రాష్ట్రీయం

బరితెగింపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు/ రాజమహేంద్రవరం, జనవరి 13: ఈ సంక్రాంతి సీజనులో గోదావరి జిల్లాల్లో కోడిపందాలు జరుగుతాయా, జరగవా అన్న మీమాంసకు తెరదించుతూ, పందేల రాయుళ్లు రెచ్చిపోయారు. నిబంధనలను తుంగలో తొక్కి, కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోడి పందేలకు శ్రీకారం చుట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాల జాతర శుక్రవారం మొదలైంది. ‘కత్తులు కట్టకుండా, నగదు బెట్టింగులు లేకుండా సంప్రదాయాన్ని కాపాడే రీతిలో పందాలు జరుపుతాం’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన నిర్వాహకులు వాటన్నిటినీ తుంగలో తొక్కారు. తొలి రోజే కొన్ని వేల మూగ జీవాలు రక్తపుమడుగులో కుప్పకూలాయి. ప్రతి పందానికి బెట్టింగులు సైతం లక్షల్లో సాగాయి. నోట్ల రద్దు ప్రభావం ఏమాత్రం కనిపించని రీతిలో సర్వత్రా రూ.2000 నోట్లు నాట్యమాడాయి.
జిల్లా యంత్రాంగాలు అర్భాటంగా ప్రకటించిన సంయుక్త తనిఖీ బృందాలు పత్తా లేవు. పోలీసులు కూడా పూర్తిస్ధాయిలో ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. అధికశాతం పోలీసులు సివిల్ డ్రస్‌లో బరుల ప్రాంతాల్లోనే దర్శనమిచ్చారు. ఇదేంటని అడిగితే ‘ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. జనం ఎటుఉంటే అటువైపే మేమూ వెళ్లకతప్పని పరిస్థితి. కోడిపందాలపై ఎన్ని అంక్షలు, ఉత్తర్వులున్నా జనం వాటివైపే మొగ్గు చూపుతున్నందున మేము కూడా చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది’ అని వాపోవటం గమనార్హం. ఇక ఎక్కడికక్కడ రాజకీయ నాయకులే రంగప్రవేశం చేసి పందాల బరులకు ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారంటే ఈ బరి తెగింపు ఏ స్థాయికి చేరిందో అర్ధమవుతుంది. ఈసారి పందేలకు వచ్చిన వారిలో మహిళలు కూడా ఉండటం మరో విశేషం.
గతంతో పోలిస్తే పందాలు మరింత జోరుగా సాగాయి. ఈసారి కోడిపందాల కన్నా జూదాలు భారీస్థాయిలో సాగిపోయాయి. చిన్న పిల్లలు కూడా కోతాటలు, గుండాటలు నిర్వహించడం గమనార్హం. నగదు కోసం జనం ఎటిఎంలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షణాలు చేస్తుంటే పందేలరాయుళ్ల దగ్గర మాత్రం 500, 2000 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ప్రామిసరీ నోట్లు, చెక్కుబుక్‌లు కూడా చాలా బరుల దగ్గర దర్శనమిచ్చాయి.
కాగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ ఈ పరిస్థితులు గమనించి పందాలు జరుగుతాయని భావిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధిస్తునట్లు ప్రకటించారు. ఈనెల 25వ తేదీ వరకు ఇది అమలులో ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఆ నిబంధనలు ఎక్కడా అమలైన దాఖలాలు లేవు.
మొదటిరోజు శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఆచంట, యలమంచిలి, మొగల్తూరు, ఆకివీడు, పాలకొల్లు, వీరవాసరం, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, చింతలపూడి, పెదవేగి, ద్వారకాతిరుమల, కామవరపుకోట, నల్లజర్ల తదితర మండలాల పరిధిలో ఒక మోస్తరు నుంచి భారీస్ధాయివరకు పందాలు కొనసాగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, నరేంద్రపురం, దివాన్‌చెరువు, పుణ్య క్షేత్రం, గాడాల, మధురపూడి, ధవళేశ్వరం, గోడి, గోడిలంక, ఎస్ యానాం, వివి మెరక, దేవరపల్లి, మురమళ్ళ, హుస్సేన్‌పురం, గంగంపాలెం, కె.వీరవరం తదితర ప్రాంతాల్లో యథేచ్ఛగా కోడిపందాలు సాగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి.