకు బదులు వేరొకరి ఫొటో ఉందని, తాను అసలు ఏ గ్రూపో ఇంతవరకు తెలియదన్నాడు. ముక్కా ఆంజనేయులు, లావుడ్యా గోపాల్ స్పందిస్తూ జిరాక్స్‌ల వరకే తమకు తెలుసని, ఆతర్వాత ఏమీ తెలియదని వాపోయారు.
వారు బిఎస్సీ (బిజెడ్‌సి)లో అడ్మిషన్ పొందినట్లు ఉండగా ఇద్దరికీ ఒకే ఫొటోలు యూనివర్సిటీ నామినల్ రోల్స్‌లో అప్‌లోడ్ చేసి ఉండటం గమనార్హం. కారేపల్లికి చెందిన మేదరి లాలస హైదరాబాద్‌లో చదువుతుండగా ఈ కళాశాలలో అడ్మిషన్ ఉండ టం, ఇ-పోస్‌కు కూడా దరఖాస్తు చేసినట్లు ఉండ టం చూసి ఆశ్చర్యపోతోంది. మంగళవారం సోషల్ వెల్ఫేర్ అధికారులు దీని గురించి ఆరాతీశారు. త్వరలోనే విచారణ జరపనున్నట్లు వారు అంటుండగా, గతం నుండి ఈ శాఖ ద్వారానే అక్రమాలు జరిగాయని, దీనిపై ఉన్నతాధికారులు స్వయంగా విచారణ చేపడితేనే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశాలున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ బోగస్ అడ్మిషన్ల కళాశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ‘దోస్త్’లో ఉన్న లోపాలు, ఇ-పోస్‌లో అక్రమాలకు అవకాశమున్న అంశాలను సరిచేసి ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.