రాష్ట్రీయం

దేవాలయాల ఇఓలకు ‘చెక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 6: ఎపిలోని హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు, ఇతర ఆలయ సిబ్బందికి ‘చెక్’ పెట్టాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. దేవాలయాల్లో ఇఓలు పరిపాలనాపరంగా ఉన్నతస్థాయిలో ఉంటున్నారు. దాంతో ఇఓలు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న అపవాదు వస్తోంది. ఆలయాల్లో కీలకమైన భూమిక పోషిస్తున్న అర్చకులపై ఇఓలు పెత్తనం చేస్తున్నారు. చాలా ఆలయాల్లో అర్చకుల పట్ల గౌరవంగా, మర్యాదగా ఉండటం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా అన్నవరం ఆలయంలో ఒక అర్చకుడి పట్ల సదరు ఇఓ దురుసుగా ప్రవర్తించారని, దాంతో అర్చకులంతా నిరసన వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనకు పూనుకున్నారు. గతంలో అనేక దేవాలయాల్లో ఈ తరహా సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ కారణంగా సిబ్బందితో పాటు ఇఓల కోసం ప్రత్యేకంగా ‘ప్రవర్తనా నియమావళి’ రూపొందించాలని దేవాదాయ శాఖ కమిషనర్ వైవి అనురాధ భావిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళి లోపభూయిష్టంగా ఉండటంతో సమర్థమైన ప్రవర్తనా నియమావళి రూపొందించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు.
ఇఓలకు డ్రెస్ కోడ్ ఉండాలని, విధిగా పంచె, కండువా, ఉత్తరీయం ధరించి ఆలయ విధులకు హాజరయ్యేలా నియమావళి రూపొంచాలని భావిస్తున్నారు. ఇఓలుగా నియామకం చేసే ముందు వారికి సంస్కృతం, వేదాలు, ఆగమశాస్త్రంలో కొంతైనా అవగాహన ఉండేలా చూడాలని భావిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల పట్ల ఇఓలతో పాటు దేవాలయ సిబ్బంది అంతా మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించేలా చూడాలని భావిస్తున్నారు. ఇఓల నియామకం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతోంది. జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, కరెంట్‌అఫైర్స్, రాజకీయాలు తదితర అంశాలపైనే వీరికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అందుకే వీరిని ప్రభుత్వ సిబ్బందిగా పరిగణిస్తున్నారు. ఈ విధానంలో సమూల మార్పులు తీసుకురావాలన్న ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఆయల నిర్వహణపై అవగాహన ఉండాలన్నది ప్రధానమైన అంశంగా మారింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఇఓలకు ‘ఓరియంటేషన్ ట్రైనింగ్’ ఇవ్వాలని భావిస్తున్నారు. దేవాదాయ మంత్రి మాణిక్యాల రావుతో దేవాదాయ శాఖ కమిషనర్ ఈ అంశంపై పలుపర్యాయాలు చర్చించారు. కమిషనర్ ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం తెలిపినట్టు తెలుస్తోంది. ఒక్క ఇఓలకే కాకుండా దేవాలయాల్లో పనిచేసే అందరికీ ‘ప్రవర్తనా నియమావళి’ని రూపొందించి అమలు చేయాలని మంత్రి సూచించినట్టు తెలిసింది.