రాష్ట్రీయం

‘మిగులు’ తంటాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఈ ఏడాదీ రికార్డు నిలపడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లోని ఆర్థిక లోటుతోపాటు నోట్ల రద్దుతో తగ్గిన ఆదాయాన్ని ఏవిధంగా పూడ్చుకోవాలని యోచిస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా ప్రణాళికేతర వ్యయంకంటే ప్రణాళికా వ్యయానే్న ఈసారీ ఎక్కువ చూపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుత 2016-17 వార్షిక బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.67,000 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ.62 వేల కోట్లు. ఈ రెండిండికీ మధ్య వ్యత్యాసం రూ.5000 కోట్లు. వచ్చే వార్షిక బడ్జెట్‌లో (2017-18) వ్యత్యాసంలో మార్పు లేకుండా ప్రణాళిక వ్యయం రూ.70 వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.65 వేల కోట్లుగా ఉండే అవకాశం ఉందని ఆర్థికశాఖ వర్గాల సమాచారం. గతంలోకంటే ప్రణాళిక వ్యయాన్ని ఈసారి బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు పెంచడం ద్వారా రూ. 70 వేల కోట్లకు, అలాగే ప్రణాళికేతర వ్యయాన్నీ రూ.3 వేల కోట్లమేర పెంచడం ద్వారా రూ.65 వేల కోట్లకు చేర్చి సమతూక బడ్జెట్ రూపొందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. అయితే ప్రణాళిక వ్యయాన్ని నిరుడికంటే రూ.3 వేల కోట్లు పెంచాలంటే పరోక్షంగా రూ.6 వేల కోట్లు పెంచాల్సి ఉంది. నోట్ల రద్దుతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్ల ఆదాయం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. తగ్గిన రూ.3 వేల కోట్ల రాబడి, పెంచనున్న ప్రణాళిక వ్యయం రూ.3 వేల కోట్లు కలిపి రూ.6 వేల కోట్లకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి గత ఏడాది ప్రతిపాదించిన రూ.1,30,416 కోట్ల బడ్జెట్‌లో ఆర్థిక లోటును రూ.23,467 కోట్లుకు అంచనా వేసింది. నిరుడి బడ్జెట్‌లోని రూ.23,467 కోట్ల లోటుతోపాటు ఈసారి పెరుగనున్న ప్రణాళిక వ్యయానికి చేరుకోవడానికి మరో రూ.6వేల కోట్లు కావాల్సి ఉంటుంది. మొత్తంగా కలిపితే దాదాపు ఈసారి బడ్జెట్‌లో అదనంగా రూ.30 వేల కోట్ల ఆదాయాన్ని పూడ్చుకోవాల్సి ఉంటుంది. స్టేట్ ఓన్ టాక్స్, స్టేట్ ఓన్ నాన్ టాక్స్ రెండింటిపై కూడా పెద్ద నోట్ల ప్రభావం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం బడ్జెట్‌లో స్టేట్ ఓన్ టాక్స్ రూ.54,870 కోట్లు, స్టేట్ నాన్ టాక్స్ రూ.17,542 కోట్లుగా అంచనా వేసింది. అలాగే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను రూ.13,955 కోట్లుగా అంచనా వేసింది. రాష్ట్రంలో వసూలు చేసే కేంద్ర పన్నులపైనా నోట్ల రద్దు ప్రభావం ఉండటంతో కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇన్ని ప్రతికూల అంశాలను అధిగమించి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చూపాలంటే, అందుకు ఆదాయం పెంచుకోవడానికి ఉన్న మార్గాలు ఏమేమి ఉన్నాయని ఆర్థిక శాఖ ఆరా తీస్తోంది. నిరర్ధక భూములను విక్రయించాలని రెండేళ్లుగా ప్రభుత్వం భావిస్తున్నా, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుత బడ్జెట్‌లోనూ భూముల అమ్మకం ద్వారా రూ.10,900 కోట్ల ఆదాయం లభించనుందని అంచనా వేసింది. అయితే ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో ఆ మొత్తాన్ని పొందలేకపోయింది. ఆర్థిక లోటు రూ.23,500 కోట్లు, ప్రణాళిక వ్యయం పెంపుదలకు రూ.3 వేల కోట్లు, నోట్ల రద్దుతో తగ్గిన 3 వేల కోట్లు, భూముల విక్రయం ద్వారా అంచనా వేసిన 10 వేల కోట్లు మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.40 వేల కోట్ల ఆదాయ వనరులను చూపెట్టగలిగితే తప్ప మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రాంగా నిలబెట్టడం కష్టతరమని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చూపడానికి ఉన్న ప్రతికూలతలను ఏవిధంగా అధిగమిస్తుందో వేచి చూడాలి.
శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ శాఖాధిపతులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం 2017-18 బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖాధిపతులకు సిఎస్ దిశ నిర్దేశం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతల మేరకు వివిధ శాఖలు ప్రతిపాదనలు చేయాలన్నారు. ప్రణాళికా, ప్రణాళికేతర ప్రతిపాదనలు వేర్వేరుగా ఉండాలన్నారు. నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయంపై ప్రభావం ఉందని, అలాగే జిఎస్‌టి ప్రభావం కూడా పడిందని, వీటిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.